శరీరంలో షుగర్‌ లెవల్స్‌ తెలుసుకోవాలంటే ఈ టెస్ట్‌ తప్పనిసరి | What Is a Hemoglobin A1c Test, How It Detects and Tracks Diabetes | Sakshi
Sakshi News home page

HbA1c గీటురాయి కాదు... తెలుసుకో ‘రక్తచరిత’!

Feb 10 2026 2:34 PM | Updated on Feb 10 2026 3:17 PM

What Is a Hemoglobin A1c Test, How It Detects and Tracks Diabetes
  • మన మధుమేహ రోగుల్లో 

  • కచ్చిత ఫలితాలివ్వని ‘సగటు’ పరీక్ష. 

  • సీజీఎం, ఓజీటీటీ టెస్టులే ఉత్తమం. 

  • అధ్యయన విశేషాలు ప్రచురించిన ‘లాన్సెట్’ 

మధుమేహ రోగులకు HbA1c పరీక్ష ప్రామాణికం. రక్తంలో చక్కెర స్థాయుల సగటు ఎంత ఉందో ఈ పరీక్షలో కచ్చితంగా తెలుస్తుందని అందరూ భావిస్తారు. కానీ ఈ పరీక్ష ఫలితాలపై ప్రస్తుతం నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ మాట చెబుతోంది ఎవరో కాదు... ప్రపంచవ్యాప్త వైద్యవిశేషాలతో ప్రచురితమయ్యే ప్రముఖ పత్రిక లాన్సెట్! 

భారతీయులు HbA1c పరీక్ష బదులుగా ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ) లేదా నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (సీజీఎం) టెస్ట్ చేయించుకోవడమే ఉత్తమమని నిపుణులు అంటున్నారు. గత కొద్ది నెలలుగా గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలో ఉన్న మధుమేహ రోగుల విషయంలో సాధారణంగా చేసే HbA1c పరీక్ష అత్యంత కచ్చితమైన పద్ధతి కాదనేది దేశంలోని పలువురు సుప్రసిద్ధ డయాబెటాలజిస్టుల తాజా వాదన. లాన్సెట్ పత్రికలో ‘ప్రాంతీయ ఆరోగ్యం: ఆగ్నేయాసియా (రీజినల్ హెల్త్: సౌత్ ఈస్ట్ ఆసియా) పేరిట ఈ అధ్యయన ఫలితాలు ఈ నెల 9న ప్రచురితమయ్యాయి. చక్కెర వ్యాధికి భారత్ రాజధాని. మన దేశంలో మధుమేహ రోగుల సంఖ్య దాదాపు 10.10 కోట్లు. వీరిలో చాలామంది తమ గ్లూకోజ్ స్థాయులు తెలుసుకోవడానికి HbA1c పరీక్ష చేయించుకుంటుంటారు. అయితే ఇండియాలో ఈ పరీక్ష స్పష్టమైన వాస్తవిక చిత్రాన్ని ప్రతిబింబించడం లేదనే మరో కథనం కూడా ఇటీవల ‘లాన్సెట్’లో వచ్చింది.

HbA1c పరీక్ష ఎందుకు?
ఎర్ర రక్తకణాలు సుమారు మూడు మాసాలు జీవిస్తాయి. కనుక HbA1c లేదా గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ పరీక్షను గత రెండు నెలలు లేదా మూడు నెలల కాలానికి రక్తంలోని చక్కెర నిల్వల స్థాయిని తెలుసుకోవడానికి చేస్తారు. హీమోగ్లోబిన్ అనేది రక్తంలో ఆక్సిజన్ ను మోసుకెళ్లే ప్రోటీన్. ఇది గ్లూకోజును అతుక్కుని ఉంటుంది. HbA1c  టెస్టులో హీమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షిస్తారు. HbA1c స్థాయి 5.7 శాతం కంటే తక్కువ ఉంటే డయాబెటిస్ లేనట్టు. అది 5.7-6.4 శాతం మధ్య ఉంటే ప్రీ-డయబెటిస్ కింద లెక్క. 6.5 శాతాన్ని మించితే సుగర్ వ్యాధి ఉన్నట్టు పరిగణిస్తారు. రక్తంలో చక్కెర నియంత్రణ, HbA1c లెవల్స్ మధ్య గల లింకు గురించి 1976లో తెలిసినప్పట్నుంచి ‘గ్లైసెమిక్ కంట్రోల్’ పరిశీలనకు సంబంధించి HbA1c అనేది ‘స్వర్ణ ప్రామాణిక పరీక్ష’ తరహాలో ఓ గీటురాయిగా మారింది. ఇది ఓ స్థిరమైన ముందస్తు విశ్లేషణతో కూడిన పరీక్ష. 2010లో దీన్ని ఓ డయాగ్నొస్టిక్ విధానంగా కూడా ప్రతిపాదించారు. పరగడుపున సేకరించే రక్త నమూనా కోసం సంప్రదాయ పద్ధతిలో మాదిరిగా HbA1c విధానంలో రోగి ఏమీ తినకుండా ‘ఉపవాసం’ పాటించాల్సిన అవసరం లేదు.

