ట్రంప్‌కు ఎవరైనా చెప్పగలరా..? నెతన్యాహు | Netanyahu dismisses suggestions Israel dragged US into Iran war | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ అమెరికాను యుద్దంలోకి లాగిందన్న వాదనలు కొట్టిపారేసిన నెతన్యాహు

Mar 20 2026 4:05 AM | Updated on Mar 20 2026 8:36 AM

Netanyahu dismisses suggestions Israel dragged US into Iran war

అమెరికాను ఇరాన్ యుద్ధంలోకి తాము లాగామన్న ఆరోపణలను ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఖండించారు. ప్రెసిడెంట్ ట్రంప్‌కు ఇలా చేయండని ఎవరైనా చెప్పగలరా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇరాన్‌పై యుద్దాన్ని అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా ప్రారంభించాయని అన్నారు.

యుద్దం ప్రారంభానికి ముందు అమెరికా–ఇరాన్ మధ్య అణు కార్యక్రమంపై చర్చలు సాగుతున్నాయని.. ఇరాన్ ముందుగా దాడి చేస్తుందని భావించి, తానే ముందస్తు చర్యలు తీసుకున్నానని ట్రంప్‌ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు.  

అలాగే ఇరాన్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడి విషయంలో అమెరికాకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఇజ్రాయెల్ ఒంటరిగానే ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ఈ దాడికి ఖతర్‌కు కూడా ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్‌ దాడిని ట్రంప్‌ ఖండించిన తర్వాత నెతన్యాహు ఈ ప్రకటన చేశారు.

కాగా, ఇజ్రాయెల్‌ ఇటీవలే ఇరాన్‌ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడులు చేసింది. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్ ఖతర్‌లోని ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌పై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌ భారీగా దెబ్బతింది. ఈ దాడులు ఇంధన ధరలను పెంచి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇప్పటికే హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ప్రభావితమవుతోంది.

ఈ పరిణామాలతో ఓ మెట్టుదిగినట్లు కనిపిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్‌ సౌత్‌ పార్స్‌ గ్యాస్‌ ఫీల్డ్‌పై దాడి చేయడం ముమ్మాటికి తప్పేనని తెలిపింది. భవిష్యత్తులో సౌత్‌ పార్స్‌ గ్యాస్‌ ఫీల్డ్‌పై దాడులు చేయరాదని ఇజ్రాయెల్‌ను కోరింది. ఈ అభ్యర్ధన మేరకు నెతన్యాహు సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడులు నిలిపేస్తామని ప్రకటించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement