పవన్‌ అభిమానుల నుంచి ముప్పు.. బొగ్గుల శ్రీనివాస్‌ అనుమానాస్పద మృతి | Prominent writer Boggula Srinivas suspicious car incident | Sakshi
Sakshi News home page

పవన్‌ అభిమానుల నుంచి ముప్పు.. బొగ్గుల శ్రీనివాస్‌ అనుమానాస్పద మృతి

Feb 15 2026 8:27 AM | Updated on Feb 15 2026 10:09 AM

Prominent writer Boggula Srinivas suspicious car incident

పాలేరు రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లిన కారు

పవన్‌కళ్యాణ్‌ రాజకీయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ పుస్తకం రచన 

కారు నడిపిన వ్యక్తి ఒడ్డుకు చేరాక పరారవడంపై అనుమానాలు

కూసుమంచి (ఖమ్మం): తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్‌ (45) అనుమానాస్పద స్థితిలో దుర్మరణం పాలయ్యారు. శనివారం ఉదయం 7–30 సమయంలో కారు నీళ్లలో కొంతమేర మునగగా.. వెనుక సీటులో కూర్చున్న శ్రీనివాస్‌ మృతి చెందడం.. డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి పరారవడం అనుమానాలకు తావిస్తోంది. మృతుడు శ్రీనివాస్‌ కర్నూలు జిల్లా అల్లూరు గ్రామా­నికి చెందినవారు. సాహిత్య పరిశోధకుడిగా, యూట్యూబర్‌గానూ గుర్తింపు పొందారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ పూర్తిచేసిన ఆయన పలు పుస్తకాలు రచించగా.. 2014లో పవన్‌కళ్యాణ్‌ రాజకీయ రంగప్రవేశంపై ‘పవన్‌కళ్యాణ్‌ హటావో.. పాలిటిక్స్‌ బచావో’ పేరిట పుస్తకం రా­శారు. ఈ పుస్తకం 8 లక్షలకుపైగా కాపీలు అమ్ముడు­పోయిందని సమాచారం. పవన్‌కళ్యాణ్‌ అభిమాను­ల నుంచి ముప్పు పొంచి ఉండటంతో తెలంగాణ ప్ర­భుత్వం అప్పట్లో ఆయనకు రక్షణ కూడా కల్పించింది. 

ఏం జరిగిందంటే.. 
పాలేరు రిజర్వాయర్‌లోకి శనివారం ఉదయం ఏపీ 16 డీపీ 2345 నంబరు కారు దూసుకెళ్లింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గుర్తించి స్థానికులకు సమాచారం ఇవ్వగా.. ట్రాక్టర్‌ సాయంతో ఒడ్డుకు లాగారు. కారు నీళ్లలో కొంతమేర మునగగా, వెనుక సీటులో కూర్చు­న్న శ్రీనివాస్‌ మృతి చెంది ఉన్నాడు. అయితే, కారు నీటిలో పడిన సమయాన డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి నాయకన్‌గూడెం వైపు వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఖమ్మం రూరల్‌ ఏసీపీ ఘటనాస్థలిని పరిశీలించారు.

బయటపడిన వ్యక్తి ఏమైనట్టు? 
కారులో ఇద్దరు ఉండగా డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి నీళ్ల­లో నుంచి ఒడ్డుకు రాగానే వెళ్లిపోవడం అనుమానాలకు తావి­స్తోంది. వెనుకాల సీటు­లో కూర్చున్న వ్యక్తిని కాపాడకుండా హడావుడిగా వెళ్లిపోవడం ప్రశ్నార్థకంగా మారింది. మరోపక్క మృతుడి నుదురు, ముఖంపై గాయాలు ఉండగా కారు నీటిలో పడిన సమయాన తగిలాయా, ఎక్కడైనా హత్య చేసి కారులో తీసుకొచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌కళ్యాణ్‌పై పుస్తకం రాసిన దృష్ట్యా శ్రీనివాస్‌కు ఆయన అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం రక్షణ కలి్పంచిందని శ్రీనివాస్‌ స్నేహితులు ‘సాక్షి’కి తెలిపారు. ఈనేపథ్యంలో శ్రీనివాస్‌ది ముమ్మాటికీ హత్యేనని, పోలీసులు విచారణ జరిపి హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు. కారు రిజర్వాయర్‌లో పడిన ప్రాంతాన్ని పరిశీలిస్తే హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వైపు వస్తున్నట్టు తెలు­స్తోంది. 

ఖమ్మం చేరేందుకు హైవే ఉన్నప్పటికీ పాత సర్వీస్ రోడ్డును ఎంచుకోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు రిజర్వాయర్‌లో పడిపోయి ప్రమాదం జరిగినట్టు చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా అని పోలీసులు, మృతుడి స్నేహితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారు నీట మునిగాక ఒడ్డుకు చేరి వెళ్లిపోయిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తూనే నాయకన్‌గూడెం వద్ద ఉన్న టోల్‌ప్లాజా సీసీ ఫుటేజీల ద్వారా కారు నంబర్‌ సేకరించి ఎవరిదనే కోణంలో విచారిస్తున్నారు. కాగా, శ్రీనివాస్‌ మృతదేహం ప్రస్తుతం నేలకొండపల్లి ఆస్పత్రి మార్చురీలో ఉండగా, ఆయన సోదరులు శనివారం అర్ధరాత్రి వరకు ఇక్కడకు చేరే అవకాశముందని సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement