ఖిలా వరంగల్/నర్సింహులపేట: వరంగల్ నగరం ఫోర్ట్ రోడ్డులోని పీఏసీఎస్ కార్యాలయ భవనం వద్ద శనివారం రైతులు యూరి యా కోసం బారులుదీరారు. పీఏసీఎస్‌కు 440 బస్తాల యూరియా రాగా, క్యూలైన్‌లో సుమారు 600 మంది రైతులు గంటలకొద్దీ నిరీక్షించారు. రైతులు క్యూలైన్‌లో ఉండగానే యూరియా అయిపోవడంతో అంతసేపు క్యూలో నిల్చున్న రైతులు అందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారి విజ్ఞాన్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలపగా సాయంత్రానికి మరో 440 బస్తాల యూరియా వచి్చంది. ఆదివారం ఉదయం యూరియా పంపిణీ చేయనున్నట్లు సొసైటీ సిబ్బంది తెలిపారు.
అధికారి కాళ్లపైపడ్డ రైతు..
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద బస్తారాం తండాకు చెందిన రాజు అనే రైతు మొక్కజొన్న చేనుకు యారియా కోసం శనివారం రెండు గంటలపాటు క్యూలో నిలబడినా దొరకలేదు. తన పంట నష్టపోతుందని వేడుకుంటూ అదే సమయంలో బయటికి వెళ్తున్న ఏఓ కాళ్లపై పడి యూరియా కోసం విజ్ఞప్తి చేశాడు.


