చంద్రుడి వంక... 8 అంకె.
ఆ రూటే సెపరేటు… అది సురక్షిత మార్గం.
ఆర్టెమిస్-2: మళ్లీ చంద్రయాత్ర!
అర్ధ శతాబ్దం తర్వాత చందమామ చెంతకు మానవసహిత యాత్ర చేపట్టబోతోంది నాసా. వాతావరణం అనుకూలిస్తే అమెరికాలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 8న ‘స్పేస్ లాంచ్ సిస్టమ్’ (ఎస్ఎల్ఎస్)కు చెందిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్ గాల్లోకి లేస్తుంది. 32 అంతస్తుల ఎత్తుండే ఈ భారీ ఆ రాకెట్లో అతి శీతల ద్రవ ఆమ్లజని, ద్రవ ఉదజనితో కూడిన 26.5 లక్షల లీటర్ల ఇంధనం వాడబోతున్నారు.
53 ఏళ్ల క్రితం 1972లో నిర్వహించిన ‘అపోలో 17’ మిషన్ తర్వాత నాసా చేపడుతున్న తొలి మానవసహిత చంద్రయాత్ర ఇది. నలుగురు అమెరికన్ వ్యోమగాములు రీడ్ వైస్ మాన్ (కమాండర్), విక్టర్ గ్లోవర్ (పైలట్), క్రిస్టినా కోచ్ (మిషన్ స్పెషలిస్ట్), జెరెమీ హాన్సెన్ (మిషన్ స్పెషలిస్ట్) చంద్రకక్ష్యలోకి వెళ్లి తిరిగిరానున్నారు. ప్రస్తుతానికి వీరు జాబిల్లిపై దిగబోవడం లేదు. చంద్రుడి చుట్టూ ‘ఓ రౌండ్’ కొడతారు. చంద్రుడి ఆవలి వైపునకు వెళతారు. ఆ సందర్భంలో వారికి భూమి కొంతసేపు అదృశ్యమవుతుంది. అంతేకాదు... 40 నిమిషాలపాటు వారికి భూమితో సమాచార సంబంధాలు తెగిపోతాయి. అన్ని కమ్యూనికేషన్స్ కట్ అవుతాయి. భూమితో రియల్ టైమ్ కాంటాక్ట్స్ ఉండవు. అంటే డీప్ స్పేస్ ఐసోలేషన్లో ఉండిపోతారు! భూమి నుంచి బయల్దేరి తిరిగొచ్చేవరకు ఈ చంద్రయాత్రకు దాదాపు పది రోజులు పడుతుంది. భూకక్ష్యకు చేరగానే రాకెట్ నుంచి విడివడి నాసా ఆస్ట్రోనాట్లు వ్యోమనౌక ‘ఆరియన్’లో ప్రయాణం కొనసాగిస్తారు.

