జాతీయరహదారుల పక్కన గోశాలలను ఏర్పాటు చేయాలంటూ సూచన
న్యూఢిల్లీ: వీధికుక్కల కట్టడిపై గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరించాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. ఈ అంశంపై గురువారం వాదనలు ముగించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌వీ అంజారియాల ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. హైవేలపైకి వచ్చే వీధి పశువుల కోసం, రోడ్ల నిర్మాణ కాంట్రాక్టు కంపెనీలను సామాజిక బాధ్యతగా గోశాలలను ఏర్పాటు చేయాలని కోరాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)కి సూచించింది. జాతీయ రహదారులపైకి వచ్చే వీధి పశువుల విషయంలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించేలా ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని కోరింది.
జాతీయ రహదారులపైకి పశువులు ప్రవేశించే ప్రమాదమున్న ప్రాంతాలు దేశవ్యాప్తంగా 1,300కుపైగా ఉన్నాయని ఎన్‌హెచ్‌ఏఐ లాయర్ తెలిపారు. చాలా వరకు రాష్ట్రాలు పశువుల సంచారం కట్టడికి చర్యలు తీసుకున్నాయన్న ఆయన..ఈ విషయంలో మహారాష్ట్రం, జార్ఖండ్, రాజస్తాన్‌లు వెనుకబడ్డాయన్నారు. వీధి కుక్కల పునరావాసం, స్టెరిలైజేషన్‌కు సంబంధించిన గతేడాది నవంబర్ 7వ తేదీన జారీ చేసిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై పంజాబ్, రాజస్తాన్, యూపీ, తమిళనాడు ప్రభుత్వాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
పంజాబ్ ప్రభుత్వం రోజుకు కేవలం వంద శునకాలకు మాత్రమే స్టెరిలైజేషన్ చేసినట్లు తెలపగా, వీధికుక్కలను పట్టుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 45 వ్యాన్లు ఉన్నాయంటూ రాజస్తాన్ ప్రభుత్వం తెలపడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ.. గడ్డి వాములో సూదిని వెదికినట్టు ఉందంటూ వ్యాఖ్యానించింది. వీధి కుక్కల సమస్యను ఇప్పుడు నియంత్రించకుంటే ఏటికేడు మరింత పెరుగుతూనే ఉంటుందని పేర్కొంది.
నవంబర్ 7వ ఉత్తర్వుల తర్వాత జంతువుల షెల్టర్లు, స్టెరిలైజేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామంటూ పలు ఎన్జీవోలు, ప్రైవేట్ సంస్థల నుంచి 250కి పైగా దరఖాస్తులు అందాయని ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా(ఏడబ్ల్యూబీఐ)ప్రతినిధి చెప్పారు. వీటిని ఆమోదించడమా లేదా తిరస్కరించడమా వెంటనే తేల్చేయాలని ధర్మాసనం ఆదేశించింది.


