జీవించే, విద్యా హక్కుల్లో భాగమే: సుప్రీంకోర్టు
స్కూళ్లలో ఉచితంగా అందుబాటులో శానిటరీ ప్యాడ్లు
బాలబాలికలకు, దివ్యాంగులకు వేర్వేరు టాయిలెట్లు
అమలు చేయని స్కూళ్ల గుర్తింపు రద్దు, కఠిన చర్యలు
ఈ ఆదేశాలన్నీ మూడు నెలల్లోగా అమలు కావాలి
కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలితక ప్రాంతాలకు నిర్దేశాలు
న్యూఢిల్లీ: రుతుక్రమ ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని జీవించే హక్కుతో పాటు విద్యా హక్కులో కూడా రుతుక్రమ ఆరోగ్యం భాగమని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్ధివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. బాలికల కోసం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లన్నింటిలోనూ బయో డిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా అందుబాటులో ఉంచాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.
బాల బాలికలకు, దివ్యాంగులకు విడి టాయ్‌లెట్లు ఉండాల్సిందేనని కూడా స్పష్టం చేసింది. వీటిని అమలు చేయని ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని, సర్కారీ స్కూళ్లయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సదరు సౌకర్యాలన్నీ అమలవుతున్నదీ లేనిదీ జిల్లా విద్యాధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించింది. నిష్పాక్షిక సర్వేల ద్వారా కూడా వాస్తవ స్థితిగతులను ఎప్పటికప్పుడు వారు తెలుసుకుంటూ ఉండాలని పేర్కొంది.
విద్యా హక్కు చట్టంలోని సెక్షన్–19 ప్రకారం అన్ని పాఠశాలలూ ఈ నిబంధనలను, ప్రమాణాలను పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. లింగ సమానత్వం, విద్యాపరమైన సమానత్వాన్ని సాధించడమే లక్ష్యం కావాలని ఈ సందర్భంగా ధర్మాసనం ఆకాంక్షించింది. నెలసరి ఆరోగ్యంపై బాలికలకు సరైన శిక్షణ, అవగాహన కల్పించాలని కోరింది. విద్యా ప్రణాళికలో ఆ అంశాలను కూడా భాగం చేయాలని ఎన్‌సీఈఆర్‌టీ, రాష్ట్ర విద్యా మండళ్లు, సంబంధిత విద్యా విభాగాలకు సూచించింది. విద్యార్థినుల ఆరోగ్యం కోసం దేశవ్యాప్తంగా రుతుక్రమ పరిశుభ్రత విధానం అమలు చేయాలంటూ జయా ఠాకూర్ సుప్రీంకోర్టు పిటిషన్ వేశారు. దాని 2024 డిసెంబర్ 10వ తేదీన వాదనలు ముగించిన ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది.
సమస్యల లేమి చేదు వాస్తవం
ధర్మాసనం తరఫున 126 పేజీల తీర్పును జస్టిస్ పార్ధివాలా రాశారు. రుతుక్రమం బాలికల విద్యకు ముగింపు కారాదన్న ప్రఖ్యాత అమెరికా విద్యావేత్త, సామాజిక కార్యకర్త మెలీసా మెర్టన్ కొటేషన్‌తో తీర్పును మొదలుపెట్టారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా బాలికల విద్య విషయంలో ఒకప్పటి సవాళ్లే ఇప్పటికీ పెను సమస్యలుగా నిలిచి ఉన్నాయన్నది ఒప్పుకోక తప్పని చేదు నిజమంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమే రుతుక్రమ ఆరోగ్యం.
చదువుకోవడానికి ఆటంకంగా నిలిచే ప్రతి అడ్డంకిని తొలగించడమూ విద్యా హక్కులో భాగమే. సౌకర్యాల లేమితో బాలికలు స్కూలుకు వెళ్లలేకపోతే ఇతర ప్రాథమిక హక్కులకూ దూరమవుతారు. బాలికలకు సురక్షితమైన, గౌరవప్రదమైన విద్యా వాతావరణం కల్పించడం రాజ్యాంగ బాధ్యత’’ అని ధర్మాసనం నొక్కిచెప్పింది. ‘‘రుతుక్రమం వల్ల శరీరం అపవిత్రమైందనే భావనతో ఏ బాలికైనా చదువుకు దూరమైతే మేం చెప్పదలచింది ఒక్కటే. అది నీ తప్పు కాదు. సమాచార లోపం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మౌనమే అందుకు కారణం’’ అని పేర్కొంది.
