జీహెచ్‌ఎంసీలో విలీనంతో తగ్గిన ప్రజాప్రతినిధుల ప్రాబల్యం
ఐదేళ్ల క్రితం 900, నేడు 84 పడిపోయిన వైనం
మేడ్చల్: ఐదేళ్ల క్రితం వరకు తెలంగాణలో ఉన్న అన్ని రకాల స్ధానిక సంస్థల ప్రజాప్రతినిధుల పాలనతో రాష్ట్రంలో ఏకైక నియోజకవర్గంగా ఉన్న మేడ్చల్ ప్రజాప్రతినిధుల పదవుల సంఖ్య తగ్గిపోవడంతో రాజకీయంగా వెలవెలబోతుంది. మేడ్చల్ నియోజకవర్గంలో గతంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ సభ్యులు, గ్రామాలకు సర్పంచ్‌లు, పట్టణాలకు కౌన్సిలర్లు, చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు ఇలా అన్ని రకాల పాలన ఉండేది. ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలు మినహాయించి ఏడింటినీ, మూడు కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడంతో నాడు 900 మంది ప్రజా ప్రతినిధులు ఉన్న సంఖ్య నేడు కేవలం 84కు పడిపోయింది.
మేడ్చల్‌లో 60 మంది గ్రామ సర్పంచ్‌లు, 37మంది ఎంపీటీసీ సభ్యులు, 202 మంది కౌన్సిలర్లు, ఐదు మంది ఎంపీపీలు, ఐదుగురు జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్, 7 మంది చైర్మన్‌లు, ముగ్గురు మేయర్లు, 600 మంది వరకు వార్డు సభ్యులు ఉండేవారు. ప్రస్తుతం మేడ్చల్‌లో ఎల్లంపేట్, మూడు చింతలపల్లి, అలియాబాద్ (Aliabad) మున్సిపాలిటీలు మాత్రమే మిగిలాయి. ఎల్లంపేట్‌లో 24, మూడు చింతలపల్లిలో 24 వార్డులు, అలియాబాద్‌లో 20 వార్డులు ఉన్నాయి. ఈ లెక్కన 68 మంది కౌన్సిలర్లు ఉండనున్నారు. మొత్తంగా చూస్తే వార్డు సభ్యులు, కో– ఆప్షన్ సభ్యులతో కలిపి చూస్తే 900 వరకు ఉన్న సంఖ్య నేడు 100కు పరిమితమవుతోంది.
భారీగా తగ్గిన ప్రాబల్యం..
జీహెచ్‌ఎంసీలో విలీనం కాకముందు 20 నుంచి 30 వరకు ఒక్కో మున్సిపాలిటీలో ప్రజా ప్రతినిధులు ఉండగా.. విలీనంతో ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కొక్కరు లేదా ఇద్దరు మాత్రమే ఉండనున్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలో 23 వార్డులు ఉండగా.. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో విలీనంతో రెండు డివిజన్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఇద్దరు నేతలు మాత్రమే ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం ఏర్పడింది.
గుండ్లపోచంపల్లిలో 15 వార్డులకు ఒక డివిజన్, నాగారంలో 18కి 1 , దమ్మాయిగూడలో 20కి 2 , ఘట్‌కేసర్‌లో 18 మందికి 2, పోచారంలో 18కి ఒక డివిజన్ మాత్రమే వచ్చాయి. తూంకుంటలో 16 స్థానంలో ఒక డివిజన్ వచ్చాయి. జవహర్‌నగర్‌లో 28 మంది కార్పొరేటర్లు ఉండగా.. ప్రస్తుతం ఇద్దరు, బోడుప్పల్‌లో కార్పొరేటర్లు ఉండగా.. ప్రస్తుతం ఇద్దరు, పీర్జాదిగూడలో 26కు ఇద్దరు కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహించనున్నారు. 299 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లుండగా.. తాజాగా కేవలం 16 సీట్లు మాత్రమే ఉన్నాయి.
నేతల ఆశలు ఆవిరి..
సీట్లు ఎన్ని ఉన్నా.. గెలిచేది ఒకరే అయినప్పటికీ పోటీచేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వారు అన్ని పార్టీల్లో ఉంటారు. కనీసం పోటీ చేసేందుకు స్థానాలు కూడా కరువయ్యాయి. ఒక్క పార్టీ నుంచి ఒక్కరు పోటీ చేసినా ఒక్క స్థానం ముగ్గురు పోటీ చేయడం పక్కా.. కొన్ని స్థానాల్లో 5 వరకు ఉంటాయి. ఏ లెక్కన చూసినా మేడ్చల్ రాజకీయ నాయకులకు కనీసం ఎన్నికల్లో పోటీ చేశామనే సంతృప్తి సైతం లేకుండా పోయింది.
మూడు ఉంటాయా పోతాయా..?
మేడ్చల్ నియోజకవర్గంలోని మెజారిటీ ప్రాంతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో విలీనం కావడంతో మిగిలిన 3 మున్సిపాలిటీలు ఉంటాయా.. పోతాయా.. అనే చర్చ మొదలైంది. తర్వాత లక్ష్యం ఆ మూడే అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే మిగిలిన మూడింటితో వార్డుల విభజన పూర్తైంది. జీహెచ్‌ఎంసీ పాలకవర్గం సమయం ముగిసిన వెంటనే మిగిలిన ఎల్లంపేట్, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలు జీహెచ్‌ఎంసీలో విలీనమవుతాయని నేతలు చెబుతున్నారు.
ఆశలు.. నిరాశే
జీహెచ్‌ఎంసీలో (GHMC) విలీనంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎప్పటికైనా ఓ ప్రజా ప్రతినిధి కావాలని సమయం, డబ్బు వృథా చేసుకుని రాజకీయం చేస్తున్న అన్ని పార్టీల నేతల ఆశలు అడియాశలయ్యాయి.
చదవండి: ఐబొమ్మ రవి కేసులో కొత్త మలుపులు
పాలన భారం..
గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు ఉన్న సమయంలో 2 నుంచి 3 వేల మందికి ముగ్గురు ప్రజా ప్రతినిధులు, మండల అధికారి, మున్సిపల్ కమిషనర్ ఉండే వారు. వారిపైన డీపీఓ, సీఈఓ, కలెక్టర్లు మండల అధికారులు ఎంతో పాలన వ్యవస్థ ఉండేది. ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గంలో 4 సర్కిళ్లను ఏర్పాటు చేసి వాటిలో 3–4 డివిజన్లు ఏర్పాటు చేయడంతో సర్కిల్‌కు 1 డిప్యూటీ కమిషనర్, డివిజన్‌కు 1 కార్పొరేటర్, జోన్‌కు 1 జోనల్ కమిషనర్, జోనల్ కమిషనర్‌పైన 1 మేయర్, కమిషనర్ మాత్రమే ఉండటంతో గతంతో పోలిస్తే ప్రజలకు పాలన మాత్రం దూరం కావడం కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయికి ఎదుగుతున్న మేడ్చల్‌ను ఏకంగా నగరంలో విలీనం చేసి నగర పాలన చేస్తుంటే పాలనకు ప్రజలు ఆమడ దూరంలో కనిపిస్తున్నారు.


