ఈ నెల 7న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
ప్రభుత్వ సెక్టార్‌లో ‘ఐవీఎఫ్’తో తొలి ప్రసవం
రాష్ట్ర సర్కారు విజయం
నేడో రేపో వైద్య శాఖ మంత్రి అధికారిక ప్రకటన
హైదరాబాద్: అమ్మతనం గెలిచింది.. మాతృత్వపు మమకారం సాకారమైంది. సంతానం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన జంటకు శుభ ఘడియలు కళ్ల ముందు సాక్షాత్కారమయ్యాయి. శిశువు తొలి స్పర్శతో ఆ తల్లి తనువు పులకించిన క్షణం.. ఇది రాష్ట్ర సర్కారు, ‘గాం«దీ’ ఆస్పత్రి వైద్యులు సాధించిన విజయం. ప్రభుత్వ సెక్టార్‌లో ఐవీఎఫ్ ద్వారా తొలి ప్రసవం. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మాతాశిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) ఇందుకు వేదిక అయింది. ఒకటి రెండు రోజుల్లో వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నగరానికి చెందిన ఓ జంటకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. పిల్లల కోసం పలు ప్రైవేటు ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయించగా, డబ్బులు ఖర్చయ్యాయి తప్ప ఫలితం కన్పించలేదు. సన్నిహితుల సూచన మేరకు ఆ దంపతులు 2024 అక్టోబర్‌లో గాంధీ ఆస్పత్రిలో సంతాన సాఫల్య కేంద్రానికి వచ్చారు. అక్కడి వైద్యులు పలు రకాల వైద్యపరీక్షలు, స్కానింగ్‌లతో పాటు వైద్యసేవలు,. సలహాలు, సూచనలు అందించారు. ప్రైవేటు ఫెర్టిలిటీ సెంటర్‌లో ఇంట్రాయుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) ఫెయిల్ అయిందని తెలుసుకున్న వైద్యులు ఇన్‌విట్రో ఫైరి్టలైజేషన్ (ఐవీఎఫ్) చికిత్స అందించారు.
ఈ ప్రయత్నం విజయవంతమైంది. ఈ నెల 7న పండంటి శిశువుకు ఆమె జన్మనిచ్చారు. బుధ లేదా గురువారం తల్లీబిడ్డలను డిశ్చార్జి చేయనున్నట్లు సమాచారం. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే ప్రభుత్వ సెక్టార్‌లో ఐవీఎఫ్ ద్వారా విజయవంతమైన మొదటి కేసు కావడం గమనార్హం. కాగా ‘గాం«దీ’ ఆస్పత్రి సంతాన సాఫల్య కేంద్రంలో మొత్తం 43 మంది శాంపిల్స్ సేకరించి, 17 మందికి ఐవీఎఫ్ చికిత్స విధానం ప్రారంభించగా ఏడుగురిలో పాజిటివ్ రిజల్డ్ వచి్చనట్లు తెలిసింది.


