టీజీపీఎస్సీ, ఇతర అప్పీళ్లపై వాదనలు ముగించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్‌పై సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లలో సీజే ధర్మాసనం వాదనలు ముగించింది. వచ్చే నెల 22న తీర్పు వెల్లడిస్తామని చెప్పింది. గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట్ శివనగర్‌కు చెందిన కె.పర్శరాములుతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
వీటిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. మార్చి 10న వెలువరించిన తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేశారు. గ్రూప్–1 మెయిన్స్ అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని కమిషన్‌ను ఆదేశించారు. ఇది సాధ్యంకాని పక్షంలో మెయిన్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని చెప్పారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థి అప్పీళ్లు దాఖలు చేశారు.
వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి, అభ్యర్థుల తరఫున దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘నిబంధనల ప్రకారమే పరీక్షలు జరిగాయి. మూల్యాంకనంలో అవకతవకలు చోటుచేసుకోలేదు.
హాల్ టికెట్ల జారీ, పరీక్ష కేంద్రాల కేటాయింపు, నిర్వహణ, మూల్యాంకనం అంతా పకడ్బందీగా నిర్వహించారు. కాపీయింగ్ జరిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. పరీక్ష జరిగినప్పుడు కాకుండా.. ఫలితాల తర్వాత అర్హత సాధించని వారు పిటిషన్ వేయడం సరికాదు’అని చెప్పారు.
రిట్ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘ప్రభుత్వ ఆమోదం లేకుండా ఉద్యోగాలను పెంచడం నిబంధనలకు విరుద్ధం. గతంలో ఏ పరీక్షకు ఇలా ప్రిలిమ్స్, మెయిన్స్‌కు రెండు హాల్‌టికెట్లు జారీ చేయలేదు. కేవలం నాలుగు సెంటర్ల నుంచే 160 మంది వరకు ఎంపికయ్యారు. మూల్యాంకనం కూడా తప్పులతడకగా సాగింది’అని పేర్కొన్నారు.
డిప్యుటేషన్ పూర్తయ్యాక కొనసాగించే హక్కు రాష్ట్రాలకు లేదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సర్వీస్ కేడర్ ఉద్యోగుల డిప్యుటేషన్ గడువు ముగిశాక కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సర్వీస్ కొనసాగించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కేడర్ నిబంధనల ప్రకారమే ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ ఉంటుందని చెప్పింది. దీనిపై అధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. గడువు తీరిన తర్వాత కూడా తెలంగాణలో పనిచేసిన ఇద్దరు ఐపీఎస్‌ల సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటూ క్యాట్ ఇచి్చన ఉత్తర్వులను రద్దు చేసింది.
కేంద్ర ప్రభుత్వ డిప్యుటేషన్ కాలపరిమితిని మించి విధులు నిర్వహించిన కాలానికి అన్ని ప్రయోజనాలు కల్పించాలని కోరుతూ తమిళనాడు కేడర్‌కు చెందిన డి.కల్పననాయక్, మహేంద్రకుమార్ క్యాట్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ వారికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది.
పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించింది. గడువుకు మించి పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోలేమన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థించింది.


