భావోద్వేగ మ‌ద్ద‌తుకు పెరుగుతున్న డిమాండ్‌..! ఈ ఏడాదిలోనే ఏకంగా.. | Rising demand for emotional support highlights growing mental health | Sakshi
Sakshi News home page

భావోద్వేగ మ‌ద్ద‌తుకు పెరుగుతున్న డిమాండ్‌..! ఈ ఏడాదిలోనే ఏకంగా..

Dec 29 2025 3:58 PM | Updated on Dec 29 2025 4:19 PM

Rising demand for emotional support highlights growing mental health

దేశవ్యాప్తంగా భావోద్వేగ మ‌ద్ద‌తుకు డిమాండ్ పెరుగుతోంది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య స‌మ‌స్య‌లు ఈ ఏడాది ఎక్కువగా వినిపించాయి. ఏడాది పొడ‌వునా ఆర్థిక ఇబ్బందులు, సంబంధాల సమస్యలు, చదువుపై ఒత్తిడి, ఉద్యోగ భారం, గుర్తింపు సంక్షోభం, సామాజిక ముద్ర వంటి అంశాలతో బాధపడుతున్నవారి నుంచి హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ మానసిక ఆరోగ్య అవగాహన, ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్‌ 1లైఫ్‌ (www.1life.org.in – 7893078930)కు నిరంతరంగా, భారీగా కాల్స్‌ వచ్చాయి. మానసిక ఆరోగ్య సేవలపై అవగాహన పెర‌గంతో పాటు భావోద్వేగ సమస్యల తీవ్రత, సంక్లిష్టత కూడా పెరిగినట్టు ఇది స్పష్టం చేసింది. 

2025లో జనవరి నుంచి డిసెంబర్‌ మధ్య వరకు 1లైఫ్‌కు మొత్తం 38,437 కాల్స్‌ వచ్చాయి. ఈ సంఖ్య అవసరం ఎంత పెద్దదో తెలియజేయడమే కాకుండా, సాధార‌ణ బాధలు సంక్షోభం స్థాయికి చేరకముందే వాటిని అడ్డుకునే విషయంలో అనుభూతితో వినడం, సమయానికి స్పందించడం ఎంత కీలకమో స్పష్టం చేసింది. సంవత్సరం మొత్తం కాల్స్‌ సంఖ్య క్రమంగా పెరిగింది. జనవరిలో 2,224గా ఉన్న నెలవారీ కాల్స్‌ సెప్టెంబరులో గరిష్ఠంగా 4,135కు చేరాయి. 

ఈ పెరుగుదల 86%. జులై నుంచి అక్టోబర్‌ వరకు నెలకు దాదాపు 4,000 కాల్స్ వ‌చ్చాయి. ఈ పెరుగుదల సీజ‌న‌ల్ కాదని, భావోద్వేగ, మానసిక ఆరోగ్య సమస్యలు నిరంతరంగా పెరుగుతున్నాయని ఈ గణాంకాలు సూచించాయి. ఏడాది మొత్తం వాలంటీర్లు కాలర్లకు మద్దతు ఇవ్వడానికి 1,838 గంటలు కేటాయించారు. సగటు కాల్‌ వ్యవధి కూడా పెరిగింది. ఈ సేవ‌ల గురించి 1లైఫ్‌ కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌ రెబెక్కా మారియా మాట్లాడుతూ, “ప్రతి కాల్‌ వెనుక బాధ, అయోమయం, ఒంటరితనం కథలుంటాయి. 

ఆ బాధను ఇతరులతో పంచుకోవడానికి చాలామందికి భద్రత అనిపించదు. మేము చూస్తున్నది సంఖ్యల పెరుగుదల కాదు, బాధ తీవ్రత పెరుగుదల. చాలామంది కాలర్లు సమయం, సహనం, తమ భావాలకు విలువ ఉందన్న భరోసా కోరుతున్నారు. సంక్షోభ త‌రుణం దాటిన తర్వాత కూడా మద్దతు ఉంటుందన్న నమ్మకాన్ని వారు ఆశిస్తున్నారు” అని తెలిపారు. 1లైఫ్‌కు వచ్చిన కాల్స్‌ స్వరూపం కాలర్ల సవాళ్ల విస్తృతి, లోతును ప్రతిబింబించింది. 

