అజిత్ దోవల్ ఇండియన్ జేమ్స్ బాండ్‌గా పిలుచుకునే ఈ ఆఫీసర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. భారత గూఢచారిగా ఎన్నో సీక్రెట్ మిషన్లలో పాల్గొని దేశ భద్రతలో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇంతవరకూ ఇంటర్నెట్ వాడడం లేదని, మెుబైల్‌కు సైతం చాలావరకూ దూరంగా ఉంటానని తెలిపారు.
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాతృభూమి రక్షణ కోసం అనునిత్యం తపించే ఈ ఆఫీసర్ దేశం కోసం ఎన్నో రిస్కీ ఆపరేషన్‌లు చేశారు. 1980 దశకంలో పాకిస్థాన్‌లో ఏడేళ్లపాటు ముస్లిం వ్యాపారిగా, బిచ్చగాడిగా నటిస్తూ భారత్‌కు ఎంతో కీలక సమాచారాన్ని చేరవేశారు. అంతేకాకుండా అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్‌లో నక్కిన మిలిటెంట్లను బయిటకి తీసేందుకు అండర్ కవర్ ఏజెంట్‌గా పనిచేశారు. ఇలా భారత్ కోసం ఆయన ప్రాణాలు తెగించి చేసిన ఆపరేషన్‌లు అనేకం. అందుకే ఆయనను అందరూ ఇండియన్ జేమ్స్‌బాండ్ అని పిలుచుకుంటారు.
అయితే శనివారం ఢిల్లీ భరత మండపంలో జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్-2026- కార్యక్రమం జరిగింది. అందులో అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ" నేను అసలు ఇంటర్నెట్ వినియోగించను. ఇది నిజం అంతేకాకుండా మెుబైల్ ఫోన్ అసలు వాడను. కేవలం విదేశాల్లో ఉన్నప్పుడు మా కుటుంబసభ్యులతో మాట్లాడడానికి తప్ప దానిని వినియోగించను. నాపని అంతా అలానే సాగుతుంది" అని అజిత్ దోవల్ అన్నారు.
1945లో ఉత్తరాఖండ్‌లో జన్మించిన అజిత్ దోవల్ 1968లో ఐపీఎస్ సాధించి కేరళ క్యాడర్‌కు ఎంపికయ్యారు. కాందహార్ ఫ్లైట్ హైజాక్ సమయంలో భారత్ తరపున చర్చలలో పాల్గొన్నారు. అంతేకాకుండా అత్యంత చిన్న వయసులో కీర్తి చక్ర అవార్డుకు ఎంపికయిన పోలీసు ఆఫీసర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. అజిత్ దోవల్ ఇంటిలిజెన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం విభాగాల్లో దశాబ్దాల కాలం పాటు భారత్‌కు సేవలందించారు.


