ఇంటికి చేరుకున్న లియామ్‌  | Five year old boy and father detained by ICE return home to Minnesota | Sakshi
Sakshi News home page

ఇంటికి చేరుకున్న లియామ్‌ 

Feb 3 2026 12:35 AM | Updated on Feb 3 2026 12:35 AM

Five year old boy and father detained by ICE return home to Minnesota

కోర్టు ఆదేశించిన మరునాడే విడుదల 

వాషింగ్టన్‌: అమెరికా ఇమిగ్రేషన్‌ అధికారులు నిర్బంధంలోకి తీసుకున్న అయిదేళ్ల లియామ్‌ కొనెజో రమోస్, తండ్రితోపాటు మినియాపొలిస్‌లోని సొంతింటికి చేరుకున్నాడు. వారిద్దరినీ వెంటనే విడుదల చేయాలంటూ టెక్సాస్‌ డిస్ట్రిక్ట్‌ ఫెడరల్‌ కోర్టు జడ్జి ఫ్రెడ్‌ బియెరీ ఆదేశించిన మరునాడే ఈ పరిణామం చోటుచేసుకుంది. 

కుమారుడితోపాటు తండ్రిని శనివారం రాత్రి డిటెన్షన్‌ సెంటర్‌ నుంచి తీసుకువచ్చి, ఆదివారం వారి ఇంటి వద్ద వదిలిపెట్టానని టెక్సాస్‌ డెమోక్రాట్‌ జోక్విన్‌ కాస్ట్రో తెలిపారు.  వీరి విడుదలను మిన్నెసొటా కాంగ్రెస్‌ సభ్యురాలు ఇల్హామ్‌ ఒమర్‌ స్వాగతించారు. ఆడ్రియన్‌ అలెగ్జాండర్‌ కొనెజో రమోస్, అతడి కుమారుడు లియామ్‌ను పది రోజుల తర్వాత ఆదివారం విడిచిపెట్టిన విషయాన్ని హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ అసిస్టెంట్‌ సెక్రటరీ ట్రిసియా మెక్‌లాఘ్లిన్‌ ధ్రువీకరించారు. 

‘ఈ కేసులోని వాస్తవాల్లో ఎటువంటి మార్పు లేదు. ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) ఒక చిన్నారిని లక్ష్యంగా చేసుకోలేదు, అరెస్టు చేయలేదు’అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. 

‘ఇమిగ్రేషన్‌ వ్యవస్థలో చట్టబద్ధతను, విచక్షణను పునరుద్ధరించడానికి ట్రంప్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ దేశంలో ఉండే హక్కు లేని విదేశీయుల అరెస్ట్, నిర్బంధం, బహిష్కరణ కోసం మా పోరాటం కొనసాగుతుంది’అని పేర్కొన్నారు. డి్రస్టిక్ట్‌ కోర్టు జడ్జి ఆదేశాలపై అప్పీలుకు వెళతామని డిప్యూటీ అటార్నీ జనరల్‌ టాడ్‌ బ్రాంచె చెప్పారు. ఇమిగ్రేషన్‌ చట్టాలు, నిబంధనలు సాధారణ క్రిమినల్‌ ప్రక్రియ కంటే చాలా భిన్నంగా ఉంటాయన్నారు. 

జనవరి 20వ తేదీన లియామ్‌ను, అతడిని తండ్రిని అదుపులోకి తీసుకున్న అధికారులు అక్కడి 1,300 కిలోమీటర్ల దూరంలో డిల్లే డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించారు. ఈక్వెడార్‌కు చెందిన లియామ్‌ కుటుంబానికి అమెరికాలో ఉండేందుకు అవసరమైన ఎలాంటి అనుమతిపత్రాలు లేవని ఇమిగ్రేషన్‌ అధికారులు అంటున్నారు. 

ఆ రోజున తాము అరెస్ట్‌ చేసేందుకు యత్నించగా బాలుడిని కారులో వదలి ఆడ్రియన్‌ పరారయ్యాడని చెప్పారు. దీంతో, లియామ్‌ను స్కూలు బ్యాగుతో సహా ఇమిగ్రేషన్‌ అధికారులు తమ కారు వద్దకు తీసుకెళ్తున్నప్పటి ఫొటో సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. ట్రంప్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై జనం దుమ్మెత్తిపోశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement