‘చెరిపేసే’ హక్కు ఏమిటి? | Right to be forgotten: Supreme court to examine if it applies to online news | Sakshi
Sakshi News home page

‘చెరిపేసే’ హక్కు ఏమిటి?

Feb 7 2026 6:20 AM | Updated on Feb 7 2026 6:20 AM

Right to be forgotten: Supreme court to examine if it applies to online news

ఆన్‌లైన్‌ న్యూస్‌కు వర్తిస్తుందా?   

సుప్రీంకోర్టు చెంతకు వివాదం

విచారణకు స్వీకరించిన ధర్మాసనం

న్యూఢిల్లీ: ఆర్టికల్‌ 21 ప్రకారం పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో భాగంగా వారి గోప్యతను పరిరక్షించేందుకు ఉద్దేశించిన ‘చెరిపివేత హక్కు’(రైట్‌ టు బీ ఫర్‌గాటెన్‌–ఆర్‌టీబీఎఫ్‌)కు సంబంధించి ఆసక్తికరమైన కేసు ఒకటి సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. దీనిప్రకారం వ్యక్తులు తమపై ఆన్‌లైన్‌లో ఉన్న కంటెంట్‌ను తొలగించాలని కోరేందుకు హక్కు ఉంటుందా అన్న అంశాన్ని తేల్చాలంటూ ఒక పిటిషన్‌ దాఖలైంది. 

క్రిమినల్‌ కేసులో నిరపరాధిగా విడుదలైన ఒక వ్యక్తి తాలూకు విచారణ ప్రక్రియకు సంబంధించిన కంటెంట్‌ను ఆర్‌టీబీఎఫ్‌ కింద పబ్లిక్‌ డొమైన్‌ నుంచి తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ మీడియా సంస్థ దీన్ని దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ‘‘ఇది నూతన యుగం. 

కనుక గోప్యత హక్కులో భాగంగా ఆర్టికల్‌ 21లో పేర్కొన్న ఆర్‌టీఈఎఫ్, ఆర్టికల్‌ 19లో పేర్కొన్న మీడియా స్వేచ్ఛ హక్కులను సంతులనం చేయాల్సిన అవసరముంది’’అని ఈ సందర్భంగా పేర్కొంది. అసలు ఆర్‌టీబీఎఫ్‌ను, దాని పరిధిని నిర్దిష్టంగా నిర్వచించాలన్న పిటిషన్‌పై విచారణ జరిపేందుకు అంగీకరించింది. మార్చి 16లోగా స్పందించాల్సిందిగా టూ సదరు వ్యక్తికి, పిటిషన్లు దాఖలు చేసిన ఇతర మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. 

ఏమిటీ కేసు? 
ఒక క్రిమినల్‌ కేసులో నిర్దోíÙగా తేలిన ఓ, వ్యక్తి విచారణ ప్రక్రియకు సంబంధించి మీడియా సంస్థల్లో తనపై వెలువడ్డ వార్తలు తదితరాలన్నింటినీ ఆన్‌లైన్‌ డొమైన్ల నుంచి తొలగించాలంటూ దిగువ కోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఇండియన్‌ కానూన్‌ అనే ఆన్‌లైన్‌ పోర్టల్‌ దాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. 

హైకోర్టు కూడా కూడా సదరు వ్యక్తికే అనుకూలంగా 2025 డిసెంబర్‌ 18న తీర్పు వెలువరించింది. దాంతో మీడియా సంస్థ సుప్రీం గడప తొక్కింది. అనంతరం పలు ప్రఖ్యాత మీడియా సంస్థలు కూడా ఈ కేసులో ఇంప్లీడ్‌ అయ్యాయి. ఆన్‌లైన్‌ న్యూస్‌కు ఆర్‌టీబీఎఫ్‌ వర్తించదని ఇండియన్‌ కానూన్‌ పోర్టల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అర్వింద్‌ దాతార్‌ ఈ సందర్భంగా వాదించారు.

 ఈ విషయంలో ఢిల్లీ తీర్పును హైకోర్టు మద్రాస్, రాజస్తాన్, పంజాబ్‌–హరియాణా హైకోర్టులు ప్రమాణంగా పరిగణించి అభిప్రాయాలు వెల్లడించాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

 దాంతో, పరువునష్టం కేసుల్లో తీర్పుల విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సదరు తీర్పును ప్రమాణంగా పరిగణించడానికి వీల్లేదని ధర్మాసనం పేర్కొంది. గోప్యత హక్కులో చరిత్రను చెరిపేసే హక్కు భాగం కాదని 2017 నాటి చరిత్రాత్మక కె.ఎస్‌.కుప్పుస్వామి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని దాతార్‌ గుర్తు చేశారు. ‘‘మీడియా సంస్థలు ఒకే వార్తను పదేపదే చూపిస్తే పరిస్థితి ఏమిటి? అలాంటప్పుడు ఆర్టికల్‌ 19, 21లలో దేన్ని వర్తింపజేయాలి?’’అని ధర్మాసనం ఆయనను ప్రశ్నించింది. 

పత్రికల్లో ఒకసారి ప్రచురితమయ్యే వార్త ఎప్పటికీ అలాగే ఉండిపోతుందని ఆయన గుర్తు చేశారు. కనుక వార్తాంశాన్ని చెరిపేయడం సాధ్యపడదని బదులిచ్చారు. ‘‘ఆ పరిస్థితిలో సదరు వార్త సజీవంగానే ఉండిపోతుంది. అలాంటప్పుడు చెరిపేసే హక్కు పరిస్థితి ఏమిటి?’’అని జస్టిస్‌ నాగరత్న ప్రశ్నించారు. కోర్టు ఆదేశాల మేరకు సదరు వ్యక్తికి సంబంధించి వార్తాంశాలను తాము తొలగించినట్టు దాతార్‌ తెలిపారు. అయితే నిర్దిష్ట కాలం గడిచాక ఏ వార్తాంశమైన ఆర్కైవ్స్‌లోకి వెళ్లి ఉండిపోతుందని బదులిచ్చారు. 

పైగా ఇలాంటి వార్తాంశాల నుంచి సదరు వ్యక్తి పేరునే పూర్తిగా తొలగిస్తే ఆ ఉదంతానికి సంబంధించిన కథనమంతా కనుమరుగైనట్టేనని ఆందోళన వెలిబుచ్చారు. పౌరులకు సమాచారం అందుకుండా చేసేందుకు ఈ రోజుల్లో గోప్యత పేరిట అడ్డుగోడలు పుట్టుకొస్తున్నాయని జస్టిస్‌ భూయాన్‌ అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఆర్‌టీబీఎఫ్‌ను చరిత్రను చెరిపేసే పనిముట్టుగా వాడుకునేందుకు ఢిల్లీ హైకోర్టు తీర్పు వీలు కల్పింంచిందని దాతార్‌ ఆరపించారు. 

కనుక దాని రాజ్యాంగబద్ధత, అమలు పరిధి తదితరాలను స్పష్టంగా నిర్వచించాలని ధర్మాసనాన్ని అభ్యరి్థంచారు. ‘‘విచారణ సందర్భంగా కోర్టులు చేసే వ్యాఖ్యలు మర్నాడు మీడియాలో వార్తలుగా మారుతున్నాయి. అనంతరం కోర్టులు ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నంత మాత్రాన సదరు వార్తా కథనాలను కూడా తొలగించగలమా?’’అని ప్రశ్నించారు. ‘‘ఈ సోషల్‌ మీడియా యుగంలో కొన్ని విషయాలకు సంబంధించి తమను అంతా మర్చిపోవాలని వాంఛించే వారి సంఖ్య పెరుగుతోంది. ఏమైనా ఇది ఆసక్తికరమైన అంశమే. దీన్ని లోతుగా పరిశీలిస్తాం’’అని జస్టిస్‌ నాగరత్న పేర్కొన్నారు.

గతంలోనూ ‘సుప్రీం’ఆందోళన 
చెరిపేసే హక్కు (ఆర్‌టీబీఎఫ్‌) అమలు తీరుతెన్నులపై గతంలో కూడా సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. దీని ప్రకారం కోర్టు తీర్పులను పబ్లిక్‌ డొమైన్‌ నుంచి తొలగిస్తే పరిణామాలు తీవ్రంగా, దారుణంగా ఉంటాయని 2024లో ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టు పేర్కొంది.  

Advertisement
 
Advertisement
Advertisement