అంబికా అగరబత్తుల నూతన బ్రాండ్ ఆవిష్కరణలో త్రిదండి చినజీయర్‌స్వామి
రాగస్వర సుప్రభాతం పేరుతో మార్కెట్లోకి విడుదల..
ప్యాకెట్ తెరవగానే వేంకటేశ్వర సుప్రభాతం వినిపించడం ప్రత్యేకత: అంబికా కృష్ణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రముఖ అగరబత్తుల తయారీ సంస్థ అంబికా అగరబత్తీస్ అరోమా అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. రాగస్వర సుప్రభాతం పేరుతో నూతన అగరబత్తుల బ్రాండ్ ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. మంగళవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్‌లో కొలువైన సమతామూర్తి సన్నిధిలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి ఆ బ్రాండ్ అగరబత్తులను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అనే మాట విస్తృతంగా ప్రచారం జరిగింది. అందుకు తగినట్లే దైవంపట్ల విశ్వాసాన్ని మరింత పెంచుతూ గొప్పగా ఎదిగింది. దేవునికి సమర్పించే ధూపం ఘాటుగా ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉండకూడదు. ముక్కుకు పరిమళం, కంటికి ఇంపుగా ఉండాలి.
అలాంటి పరిమళ ధూపాన్ని 125 ఏళ్లుగా అందిస్తూ ఎప్పటికప్పుడు అంబికా సంస్థ సరికొత్త ఉత్పత్తులను అందిస్తోంది. పూజ గదిలో అగరబత్తుల పెట్టె తెరవగానే వేంకటేశ్వర స్వామివారి సుప్రభాత స్వరం వినిపించడంతో కొత్త అనుభూతిని పొందుతారు. రాగస్వర సుప్రభాతం అగరబత్తులు భక్తుల ఆధరణ పొందాలి. ప్రతి దైవ సన్నిధానంలోనూ అంబికా సంస్థ సేవలు అందాలి’ అని ఆకాంక్షించారు.
చెవులారా కూడా ఆస్వాదించొచ్చు: అంబికా కృష్ణ
అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ మాట్లాడుతూ.. ‘ఏదైనా అగరబత్తిని వెలిగించినప్పుడు దాని పరిమళాన్ని ముక్క ద్వారానే ఆస్వాదిస్తాం. కానీ ముక్కు ద్వారానే కాకుండా చెవుల ద్వారా కూడా ఆస్వాదించే ఒక అద్భుతాన్ని మా రాగస్వర సుప్రభాతం అగర్‌బత్తి ప్యాకెట్లో నిక్షిప్తం చేశాం. ప్యాకెట్ తెరవగానే వేంకటేశ్వర సుప్రభాతం వినిపిస్తుంది. చెవులకు భక్తిని అనుసంధానిస్తుంది’ అని చెప్పారు.
భగవంతుడిని మేల్కొలిపే సుప్రభాత మధుర పిలుపు.. మనలో దైవత్వాన్ని కూడా మేల్కొలుపుతుందని అంబికా సంస్థల డైరెక్టర్ రామచంద్రరావు చెప్పారు. అన్ని పూజా స్టోర్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రాగస్వర సుప్రభాతం అగరబత్తులు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఒక్కో ప్యాకెట్ ధరను రూ. 200గా ఖరారు చేసినట్లు చెప్పారు.


