తీవ్రంగా ఖండించిన భారత్
చర్చలు, దౌత్యమే మార్గం: మోదీ
యుద్ధ పరిణామాలపై ఆందోళన
ఒమన్, జోర్డాన్, ఫ్రాన్స్, మలేసియా అధినేతలతో సంభాషణ
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కీలక ఇంధన వనరులపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ‘‘ప్రపంచమంతటినీ ఎంతగానో కలతకు గురి చేసే అంశమిది. ఇప్పటికే ఒడిదొడుకుల్లో ఉన్న అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను ఈ దాడులు మరింతగా దెబ్బ తీస్తాయి’’అంటూ ఆందోళన వెలిబుచ్చింది. ఇరాన్‌లోని సౌత్ పార్స్ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ దాడి, ప్రతీకారంగా ఖతర్‌లోని ఎల్‌ఎన్‌జీ క్షేత్రం రస్ లఫాన్‌తో పాటు సౌదీ అరేబియాలో అతి పెద్ద చమురు క్షేత్రమైన ఆరాంకోపైనా ఇరాన్ దాడులు కలకలం రేపడం తెలిసిందే. ఇవి భారత్‌ను తీవ్రంగా కలచివేసినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. పౌర సదుపాయాలు, ఇంధన వనరులపై దాడులు కూడదని భారత్ ముందునుంచీ చెబుతూనే వస్తోందని గుర్తు చేశారు. వాటికి తక్షణం తెర దించాలని గురువారం మీడియా సమావేశంలో ఆయన సూచించారు. భారత ఎల్‌ఎన్‌జీ దిగుమతుల్లో 40 శాతానికి పైగా ఖతర్ నుంచి వస్తుండటం తెలిసిందే.
దాడులు గర్హనీయం: మోదీ
పశ్చిమాసియా తాజా పరిణామా లపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వెలిబుచ్చా రు. ఈ విషయమై పలువురు దేశాధినేతలతో ఆయన వేర్వేరుగా సంభాషించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, జోర్డాన్ రాజు అబ్దుల్లా–2తో ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులను గురించి వారితో లోతుగా చర్చించారు. ఇంధన వ్యవస్థలపై దాడులు తీవ్రంగా గర్హనీయమన్నారు. ఉద్రిక్తతలకు తక్షణం తెర దించి శాంతి, సుస్థిరత పాదుగొల్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
హార్మూజ్ జలసంధి గుండా సురక్షిత నౌకాయాన్ని తక్షణం పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. వీటన్నింటికీ దౌత్యం, మధ్యవర్తిత్వమే మార్గాలని స్పష్టం చేశారు. ఆ దిశగా జరిగే ప్రయత్నాలకు భారత్ అన్నివిధాలా మద్దతుగా నిలుస్తుందని మోదీ స్పష్టం చేశారు. అధినేతలతో చర్చలు ఫలప్రదంగా సాగినట్టు ఎక్స్ పోస్టుల్లో ఆయన వెల్లడించారు. పశ్చిమాసియా విషయమై ఆందోళనలతో వారంతా ఏకీభవించినట్టు తెలిపారు. ‘‘అబ్దుల్లా–2, తారిఖ్‌తో చర్చల సందర్భంగా జోర్డాన్, ఒమన్ ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపా. ఇంధన వనరులపై దాడులను ఖండించా’’అని తెలిపారు. గత ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఒమన్, జోర్డాన్ అధినేతలతో మోదీ సంభాషించడం ఇది రెండోసారి.
పాక్ నైజమే అంత: భారత్‌న్యూఢిల్లీ: అణ్వాయుధాల వ్యాప్తికి, అధునాతన క్షిపణి వ్యవస్థల విస్తరణకు పాకిస్తాన్ గుట్టుచప్పుడు కాకుండా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉందంటూ ఒక నివేదికలో అమెరికా నిఘా వర్గాలు వెలిబుచ్చిన ఆందోళనతో భారత్ ఏకీభవించింది. ‘‘ఇలాంటి వేషాలు పాక్‌కు కొత్త కాదు. ఆ దేశం నైజమే అంత’’ అంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్ గురువారం ఎద్దేవా చేశారు. ‘‘ప్రపంచానికి పాక్ ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. అమెరికా నివేదిక ఆ వాస్తవాన్ని మరోసారి అందరి ముందూ ఉంచంది’’ అని అభిప్రాయపడ్డారు.