విద్యా హక్కుకు తూట్లు
సురక్షితమైన, ప్రభావవంతమైన నెలసరి శుభ్రత చర్యలు విద్యార్థినుల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యానికి దోహదపడతాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన విద్య, సమాచారాన్ని పొందే హక్కు ఆరోగ్యకరమైన పునరుత్పత్తి జీవన హక్కులో విడదీయలేని భాగం. స్కూళ్లలో నెలసరి శుభ్రత నిర్వహణ సదుపాయాలు, సౌకర్యాల లేమి విద్యార్థినుల ఆత్మగౌరవాన్నే దారుణంగా దెబ్బతీస్తుంది. విద్య, సంబంధిత అంశాల్లో ఇతర విద్యార్థులతో సమానంగా పోటీ పడే హక్కుకు భంగం కలిగిస్తుంది’’ అని అభిప్రాయపడింది. ‘‘జీవించే హక్కు, ఆత్మ గౌరవం అనే విస్తృత చట్రంలో విద్యా హక్కు భాగం. విద్య అందుబాటులో లేకుండా అవి అసాధ్యం’’ అని పేర్కొంది.
స్కూళ్లలో పరిశుభ్రత విభాగం
విద్యార్థినుల నెలసరి శుభ్రత గురించి వెలువరించిన తీర్పులో ధర్మాసనం జారీ చేసిన ముఖ్య ఆదేశాలు...
⇒ నెలసరి ఆరోగ్యంపై బాలికలకు సరైన శిక్షణ, అవగాహన కల్పించాలి.
⇒ ఎన్‌సీఈఆర్‌టీ, రాష్ట్ర విద్యా మండళ్లు, సంబంధిత విద్యా విభాగాలు దీన్ని విద్యా ప్రణాళికలో భాగం చేయాలి.
⇒ ఏఎస్‌టీఎం డి–6954 నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆక్సో–బయో డిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్‌ను గ్రామీణ, పట్టణ అనే తారతమ్యాలకు అతీతంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలోనూ ఉచితంగా అందుబాటులో ఉంచాలి.
⇒ నాప్కిన్లు విద్యార్థినుల టాయిలెట్ల సమీపంలో వెండింగ్ మెషీన్ల ద్వారా లేదా పాఠశాలలోని నిరీ్ణత అధికారి వద్ద అందుబాటులో ఉండేలా చూడాలి.
⇒ నాప్కిన్లను పడేసేందుకు టాయ్‌లెట్ల పక్కనే మూతతో కూడిన వేస్ట్‌బిన్ విధిగా ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచేలా యాజమాన్యాలు శ్రద్ధ వహించాలి.
⇒ బాలబాలికలకు వేర్వేరు టాయిలెట్లు ఉండాలి. అవి చక్కగా పని చేసే స్థితిలో ఉండాలి.
⇒ టాయ్‌లెట్లలో నిరంతర నీటి వసతితో పాటు సబ్బు, వాష్‌బేసిన్, ఇతర కనీస సదుపాయాలు అందుబాటులో ఉండాలి.
⇒ ప్రతి స్కూలులోనూ నెలసరి పరిశుభ్రత విభాగం ఏర్పాటు చేయాలి. అందులో శానిటరీ ప్యాడ్లతో పాటు లో దుస్తులు, అదనపు యూనిఫాం, డిస్పోజబుల్ బ్యాగులు ఉంచాలి.
⇒ వాడేసిన శానిటరీ నాప్కిన్లను సురక్షితంగా, పర్యావరణహితంగా పారవేసే ఏర్పాట్లు ప్రతి స్కూల్లోనూ ఉండాలి.
⇒ వ్యర్థాలను పారవేసే విషయంలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలి.
⇒ టాయిలెట్లు విద్యార్థినుల గోప్యతను కాపాడేలా ఉండాలి.
⇒ దివ్యాంగ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా విడిగా టాయిలెట్లను నిర్మించాలి
⇒ నెలసరి శుభ్రత, దానికి సంబంధించిన అన్ని అంశాలపైనా ఉపాధ్యాయులందరికీ సమగ్ర శిక్షణ ఇవ్వాలి. నెలసరిలో ఉన్న పిల్లలకు ఎలా సాయపడాలో వారికి పూర్తిగా తెలిసుండాలి.
⇒ జన్ ఔషధీ సువిధా ఆక్సో బయో డిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్లు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నదీ సోషల్ మీడియా, ప్రింట్ మీడియాతో పాటు రేడియో, టీవీ, సినిమా హాళ్లలో, బస్సులు, ఆటోలపై, గోడలపై ప్రకటనల రూపంలో విస్తృతంగా ప్రచారం చేయాలి.
⇒ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్‌లైన్ గురించి కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి.


