సౌత్ పార్స్. ఇరాన్ ఇంధన అవసరాలు తీర్చే అత్యంత కీలకమైన సహజవాయువు క్షేత్రం. తాజాగా ఈ క్షేత్రంపై అమెరికా దాడి చేయడంతో ఇరానియన్లకు ఒక్కసారిగా విద్యుత్ కష్టాలు వచ్చిపడ్డాయి. శీతాకాలంలో ఇళ్లను వెచ్చగా ఉంచే హీటింగ్ వ్యవస్థలు మొదలు పరిశ్రమల్లో ముడిసరుకు దాకా ఇదే సౌత్ పార్స్ నుంచి సరఫరా అయ్యే సహజవాయువునే ఇరాన్‌లో ఉపయోగిస్తున్నారు. దీంతో సౌత్ పార్స్ క్షేత్రం ఇరాన్‌కు ఎంతటి కీలకమైందనే అంశం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
వేల కిలోమీటర్లలో విస్తరించి..
పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న ఈ సహజవాయు క్షేత్రం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది ఇరాన్‌లోని అసలూయే నగరానికి సమీపంలో పర్షియన్ గల్ఫ్ సముద్రతీరంలో ఏకంగా 9,700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఐదు దశాబ్దాల క్రితం ఇక్కడ సహజవాయువు నిల్వలను తొలిసారిగా కనుగొన్నారు. ఇంతటి భారీ నిల్వలను సొంతంగా ప్రాసెసింగ్ చేసి, నిల్వ చేసి, వ్యాపారంచేసే శక్తిసామర్థ్యాలు ఇరాన్‌కు లేవు. దీంతో పొరుగుదేశం ఖతర్‌ను సాయం కోరింది. దీంతో ఖతర్, ఇరాన్‌లు సంయుక్తంగా గ్యాస్‌ఫీల్డ్‌ను అభివృద్ధి చేశాయి.
ఇరాన్ ప్రధానభూభాగం వైపు ఉన్న క్షేత్రాన్ని సౌత్ పార్స్‌గా, మిగతా క్షేత్రాన్ని నార్త్ ఫీల్డ్‌గా పిలుస్తున్నారు. నార్త్ ఫీల్డ్‌ను ఖతర్ నిర్వహిస్తోంది. మొత్తం సహజవాయు క్షేత్రంలో 33 శాతం భూభాగాన్నే సౌత్ పార్స్‌గా పిలుస్తారు. దీని మీదనే అమెరికా దాడిచేసింది. ఇరాన్ 80 శాతం దేశీయ నేచురల్ గ్యాస్ అవసరాలను సౌత్ పార్స్ క్షేత్రమే తీరుస్తోంది. అమెరికా, రష్యా, చైనా తర్వాత ద్రవరూప సహజవాయువును అత్యధికంగా ఉపయోగిస్తున్న దేశం ఇరానే. ఇరాన్ ఈ క్షేత్రంలో తయారైన లిక్విడ్ నేచురల్ గ్యాస్(ఎల్‌ఎన్‌జీ)తోనే దేశవ్యాప్తంగా విద్యుత్‌ను తయారుచేస్తోంది.
శీతాకాలంలో గడ్డకట్టే చలి నుంచి రక్షణ కోసం ఇళ్లను వేడిచేసే హీటింగ్‌వ్యవస్థలకు ఈ గ్యాసే ప్రాణాధారం. ఇరాన్ పరిశ్రమల్లో ముడిపదార్థంగానూ ఇదే గ్యాస్ అక్కరకొస్తోంది. దేశ ఇంధన జీవనాడిగా మారిన సౌత్ పార్స్‌పై అమెరికా దాడులతో ఇరాన్ ఇంధన కష్టాలు అనూహ్యంగా పెరిగిపోయాయి. తమ ప్రాణాధార వ్యవస్థ మీదనే దాడులు జరగడంతో ఇరాన్ ఇకపై మరింతగా దాడులతో చెలరేగిపోయే ప్రమాదముందని ఇంధన నిఘా సంస్థ ‘మాంటెల్ న్యూస్’లో భౌగోళిక రాజకీయ విశ్లేషకుడు ఆండ్రిస్ కాలా చెప్పారు. కొంత ఎల్‌ఎన్‌జీని ఇరాక్‌కూ ఇరాన్ సరఫరాచేస్తోంది. వాస్తవానికి ఎల్‌ఎన్‌జీని ఎగుమతి చేసేందుకు ఇరాన్ మూడు ప్రాజెక్టులను తీసుకొచ్చినా అమెరికా అంతర్జాతీయ ఆంక్షల కారణంగా అవి కార్యరూపం దాల్చలేదు
– సాక్షి, నేషనల్ డెస్క్