భూమి నుంచి చంద్రుడి వరకు వారి యాత్ర సరళరేఖా మార్గంలో ఉండదు. వ్యోమనౌక పయనించే పథం ‘8 అంకె’ ఆకారంలో ఉంటుంది. ఈ పయన మార్గం నౌకను చంద్రుడి ఆవలి వైపునకు పట్టుకెళ్లడమే కాకుండా తిరిగి సురక్షితంగా భూమికి తీసుకొస్తుంది. దీన్ని ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ అంటారు. వ్యోమగాములు తొలుత భూమి చుట్టూ అత్యున్నత దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఒక రోజు గడుపుతారు. ‘ఆరియన్’ నౌకలోని జీవనాధార వ్యవస్థలు సరిగా పనిచేస్తున్నాయో, లేదో ఈ వ్యవధిలో తెలిసిపోతుంది. ఈ సమయంలో ఏదైనా సమస్య తలెత్తితే వారు భూమి సమీపంలోనే ఉంటారు కనుక వెంటనే క్షేమంగా తిరిగి వచ్చేయవచ్చు. 24 గంటల తర్వాత కూడా నౌకలో అన్ని వ్యవస్థలు సవ్యంగా పనిచేస్తున్నాయని ధృవీకరించుకున్నాక వారు ముందుకు సాగి నాలుగు రోజులకు చంద్రుడి కక్ష్యకు చేరతారు. చంద్రుడి గురుత్వశక్తిని ఉపయోగించుకుని వ్యోమనౌక మనకు కనిపించని జాబిలి ఆవలి వైపునకు వెళ్లడమే కాకుండా... తిరుగు ప్రయాణానికి అవసరమైన ఇంజిన్లను మండించకుండానే భూమి వైపు మళ్లగలదు.
అంటే.. చంద్రయాత్రలో భూమిని విడిచిపెట్టాక ‘ఆరియన్’ వ్యోమనౌక చోదక వ్యవస్థలో ఏదైనా సమస్య ఉత్పన్నమై ఇంజిన్ పూర్తిగా విఫలమైనా ఆందోళన చెందనక్కర్లేదు. భౌతికశాస్త్ర సూత్రాలే భూ, చంద్రుల గురుత్వశక్తుల రూపంలో వ్యోమగాముల పాలిత సహజ రక్షాకవచాలుగా నిలిచి వారికి భద్రత కల్పిస్తాయి! గురుత్వశక్తే వారిని తిరిగి క్షేమంగా భూ వాతావరణంలోకి రప్పిస్తుంది. అంతరిక్షంలో వ్యోమనౌక ప్రయాణించే ‘8’ అంకె ఆకృతిలోని పథ విశేషం ఇదే. ఈ యాత్రలో వ్యోమగాములు చంద్రుడి ఆవలి (వెనుక) వైపున చంద్రుడి ఉపరితలం నుంచి 4,700 మైళ్ళ దూరంలో ప్రయాణిస్తారు.

ఆ సందర్భంగా భూమి నుంచి ఇప్పటివరకు అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన వ్యక్తులుగా వారు రికార్డు నెలకొల్పనున్నారు. చంద్రుడిపై దిగనప్పటికీ వారు భారీ గోతులమయమైన దాని ఉపరితలాన్ని దగ్గరిగా వీక్షిస్తారు. అలాగే ఉదయిస్తున్న భూమిని తిలకిస్తారు. చివర్లో ‘ఆరియన్’ క్రూ కేప్సూల్ గంటకు 40 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఆ వేగంలో గాలి రాపిడికి నౌక వెలుపల 2,760 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి జనిస్తుంది. అంత తీవ్రమైన వేడిని తట్టుకోవడం నౌక ఉష్ణ రక్షాకవచం (హీట్ షీల్డ్)కు ఓ అగ్నిపరీక్ష. అనంతరం పారాచూట్ల సాయంతో కేప్సూల్ నిదానంగా పసిఫిక్ మహాసముద్రంలో దిగుతుంది.
వ్యోమగాములు లేకుండా ‘ఆర్టెమిస్-1’తో 2022లో మానవరహిత యాత్ర నిర్వహించి ‘ఆరియన్’ నౌక సన్నద్ధతను నాసా పరీక్షించింది. అప్పుడు కేప్సూల్ పసిఫిక్ మహా సంద్రంలో సురక్షితంగా దిగినప్పటికీ దాని హీట్ షీల్డ్ దెబ్బతిన్నట్టు అనంతర తనిఖీల్లో ఇంజినీర్లు గుర్తించారు. అయితే కేప్సూల్ లోపలి భాగానికి ఏమీ కాలేదు. అన్నీ సవ్యంగా సాగితే 2028లో చేపట్టే ‘ఆర్టెమిస్-3’ యాత్రతో జాబిల్లి దక్షిణ ధృవంపై నాసా వ్యోమగాములు దిగుతారు. చైనా కూడా ఈ విషయంలో అమెరికాతో తీవ్రంగా పోటీ పడుతోంది. 2030లో చంద్రుడిపై తమ వ్యోమగాములను దింపే దిశగా అది ప్రణాళికలు రచిస్తోంది.

(NASA, Interstellar Traveller, Space.com, BBC Sky at Night Magazine, India Today, News 18, El Mundo America, CBS News, WION, The Times of India).
-జమ్ముల శ్రీకాంత్.


