45 శాతం ద్రవరూప సహజవాయువు దిగుమతి ఇక్కడి నుంచే
ఖతర్ పాలకుల దార్శనికతకు ప్రత్యక్ష రూపమే రస్ లఫాన్ సహజవాయు క్షేత్రం. వేల కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యంత అధునాతన సాంకేతికతతో సృష్టించిన అతిపెద్ద సహజవాయు ప్రాసెసింగ్ కర్మాగారంగా ‘రస్ లఫాన్ ఇండ్రస్టియల్ సిటీ’ ప్రఖ్యాతిగాంచింది. ఖతార్, ఇరాన్ మధ్యలోని పర్షియన్ గల్ఫ్ సముద్రగర్భంలో సహజవాయు నిక్షేపాలను కనుగొనేందుకు 1996లో రస్ లఫాన్ ఇండ్రస్టియల్ సిటీని నిర్మించారు. వీళ్ల ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి.
1970 దశకంలో అపార సహజవాయు నిక్షేపాలను ఇక్కడి సముద్రగర్భంలో కనుగొన్నారు. ఇరాన్‌తో కలిసి గ్యాస్‌క్షేత్రాన్ని అభివృద్ధిచేసి ఖతర్ తన వాటాగా నార్త్ ఫీల్డ్‌ను తీసుకుంది. దీనినే నార్త్ డోమ్ అని కూడా పిలుస్తారు. ప్రపంచ 20 శాతం ద్రవరూప సహజవాయు అవసరాలను రస్ లఫాన్ క్షేత్రమే తీరుస్తోంది. తమ అ«దీనంలోని 900 ట్రిలియన్ల ఘనపు చదరపు అడుగుల (టీసీఎస్‌ఎఫ్) మేర సహజవాయువును రస్ లఫాన్ కాంప్లెక్స్ ద్వారా ఖతార్ ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది.
ఇక్కడే భారీ నౌకలను నిలిపేందుకు వీలుగా ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ నౌకాశ్రయాన్ని నిర్మించారు. దీంతో సీఎన్‌జీ కంటైనర్ షిప్‌లు నేరుగా ప్రాసెసింగ్ ప్లాంట్ల దాకా వచ్చి సరుకు నింపుకుని పయనమవుతాయి. ఇక్కడి నుంచి డజన్లకొద్దీ దేశాలకు ఎల్‌ఎన్‌జీ ఎగుమతి అవుతోంది. ఖతర్‌కు కాసుల వర్షం కురిపిస్తున్న ఈ నేచురల్ గ్యాస్ ఫీల్డ్ ప్రత్యక్షంగా భారత ద్రవరూప సహజవాయువు అవసరాలను తీరుస్తోంది. దోహా నగరానికి 80 కిలోమీటర్ల దూరంలోని ఈ పారిశ్రామిక నగరమే భారత 45 శాతం లిక్విడ్ నేచురల్ గ్యాస్ అవసరాలను తీరుస్తోంది. ఖతర్ ఆర్థికవ్యవస్థ పునాదులను పెకళించేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు పరోక్షంగా భారత్‌కు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి.
ఎరువులు, సీఎన్‌జీ, పీఎన్‌జీ అంతా ఇక్కడే..
భారత్‌లో దాదాపు 45 శాతం ఎరువుల తయారీ, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) అవసరాలు తీరాలంటే రస్ లఫాన్ క్షేత్రం నుంచి ద్రవరూప సహజవాయువు రావాల్సిందే. భారత్‌లో 34 శాతం ఎరువుల తయారీతోపాటు వాహనాల్లో సీఎన్‌జీకి, గృహావసరాలు తీర్చే పీఎన్‌జీకి రస్ లఫాన్ నుంచి దిగుమతి చేసుకునే ద్రవరూప సహజవాయవునే ఉపయోగిస్తున్నారు. పరిశ్రమల్లో పెట్రోరసాయనాల తయారీకి సైతం ఇదే ఎల్‌ఎన్‌జీ అవసరం. కొంతమేర భారత విద్యుత్ అవసరాలనూ ఇదే గ్యాస్ తీరుస్తోంది. అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి పోలిస్తే భారత్ రస్ లఫాన్ క్షేత్రం నుంచి ఎల్‌ఎన్‌జీ దిగుమతి చేసుకోవడమే అత్యంత చవకైన వ్యవహారం. అందుకే భారత్ దీనిపైనే అధికంగా ఆధారపడుతోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