HbA1cలో కచ్చితత్వం ఉండదా?
పరిశోధకులు ఈ సందర్భంగా వివిధ పద్ధతుల ద్వారా రక్తంలో చక్కెర స్థాయులను కొలిచి, వాటిని పోల్చుతూ పలు అధ్యయనాలతో సమీక్షించారు. దక్షిణ భారత దేశంలో ఇటీవల 1,120 మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో HbA1c పరీక్ష (45.4%)తో పోలిస్తే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (87.8%) (OGTT)లో ఎక్కువ ప్రీ-డయాబెటిస్ కేసులు నమోదయ్యాయి. (ప్రీ-డయాబెటిస్ అంటే మధుమేహం త్వరలో రాబోతోందని తెలిపే ఓ ముందస్తు సూచిక. ఆహార అలవాట్లు మార్చుకోవడం, వ్యాయామం చేయడం, మద్యం- ధూమపానం మానివేయడం, జీవన శైలిని మార్చుకోవడం వంటివి పాటించకపోతే అనతి కాలంలోనే వారికి అతిదాహం-అతిమూత్ర వ్యాధి ఖాయం!). 

పుణెలో 116 మంది యువతపై నిర్వహించిన ఓ స్టడీలో 23.3% ప్రీ-డయాబెటిస్ కేసుల్ని HbA1c పరీక్ష గుర్తించగా, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (OGTT) మాత్రం 7.8% కేసుల్లో మాత్రమే ప్రీ-డయాబెటిస్ ఉన్నట్టు తేల్చింది. ఆయా వ్యక్తుల్లో ఎర్ర రక్తకణాల స్థాయులు, వాటి జీవితకాలం, అవి గ్లూకోజుతో అంటిపెట్టుకొని ఉండే అంశాల కారణంగానే ఈ వ్యత్యాసాలు చోటుచేసుకున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. “HbA1c స్థాయులపై వివిధ అంశాలు ప్రభావం చూపిస్తాయి. ఐరన్ (ఇనుము) కొరతతో తలెత్తే రక్తహీనత (అనీమియా) లేదా జీ6పీడీ (ఎర్ర రక్తకణం ఎంజైమ్) కొరత వల్ల రక్తకణాలు విచ్ఛిన్నమవుతాయి. ఇటువంటి పరిస్థితులు హీమోగ్లిబిన్ లెవల్స్ మీద ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా HbA1c లెవల్స్ మారతాయి” అని ఫోర్టిస్ సి-డాక్ సెంటర్ ఫర్ డయాబెటిస్ ఛైర్మన్, పరిశోధన పత్రం రూపకల్పనలో పాలుపంచుకున్న రచయితల్లో ఒకరైన డాక్టర్ అనూప్ మిశ్రా వ్యాఖ్యానించారు.

 దేశంలో అనీమియా వ్యాప్తి అధికంగా ఉందని, దీంతోపాటు కొన్ని జన సమూహాల్లో తలసేమియా (దేహంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉత్పత్తయ్యే అనువంశిక రక్తసంబంధ రుగ్మత), సికిల్ సెల్ (హీమోగ్లోబిన్ సంబంధిత వంశపారంపర్య రుగ్మత) వంటి హీమోగ్లోబినోపతీస్ (జన్యుపరమైన అనువంశిక వ్యాధులు) ఉన్నాయని లీలావతి ఆస్పత్రి వైద్యుడు, అధ్యయనకర్తల్లో ఒకరైన శశాంక్ జోషి తెలిపారు. అలాగే మలేరియా కేసులు కూడా వ్యాప్తిలో ఉన్నాయని, ఇవన్నీ హీమోగ్లోబిన్ స్థాయులపై ప్రభావం చూపుతాయని చెప్పారు. ఇటువంటి స్థితిలో HbA1c లెవల్స్ కచ్చితమైన ఫలితాలు ఇవ్వలేదని అన్నారు. నిపుణుల సలహా ఏమిటంటే... మధుమేహ రోగులకు HbA1c పరీక్ష కంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ) లేదా నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (సీజీఎం) టెస్ట్ ఉత్తమం. HbA1c పరీక్ష అక్కర్లేదని, వారంలో రెండు లేదా మూడు సార్లు వంతున కొంతకాలం పాటు రక్తపరీక్ష చేయించుకుంటే షుగర్ లెవల్స్ సంగతి ఇట్టే తెలిసిపోతుందని డాక్టర్ అనూప్ మిశ్రా చెప్పారు. ప్రస్తుతం అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో HbA1c పరీక్ష రుసుము సుమారు రూ.600గా ఉంది. 

- జమ్ముల శ్రీకాంత్

(Credits: The Lancet, The Indian Express, Hindustan Times, The Economic Times, ET Health World, NDTV)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement