సాక్షి, హైదరాబాద్: పొగమంచులో వాహనాలతో సాహసం వద్దంటూ.. మంచు తగ్గాకే కదలాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సంక్రాంతి సంబరం విషాదం కాకూడదు.. పండుగ నాడు పల్లెకు చేరాలన్న ఆత్రుత, మీ ప్రాణాల మీదకు తేకూడదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కమ్మేసిన దట్టమైన పొగమంచు.. మృత్యువుకు ముసుగులా మారింది. ఎదురుగా ఏముందో కనిపించని ఈ పరిస్థితిలో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం’’ అని సజ్జనార్ సూచించారు.
పొగమంచులో సొంత వాహనాల్లో ప్రయాణం వద్దు. తెల్లవారుజామున లేదా అర్ధరాత్రి వేళల్లో సాహసం చేయకండి. దయచేసి పొగమంచు పూర్తిగా తగ్గి, రోడ్డు స్పష్టంగా కనిపించిన తర్వాతే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. మీ రాక కోసం మీ వాళ్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. వారి కళ్లలో ఆనందాన్ని నింపండి.. కన్నీళ్లను కాదన్న సజ్జనార్.. తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలంటూ సూచనలు ఇచ్చారు.
పొగమంచులో వాహనాలతో సాహసం వద్దు.. మంచు తగ్గాకే కదలండి!
సంక్రాంతి సంబరం విషాదం కాకూడదు.. పండుగ నాడు పల్లెకు చేరాలన్న ఆత్రుత, మీ ప్రాణాల మీదకు తేకూడదు!
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కమ్మేసిన దట్టమైన పొగమంచు.. మృత్యువుకు ముసుగులా మారింది. ఎదురుగా ఏముందో కనిపించని ఈ పరిస్థితిలో… pic.twitter.com/esYAMfcz8O— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 9, 2026
‘‘పొగమంచు ఉన్నప్పుడు వాహనం నడపాల్సి వస్తే.. ఫాగ్ లైట్లు (Fog Lights), ఇండికేటర్లు ఆన్ చేయండి. ముందు వెళ్లే వాహనానికి తగినంత దూరం (Safe Distance) పాటించండి. రోడ్డు ఖాళీగా ఉందని వేగంగా వెళ్లొద్దు. గుర్తుంచుకోండి.. ఆలస్యంగానైనా సరే.. క్షేమంగా ఇంటికి చేరడమే నిజమైన పండుగ’’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.


