రాష్ట్రంలో అన్ని రకాల నేరాల్లో కలిపి 2 శాతం తగ్గుదల
2024లో 2,34,158 కేసులు నమోదు కాగా.. 2025లో 2,28,695 కేసులు నమోదు
6 శాతం పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. 8 శాతం తగ్గిన రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య
2025లో మొత్తం నాలుగు కేసుల్లో నిందితులకు మరణశిక్ష
తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక 2025లో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: గతేడాదితో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల నేరాల్లో కలిపి 2.33 శాతం తగ్గుదల నమోదైనట్టు తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక 2025 వెల్లడించింది. 2024లో నవంబర్ వరకు 2,34,158 కేసులు నమోదు కాగా, 2025లో నవంబర్ వరకు 2,28,695 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2024లో 35.63 శాతం నేరాల్లో శిక్షలు ఖరారు కాగా..ఈ ఏడాది అది స్వల్పంగా పెరిగింది. 2025లో 38.72శాతంగా నమోదైంది. 2025లో మొత్తం నాలుగు కేసుల్లో నిందితులకు మరణశిక్ష పడింది.
216 కేసులలో 320 మంది నిందితులకు జీవిత ఖైదుపడింది. 2024తో పోలిస్తే 2025లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 5.68 శాతం పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. 2024లో 23,491 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 2025లో ఆ సంఖ్య 24,826కు చేరింది. అదే సమయంలో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యలో 7.9 శాతం, క్షతగాత్రుల సంఖ్యలో 31.8 శాతం తగ్గుదల నమోదైనట్టు వెల్లడించింది. 2024లో రోడ్డు ప్రమాదాల్లో 7,056 మంది మృతిచెందగా..21,664 మంది గాయాలపాలయ్యారు. 2025లో నమోదైన రోడ్డు ప్రమాదాల్లో 6,499 మంది మృతిచెందగా..14,768 మంది క్షతగాత్రులైనట్టు తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా 2024లో 53,651 సీసీటీవీ కెమెరాలు..2025లో 45,137 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 12,09,782 సీసీటీవీ కెమెరాలు ఉన్నట్టు వార్షిక నివేదిక తెలిపింది. 98.9 శాతం అత్యాచారం కేసులలో నిందితులు బాధితులకు తెలిసిన వారే అని, వీరిలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రేమికులు, సహ ఉద్యోగులే ఉన్నట్టు తెలిపింది. అత్యాచార కేసులలో 2024లో 8.81 శాతం కేసులలో నిందితులకు శిక్ష ఖరారు కాగా.. 2025లో 11.18 శాతం కేసులలో నిందితులకు శిక్ష ఖరారైంది.
సైబర్ నేరాలపై అందిన ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంలోనూ తెలంగాణ పోలీసులు ముందంజలో ఉన్న ట్టు తెలిపింది. 2025లో దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు 2 శాతం కాగా..తెలంగాణలో 24 శాతం ఉన్నట్టు తెలిపింది. 2025లో మొ త్తం 371 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు.