ఆర్థిక ఒత్తిడి, సంబంధాలు చెడిపోవ‌డం, చదువు, పరీక్షల ఒత్తిడి, ఉద్యోగ సమస్యలు, ర్యాగింగ్‌, వ్యాపార నష్టాలు తదితర కారణాలతో ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నవారి నుంచి భారీగా కాల్స్‌ వచ్చాయి. ఇటీవల దక్షిణ, ఉత్తర భారతదేశాల నుంచి కూడా కాల్స్‌ పెరిగాయి. “నేటి సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో ప్రజలకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. భావోద్వేగ సహాయానికి పెరుగుతున్న డిమాండ్‌ అదే విషయాన్ని తెలియజేస్తోంది. 

ఎవరికీ వినేవారు లేరన్న భావన రాకుండా చూడడానికే 1లైఫ్‌ పనిచేస్తోంది. కాల్స్‌ సంఖ్య పెరుగుతుండటం దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య అవగాహన, వాలంటీర్‌ శిక్షణ, అందుబాటులో ఉండే మద్దతు వ్యవస్థలపై మరింత పెట్టుబడి అవసరమని స్పష్టం చేస్తోంది” అని 1లైఫ్‌ డైరెక్టర్ టి.శ్రీకర్‌ రెడ్డి తెలిపారు. ఇటీవలి పలు సంఘటనలు ఈ గణాంకాల వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టాయి. బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల యువకుడు ఆన్‌లైన్‌ పెట్టుబడులు, స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయిన తర్వాత 1లైఫ్‌ను సంప్రదించాడు. 

అత‌డు ఇంటిని, భార్య ఆభరణాలను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఆ పరిస్థితి అతడిని తీవ్ర నిరాశకు, ఆత్మహత్య ఆలోచనలకు నెట్టింది. 1లైఫ్ సానుభూతితో వినడం ద్వారా అతడికి తన బాధను చెప్పుకొనే అవకాశం కల్పించింది. సహాయం అందుబాటులో ఉందన్న భావనను అతడిలో మళ్లీ తీసుకొచ్చింది. 

మరో ఘటనలో ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల మహిళ ఆరేళ్ల బంధం ముగిసిన తర్వాత 1లైఫ్‌ను సంప్రదించారు. తామిద్ద‌రం దూరంగా ఉన్న‌ప్పుడు తన భాగస్వామి సహోద్యోగితో సంబంధం పెట్టుకున్నట్టు ఆమెకు తెలిసింది. ఆ మోసం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. మాన‌సికంగా కుంగిపోయిన ఆ క్షణంలో ఆమె మద్దతు కోరారు. 

వివక్షను ఎదుర్కొంటున్నవారి నుంచి కూడా 1లైఫ్‌కు కాల్స్‌ వస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌కు చెందిన 23 ఏళ్ల ట్రాన్స్‌జెండర్‌.. స‌మాజ‌ధోర‌ణి త‌న‌ను ఒంటరిగా, నిరుత్సాహంగా మార్చింద‌ని చెప్పారు. ఎంబీఏ పూర్తిచేసి ఐటీ రంగంలో పనిచేస్తున్నా, తరచూ అవహేళన, దూరం పెట్టడం ఎదురయ్యాయి. అవి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి. సంభాషణలో తీర్పు ఏమీ ఇవ్వ‌కుండా ఆమె అనుభవాలను గుర్తించి, అంగీకరించారు. 

2025 గణాంకాలు, అనుభవాలు దేశవ్యాప్తంగా వేలమందికి 1లైఫ్‌ కీలక జీవనాధారంగా నిలుస్తున్నట్టు స్పష్టం చేశాయి. అదే సమయంలో పెరుగుతున్న డిమాండ్‌ను ఎదుర్కొనే సామర్థ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని అవి సూచించాయి. సామాజిక, ఆర్థిక, వృత్తిరంగాల్లో మానసిక ఆరోగ్య సవాళ్లు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో వాలంటీర్ల నియామకం, శిక్షణ, నిర్వహణ మద్దతుపై నిరంతర పెట్టుబడి అత్యవసరమని ఈ అనుభవాలు తెలియజేశాయి. 

(చదవండి: సెరిబ్రల్ పాల్సీ బాధితుడి సక్సెస్‌ స్టోరీ..తొలి ప్రయత్నంలోనే ఇంజనీరింగ్‌ సర్వీస్ సత్తా చాటి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement