సిలబస్ స్థాయి పెంచనున్న బోర్డు
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలే ప్రామాణికం
కొత్త కోర్సులు.. మార్కుల విధానంలో మార్పులు
తెలుగు, చరిత్ర పుస్తకాల్లో రాష్ట్ర చరిత్ర, సంస్కృతికి ప్రాధాన్యం
ఇక బహుళ వర్ణాల్లో పాఠ్య పుస్తకాలు
2026–27 విద్యా సంవత్సరం నుంచే అమలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ సిలబస్ స్థాయిని పెంచాలని బోర్డు నిర్ణయించింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) పాఠ్యాంశాలను ప్రామాణికంగా తీసుకోనుంది. ఇంటర్మీడియెట్ విద్యలో మార్పుల దిశగా నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికకు ఇటీవల ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో 2026–27 విద్యా సంవత్సరం నుంచే మార్పులు అమలులోకి తెచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
తెలుగు, చరిత్ర పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతితో కూడిన పాఠ్యాంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ విధంగా పుస్తకాల ముద్రణ కోసం త్వరలో తెలుగు అకాడమీకి ప్రతిపాదనలు వెళ్ళనున్నాయి. కాగా పుస్తకాలను మల్టీ కలర్ (బహుళ వర్ణాల్లో)లో ముద్రించాలని నిర్ణయించారు. మార్పులు చేర్పులతో కూడిన పుస్తకాలను ఏప్రిల్ రెండో వారంలో అందుబాటులోకి తెచ్చే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. కొత్త సిలబస్‌పై వేసవి సెలవుల్లో అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
కొత్తగా ఏసీఈ
» ఇంటర్మీడియెట్ కోర్సుల్లో గుణాత్మక మార్పులకు ఇంటర్ బోర్డు ఆమోదం తెలిపింది. అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ (ఏసీఈ) కోర్సును అందుబాటులోకి తీసుకొస్తారు. సీఈసీ, ఏసీఈ పుస్తకాలు వేర్వేరుగా ముద్రిస్తారు.
» ఎంఈసీ కోర్సులో గణితం సబ్జెక్టుకు 150 మార్కులకు పరీక్షలను నిర్వహించి, 100 శాతం మార్కులనే లెక్కించేవారు. కానీ ఇప్పుడు 100 మార్కులకే ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. 80 మార్కులకు థియరీ, 20 మార్కులకు ఇంటర్నల్స్ ఉంటాయి.
» ఈసారి పుస్తకాల ముద్రణకు సమాంతరంగా తర్జుమా కూడా చేస్తున్నారు. ఇదివరకు ఇంగ్లిష్ మీడియం పుస్తకాలు ముద్రించిన ఏడాదికి ఉర్దూ మీడియం పుస్తకాలొచ్చేవి. కానీ ఇప్పుడు ఇంగ్లిష్ మీడియంతో పాటే ఉర్దూ మీడియం పుస్తకాలను ముద్రిస్తున్నారు.
» పుస్తకాల ముద్రణకు వినియోగించే పేపర్‌ను మార్చారు. ఈసారి 70 జీఎస్‌ఎం, ఎస్‌ఎస్ మ్యాప్‌లితో పేపర్‌ను వినియోగిస్తారు.
» పాఠ్య పుస్తకాలను క్యూఆర్ కోడ్‌తో ముద్రిస్తున్నారు. కోడ్‌ను స్కాన్ చేయగానే అదనపు అంశాలు ప్రత్యక్షమవుతాయి.
» ఆర్ట్ కోర్సుల్లో 80 మార్కులకు థియరీ, 20 మార్కులకు ఇంటర్నల్స్ ఉంటాయి. గణితం పరీక్షను ఇక నుంచి 60 మార్కులకే నిర్వహిస్తారు. ఇప్పటివరకు 75 మార్కులకు నిర్వహించగా, 15 మార్కులకు ఇంటర్నల్స్ ఉండేవి.
» సైన్స్ కోర్సుల్లో 30 మార్కులు ప్రాక్టికల్స్‌కు ఉండగా, మొదటి సంవత్సరంలో 15 మార్కులకు ఇంటర్నల్స్ ఉంటాయి. సెకండియర్‌లో 15 మార్కులకు ఎక్స్‌టర్నల్ ప్రాక్టికల్ పరీక్షలుంటాయి.


