సాంకేతికత లేదా వ్యాపార పద్ధతుల పేరుతో భారత పౌరుల గోప్యతా హక్కును హరించలేరని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. డేటా షేరింగ్ నెపంతో ప్రజల వ్యక్తిగత సమాచారంతో ఆటలాడటం సరికాదని మెటా, వాట్సాప్ సంస్థలను అత్యున్నత ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది.
సమాచారాన్ని దొంగిలించడానికి ఇదో మార్గం
వాట్సాప్ తీసుకొచ్చిన వివాదాస్పద గోప్యతా విధానంపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వినియోగదారుల ‘సమ్మతి’(Consent), ‘ఆప్ట్-అవుట్’(వైదొలగడం) మెకానిజంపై కంపెనీల వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ‘టెక్ కంపెనీల నిబంధనలు సామాన్యులకు అర్థం కానంత తెలివిగా రూపొందించారు. అసలు ‘వైదొలగడం’(ఆప్ట్-అవుట్) అనే విధానం ఎక్కడ ఉంది? ఇది ప్రైవేట్ సమాచారాన్ని దొంగిలించడానికి ఒక తెలివైన మార్గం’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
కేసు నేపథ్యం ఏమిటి?
2021లో వాట్సాప్ ప్రవేశపెట్టిన గోప్యతా విధానంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.213.14 కోట్ల భారీ జరిమానా విధించింది. దీన్ని సవాలు చేస్తూ మెటా సంస్థ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)ను ఆశ్రయించగా అక్కడ కూడా కంపెనీకి చుక్కెదురైంది. వినియోగదారులు వాట్సాప్ వాడాలంటే తప్పనిసరిగా డేటా షేరింగ్‌కు అంగీకరించాలనే నిబంధన వినియోగదారులను బలవంతం చేయడమేనని గతంలో ఎన్‌సీఎల్‌ఏటీ స్పష్టం చేసింది. వాట్సాప్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని ఉపయోగించుకుని అన్యాయమైన నిబంధనలను విధిస్తోందని రెగ్యులేటర్లు నిర్ధారించాయి.
కేసు పరిధి విస్తరణ
ఈ వివాదాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు కేసు పరిధిని మరింత విస్తరించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను (మైటీ) ఈ విచారణలో చేర్చింది. ఈ వ్యవహారంపై ఫిబ్రవరి 9వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం ప్రకటించింది. ప్రకటనల ప్రయోజనాల కోసం మెటా గ్రూప్ కంపెనీలతో డేటాను పంచుకోవడాన్ని ఐదేళ్లపాటు నిషేధించిన సీసీఐ ఉత్తర్వులను కూడా పరిగణనలోకి తీసుకుని పౌరుల డేటా రక్షణపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది.
ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు


