నేడు సేఫర్ ఇంటర్‌నెట్ డే
తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే... అంతర్జాలం కాస్తా మాయాజాలం అవుతుంది. డబ్బులు పోగొట్టుకోవడం నుంచి ప్రైవసీకి ముప్పు రావడం వరకు ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇప్పుడు మన నిత్యావసరాల జాబితాలో ‘ఇంటర్నెట్’ భాగం అయింది. ఆ నెట్టింట ప్రయోజనాలూ, ఉపయోగాలతో పాటు మింగేసే అనకొండలు కూడా ఉన్నాయి. వాటి బారిన పడకుండా ఉండడం ఈరోజుల్లో సవాలుగా మారింది. ‘ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అన్ని విధాలుగా ఆలోచించాలి. తొందరపాటు కూడదు’ అనేది సేఫ్టీ ఇంటర్‌నెట్ తారకమంత్రం...
గిబ్లీ స్టైల్ ఏఐ ఆర్ట్
గిబ్లీ–స్టైల్ ఏఐ ఆర్ట్ మన ఫొటోలను చిత్రవిచిత్రమైన, యానిమీ–స్టైల్ చిత్రాలుగా మారుస్తుంది. సరదా సంగతి ఎలా ఉన్నా, ఈ గిబ్లీ–స్టైల్ ఆర్ట్ ట్రెండ్ అనేది ప్రైవసీ, డాటా సెక్యూరిటీకి సంబంధించి ముప్పు తెచ్చిపెడు తుందని చెబుతున్నారు టెక్ నిపుణులు.
మరికొన్ని...
ప్రైవసీ నైట్‌మేర్: గిబ్లీ–స్టైల్ ఆర్ట్‌లాంటి ఫీచర్‌లను అందించే కొన్ని యాప్‌లు, ప్లాట్‌ఫామ్‌లు యూజర్‌ల ముఖ కవళికలు, రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌కు సంబంధించిన చిత్రాలను సేకరించి స్టోర్ చేసి ప్రాసెస్ చేస్తున్నాయి. దీన్నే ప్రైవసీ నైట్‌మేర్ అంటున్నారు.
డీప్‌ఫేక్: మహిళలు, పిల్లలు అప్‌లోడ్ చేసిన పర్సనల్ ఫొటోలు, సెల్ఫీలతో డీప్‌ఫేక్స్ సృష్టించే ప్రమాదం ఉంది. తెలియకుండానే ఓకే అనేస్తున్నారు: ఫ్యూచర్ మోడల్ ట్రైనింగ్‌కు సంబంధించి స్టోర్ చేయడానికి, విక్రయించడానికి ఏఐ డెవలపర్‌లు పర్సనల్ ఫొటోలను ఉపయోగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన నిబంధనలను చాలామంది యూజర్‌లు తెలియకుండానే అంగీకరిస్తున్నారు!
లైక్‌నెస్ ఎక్స్‌ప్లాయిటేషన్
నిజమైన వ్యక్తి, ముఖ్యంగా మహిళల పోలికలను, ఏఐ జనరేటెడ్ క్యారెక్టర్స్‌లో మెర్జ్ చేస్తున్నారు. వీటిని హానికరమైన పనుల కోసం ఉపయోగించే ప్రమాదం ఉంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
→ ప్రైవసీ పాలసీకి సంబంధించి స్పష్టత లేని, అనుమానించే రీతిలో ఉన్న ఏఐ టూల్స్‌ను ఉపయోగించవద్దు.
→ ప్రైవసీ పాలసీలను జాగ్రత్తగా చదవాలి. అప్‌లోడ్ చేసిన ఇమేజ్‌లను ఏఐ ప్లాట్‌ఫామ్‌లు ఎలా స్టోర్ చేస్తున్నాయి, ఎలా ఉపయోగిస్తున్నాయనేది లోతుగా అర్థం చేసుకోవాలి.
→ దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉండే సెన్సిటివ్, పర్సనల్ ఫొటోలను అప్‌లోడ్ చేయవద్దు.
→ ఫొటోలను అప్‌లోడింగ్ చేసే ముందు లొకేషన్ డాటా, వ్యక్తిగత వివరాలు లేకుండా చూసుకోవాలి.
→ ఏఐ అకౌంట్స్ ఆథెంటికేషన్ కోసం స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ ఉపయోగించాలి.
→ ఉచిత ఏఐ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ అనుమతులు కోరితే వాటిని ఉపయోగించే విషయంలో పునరాలోచన చేయాలి.
వాయిస్ క్లోనింగ్ స్కామ్
ఒక తండ్రికి విదేశాల నుంచి ఫోన్ వచ్చింది. ఆయన కుమారుడు వికాస్ వేరే దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు.
‘ఒక కేసులో వికాస్‌ను అరెస్ట్ చేశాం. ఒకసారి మాట్లాడండి’ అన్నది అవతలి గొంతు.
‘నాన్న... నేను చెప్పిన ఎకౌంట్‌కు అర్జంటుగా డబ్బు పంపించు. అలా చేయకపోతే జైల్లో ఉండాల్సి వస్తుంది’ భయం ఉట్టిపడే గొంతుకతో అన్నాడు వికాస్. అది తన కుమారుడి వాయిసే కాబట్టి ఆ పెద్దాయన వారు అడిగినన్ని డబ్బులు పంపాడు.
ఆ తరువాత ఎప్పటికో వికాన్ నుంచి ఫోన్ రాగానే ఆత్రంగా ఫోన్ ఎత్తాడు...
‘రిలీజ్ చేశారా? క్షేమంగా ఉన్నావా?’ అని ఆత్రంగా అడిగాడు.
‘రిలీజ్ చేయడం ఏమిటి?’ అని షాకై పోయాడు వికాస్. జరిగినందంతా చెప్పాడు తండ్రి. తన వాయిస్ ఎవరో క్లోనింగ్ చేశారు అనే విషయం వికాస్‌కు అర్థమైంది. బ్లాక్‌మెయిల్ చేయడం నుంచి డబ్బులు డిమాండ్ చేయడం వరకు స్కామర్స్ వాయిస్ క్లోనింగ్ చేస్తున్నారు. దీన్ని ‘వాయిస్ క్లోనింగ్ స్కామ్’ అంటారు.
జాగ్రత్తలు
→ అనుమానించడానికి ఏమాత్రం టైమ్ ఇవ్వకుండా ‘మీ అమ్మాయి చాలా సీరియస్‌గా ఉంది’లాంటి మాటలు స్కామర్‌లు ఉపయోగిస్తారు. వెంటనే ఎమోషనల్ కాకుండా కాస్త ఆలోచించడం మంచిది.
→ అపరిచిత ఫోన్లకు సంబంధించి ‘నిజమా? కాదా?’ అని నిర్ధారించుకోవడానికి కుటుంబ సభ్యులతో సీక్రెట్ పాస్‌వర్డ్ ఏర్పాటు చేసుకోవాలి. లేదా వారికి మాత్రమే జవాబు తెలిసిన కొన్ని ప్రశ్నలు అడగాలి.
→ స్కామర్లు మీ వాయిస్ కాప్చర్ చేయకుండా ఉండడానికి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వీడియోలను మీ సన్నిహితులు మాత్రమే చూసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పరిమితులు విధించాలి.
స్మిషింగ్ స్కామ్
బ్యాంకులు, ప్రభుత్వ సంస్థల పేర్లతో వ్యక్తిగత, ఆర్థిక, లాగిన్ సమాచారాన్ని దొంగిలించడానికి రూ పొందించిన మోసపూరిత టెక్ట్స్ మెసేజ్‌ను స్మిషింగ్ స్కామ్ అంటారు. ‘మీ ఎకౌంట్‌ను సస్పెండ్ చేస్తున్నాం’ అంటూ మెసేజ్ రావచ్చు. ‘డియర్ కస్టమర్’ పేరుతో వచ్చే మెసేజ్‌లో పెద్దగా వివరాలేమీ లేకపోవడం, అనుమానాస్పద మేసేజ్‌లు, ఊహించని రిక్వెస్ట్‌లు నోటిఫికేషన్‌ల రూపంలో రావడం.. మొదలైనవి స్మిషింగ్ స్కామ్‌లో భాగం.
కొన్ని జాగ్రత్తలు
→ తెలియని, అన్‌ఎక్స్‌పెక్టెడ్ మెసేజెస్‌ల నుంచి వచ్చిన లింక్‌లను క్లిక్ చేయకూడదు. అటాచ్‌మెంట్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దు
→ చట్టబద్ధమైన కంపెనీ లేదా బ్యాంకు నుండి వచ్చినట్లు ఏదైనా మెసేజ్ క్లెయిమ్ చేసుకుంటే, టెక్ట్స్‌లో ఉన్నవి కాకుండా వారి అధికారిక వెబ్‌సైట్ లేదా ఫోన్ నంబర్ ద్వారా వారిని నేరుగా సంప్రదించాలి.
→ అనుమానంగా అనిపించిన మెసేజ్‌లను మీ సెల్యూలార్ ప్రొవైడర్‌కు, ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్(ఎఫ్‌సీసీ)కు రిపోర్ట్ చేయాలి.
→ సెన్సిటివ్ ఎకౌంట్స్‌కు సంబంధించి మల్టీ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (ఎంఎఫ్‌ఏ)ను ఎనేబుల్ చేయాలి.
... ఇవి మాత్రమే కాదు, మ్యాట్రిమోనియల్ స్కామ్స్, విషింగ్ ఎటాక్స్, గేమింగ్ స్కామ్స్, ఆన్‌లైన్ డేటింగ్ ఫ్రాడ్స్... ఇలా ఎన్నో స్కామ్‌లు ఆన్‌లైన్‌లో పొంచి ఉన్నాయి.
‘నాకు అన్నీ తెలుసు. నన్ను ఎవరూ మోసం చేయలేరు’ అనే అతి ఆత్మవిశ్వాసంతో ఉంటే బాధితుల్లో మొదటి వరసలో మీరే ఉంటారు!
అందుకే ఆన్‌లైన్‌కు సంబంధించి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఆపదలు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రేమ కోసమై నెట్ (వల)లో పడెనే... పాపం...
మన దేశంలో రొమాన్స్ స్కామ్‌లు అంతకంతకూ పెరుగుతున్నాయి. డేటింగ్ యాప్స్‌లో నకిలీ ప్రొఫైల్‌ను ఉపయోగిస్తున్నారు. డాక్టర్, మిలిటరీ ఆఫీసర్, సాఫ్ట్‌వేర్ కంపెనీ సీయీవో... ఇలా రకరకాల ప్రొఫైల్‌లను సృష్టిస్తున్నారు. ఈ ప్రొఫైల్ నిజమే అనుకొని ప్రేమ ప్రపంచంలోకి వచ్చిన వారిని, ప్రేమబంధం బలపడిన తరువాత ‘అర్జంటుగా అవసరం ఉంది డియర్’ అని (ఫేక్) ఎమర్జెన్సీల పేరుతో డబ్బు లాగుతున్నారు. ఇదొక రకం అయి™ó, సన్నిహితంగా ఉన్న ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేయడం అనేది మరో రకం. డేటింగ్ యాప్‌లలో 39 శాతం మంది యూజర్‌లు వివిధ రూపాల్లో రొమాన్స్ స్కామ్స్ బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ స్కామ్‌ల బారిన పడిన బాధితులు డబ్బులు పోగొట్టుకోవడం మాత్రమే కాదు డిప్రెషన్ బారిన కూడా పడుతున్నారు. ఆత్మçహత్య ప్రయత్నాలు చేస్తున్నారు.
కొన్ని జాగ్రత్తలు...
→ పేరు నమోదు చేసుకునే ముందు డేటింగ్ యాప్ లేదా మ్యాట్రిమోనియల్ అథెంటిసిటీని ధ్రువీకరించుకోవాలి
→ నివాస చిరునామా, వ్యక్తిగత వివరాలను బహిర్గత పరచకపోవడం మంచిది
→ డేటింగ్ యాప్‌లో పరిచయం అయిన వారిని ప్రత్యక్షంగా కలుసుకొని తగిన ప్రశ్నలు అడగాలి
→ మ్యాట్రిమోనియల్ సైట్‌లలో ఎన్‌ఆర్‌ఐ ప్రొఫైల్స్‌కి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి
→ బ్యాంకింగ్ సమాచారం, గుర్తింపు లేదా పాస్‌పోర్ట్ కాపీలు, ముఖ్యమైన సమాచారం తెలియని సైట్‌లకు అందించవద్దు.


