దాడులు నిలిపివేస్తాం.. నెతన్యాహు ప్రకటన | Netanyahu Says Israel Will Stop Attacks On Iranian Gas Field | Sakshi
Sakshi News home page

దాడులు నిలిపివేస్తాం.. నెతన్యాహు ప్రకటన

Mar 20 2026 3:29 AM | Updated on Mar 20 2026 3:29 AM

Netanyahu Says Israel Will Stop Attacks On Iranian Gas Field

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థన మేరకు ఇరాన్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడులను నిలిపివేస్తామని ప్రకటించారు. తాజాగా జెరూసలేంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ట్రంప్ ఇరాన్‌ గ్యాస్ ఫీల్డ్‌పై దాడులను నిలిపి వేయమని కోరారు. మేము ఆయన అభ్యర్థనను గౌరవిస్తున్నామని అన్నారు. 

ఇరాన్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడి విషయంలో అమెరికాకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఇజ్రాయెల్ ఒంటరిగానే ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. అలాగే ఈ దాడికి ఖతర్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్‌ దాడిని ట్రంప్‌ ఖండించిన తర్వాత నెతన్యాహు ఈ ప్రకటన చేశారు.

ఇజ్రాయెల్‌ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఖతర్‌లోని ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌పై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌ భారీగా దెబ్బతింది. ఈ దాడులు ఇంధన ధరలను పెంచి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇప్పటికే హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో, ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ప్రభావితమవుతోంది.

ఈ పరిణామాలతో ఓ మెట్టుదిగినట్లు కనిపిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్‌ సౌత్‌ పార్స్‌ గ్యాస్‌ ఫీల్డ్‌పై దాడి చేయడం ముమ్మాటికి తప్పేనని తెలిపింది. భవిష్యత్తులో సౌత్‌ పార్స్‌ గ్యాస్‌ ఫీల్డ్‌పై దాడులు చేయరాదని ఇజ్రాయెల్‌ను కోరింది. ఈ అభ్యర్ధన మేరకే నెతన్యాహు దాడులు నిలిపేస్తామని ప్రకటించారు.

సౌత్‌ పార్స్‌ గ్యాస్‌ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్‌ దాడులను ఆపాలని కోరిన ట్రంప్‌.. ఇరాన్‌కు సైతం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్‌ దాడి చేసిందని ఖతర్‌పై మరోసారి దాడి చేస్తే ఊహకందని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రూత్‌ వేదికగా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement