యూజీసీ సమానత్వ నిబంధనలపై సుప్రీం
అవి సమాజాన్ని విభజించే ప్రమాదముంద
పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నాయి: ధర్మాసనం
వాటి అమలుపై స్టే, నిపుణుల కమిటీకి నివేదించాలని ఆదేశం
న్యూఢిల్లీ: విద్యాలయ ప్రాంగణాల్లో కులాధారిత వివక్షను నిరోధించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నూతనంగా రూపొందించిన సమానత్వ నిబంధనలు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వాటి అమలుపై స్టే విధించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ ధర్మాసనం గురువారం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. ‘‘కుల వివక్ష లేని, కులరహిత సమాజ సాధన కోసం స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల్లో మనం చేసిందేమిటి? ఈ విషయంలో సమాజాన్ని వెనక్కు తీసుకెళ్తున్నామా అన్న భావన కలుగుతోంది’’ అంటూ ఆవేదన వెలిబుచ్చింది.
యూజీసీ సమానత్వ నిబంధనల్లో, వాటిలో వాడిన భాషలో చెప్పలేనంత అస్పష్టత ఉందంటూ ధర్మాసనం ఆక్షేపించింది. అంతేగాక, ‘‘ఈ దశలోనే మేం గనక కల్పించుకోకపోతే ఈ నిబంధనలు దారుణ పరిణామాలకు దారి తీసేలా ఉన్నాయి. అంతిమంగా సమాజంపై ప్రమాదకర ప్రభావం చూపడమే గాక దాన్ని విభజించేలా ఉన్నాయి’’ అంటూ దుయ్యబట్టింది. ఈ నిబంధనలపై నిపుణుల కమిటీ లోతుగా అధ్యయనం చేసి సరైన మార్పుచేర్పులు సూచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీజేఐ అభిప్రాయపడ్డారు.
లేదంటే కొందరు వాటిని దుర్వినియోగం చేసే ఆస్కారం చాలా ఉందని స్పష్టం చేశారు. ‘‘ప్రఖ్యాత న్యాయ కోవిదులు, సామాజిక స్థితిగతులపై సమగ్ర అవగాహన ఉన్న నిపుణులు... ఇలా ఇద్దరు లేదా ముగ్గురితో కమిటీ ఏర్పాటు కావాలి. సమాజం ఎలా ప్రగతి సాధించాలి, అందుకోసం విద్యా సంస్థల్లో ఏర్పరచే నిబంధనల వల్ల విద్యాభ్యాసం పూర్తయి సమాజంలోకి వెళ్లాక విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తారు వంటి అంశాలన్నింటినీ వారు లోతుగా అధ్యయనం చేయాలి’’ అని సీజేఐ సూచించారు. తదుపరి విచా రణను మార్చి 19కి వాయిదా వేశారు. సమానత్వ నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆలోగా స్పందిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, యూజీసీని ఆదేశించారు.
ఎటువైపు వెళ్తున్నాం?
రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశానుసారం 2012 నాటి నిబంధనల స్థానంలో కొత్తగా సమానత్వ నిబంధనలను జనవరి 13న యూజీసీ అమల్లోకి తేవడం తెలిసిందే. వాటిప్రకారం ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వ కమిటీల ఏర్పాటును తప్పనిసరి చేశారు. ఎస్సీ, ఎస్టీతో పాటు ఓబీసీ, దివ్యాంగులు, మహిళలకు వాటిలో స్థానం కల్పించాలని పేర్కొన్నారు. అయితే నూతన నిబంధనల్లో కుల నిర్వచనాన్ని ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలకు కూడా విస్తరించడం, జనరల్ కేటగిరీ తదితరాలను విస్మరించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యూజీసీ నూతన సమానత్వ నిబంధనల ఆమోదనీయతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖల య్యాయి.
వివక్ష అనే పదాన్ని కులానికి తావివ్వని రీతిలో నిర్వచించాల్సిందిగా యూజీసీని ఆదేశించాలని కోరాయి. వాటిపై విచారణ సందర్భంగా సీజేఐ ధర్మాసనం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత సామాజిక స్థితిగతులు తదితరాలపై పలు కీలక ప్రశ్నలు కూడా లేవనెత్తింది. వివక్షను రూపుమాపేందుకు విద్యా సంస్థల్లో విద్యార్థులకు కులాలవారీగా ప్రత్యేక హాస్టళ్లు ఏర్పాటు చేయాలన్న నిబంధనను సీజేఐ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘దేవుడా! కులాంతర వివాహాలే జరుగుతున్న ఈ రోజుల్లో ఇవేం చర్యలు? దయచేసి ఇలాంటి పనులకు దిగకండి. విద్యాలయ హాస్టళ్లలో ఇంతకాలంగా కులాలకు అతీతంగా అంతా కలిసే ఉంటున్నారు.
వారి మధ్య కొత్తగా ఇలాంటి విభజనలు తీసుకురావద్దు’’ అని సూచించారు. ప్రాంతీయ వివక్ష విషయంలో నూతన నిబంధనల్లో ఎలాంటి చర్యలున్నాయంటూ ఆయన నిలదీశారు. ‘‘ఉదాహరణకు ఒక దక్షిణాది విద్యార్థి ఉత్తర భారత దేశంలోని విద్యా సంస్థలో చదువుతున్నాడు. అతని కులం వంటివి తెలియకపోయినా కేవలం ప్రాంతం ఆధారంగా వివక్ష, అవమానం ఎదుర్కొన్నా డనుకుందాం. ఇలాంటి వాటికి నూతన నిబంధనల్లో పరిష్కారం ఏముంది?’’ అని ప్రశ్నించారు. అసలు వివక్ష అనే పదానికి పాత నిబంధనల్లో ఇప్పటికే విస్తృతమైన నిర్వచనం ఉండగా మళ్లీ కొత్త నిర్వచనం తేవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ తప్పుబట్టారు.
ర్యాగింగ్ ఊసే లేదేం?
జనరల్ కేటగిరీకి చెందిన నూతన విద్యార్థి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ చేతుల్లో ర్యాగింగ్‌కు గురైతే దానిపై నూతన నిబంధనల్లో ఎలాంటి చర్యలూ లేవని విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది ఒకరు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ విస్మయం వెలిబుచ్చారు. విద్యాలయాల్లో ప్రధాన సమస్య అయిన ర్యాగింగ్ గురించి ఈ నిబంధనల్లో ప్రస్తావనే లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. దాని గురించి అస్సలే పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
‘‘విద్యాల యాల్లో ర్యాగింగ్ చాలావరకు జూనియర్, సీనియర్ తేడాల ఆధారంగానే జరుగుతూ ఉంటుంది. ఇంతటి ప్రధాన సమస్యను విస్మరించడం ఏమిటి? విద్యాల యాల్లో వివక్ష అంటే కేవలం కులాధారితంగా మాత్రమే ఉంటుందనే దురభిప్రాయానికి రావడం ఏ మేరకు సబబు?’’ అంటూ నిలదీశారు. భారత ఐక్యత అనే భావన విద్యాలయాల్లో సర్వత్రా ప్రతిఫలించాలని జస్టిస్ బాగ్చీ అభిప్రా యపడ్డారు.
విద్యాలయాల్లో స్వేచ్ఛాయుత, సమానత్వ వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు. జనరల్ కేటగిరీకి చెందిన వారిపై జరిగే కులాధారిత వివక్షను నిబంధనల్లో విస్మరించారని పిటిషనర్ తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ఆక్షేపించారు. తద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలే ఇలాంటి వివక్షను ఎదుర్కొంటాయనే దురభిప్రాయం కలిగేందుకు ఆస్కారం కల్పించారన్నారు.


