గుప్త దానం | Giving food for the sake of name and fame | Sakshi
Sakshi News home page

గుప్త దానం

Jan 19 2026 6:19 AM | Updated on Jan 19 2026 6:19 AM

Giving food for the sake of name and fame

ఆధ్యాత్మికథ

స్వామి వారి దర్శనార్థం తిరుమలకొండకు చాలామంది తమిళ భక్తులు కాలినడకన వెళ్తూ  ఉంటారు. వారు కాలికి చెప్పులు వేసుకోరు. ఆడామగా తేడా లేకుండా పసుపు గుడ్డలు ధరించి, భుజానికి సంచి తగిలించి, గోవింద నామస్మరణలు చేస్తూ నడుస్తారు. అలసిన సమయంలో ఏ చెట్టునో ఏ గుడినో ఆశ్రయిస్తారు. దొరికింది తింటారు.

తమిళనాడు దాటి ఆంధ్ర సరిహద్దుల్లో ప్రవేశించే దారిలో అనేక పల్లెటూర్లు ఉన్నాయి. ఆ ఊర్లలోని ఒక పల్లెటూరి యువకుడికి ఒక పౌర్ణమి రోజున నడిచి వెళ్ళే భక్తులకు అన్నదానం చేయాలనిపించి తండ్రితో ఆ విషయం చెప్పాడు. ‘‘పేదలమైన మనం అంత ఖర్చుతో కూడుకున్న పనులు చేయలేము, ఆ ఆలోచన మానుకో!’’ అన్నాడు తండ్రి. 

‘‘మన దగ్గర డబ్బు లేదు సరే, దానగుణం ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కదా, వారిని అడుగుదాము’’ అన్నాడు కొడుకు.

సరేనని కొడుకును తోడు చేసుకుని తండ్రి ఊరివారినడిగాడు. ఎవ్వరూ స్పందించలేదు. పక్క ఊరికి వెళ్ళారు. అక్కడ ఒక ధనవంతుడిని కలిశారు. తాను ఎంతమందికైనా చక్కటి విందు భోజనం ఏర్పాటు చేయగలనని, అయితే, అన్నదానం చేసే చోట తన పేరును పెద్ద అక్షరాలతో రాసి పెట్టాలని కోరాడతను. ఆలోచించి చె΄్తామని అక్కడినుంచి కదిలాడు తండ్రి. వెనుకనే కొడుకు కూడా నడిచాడు.

మరో ఊరు వెళ్తూ ఉంటే దారిలో ఒక మధ్యతరగతి రైతు కనిపించాడు. ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. అన్నదాన కార్యక్రమానికి దాతలకోసం వెదుకుతున్నామని బదులిచ్చారు. వెంటనే ఆ రైతు ‘‘నాకు ఆ అవకాశం ఇవ్వండి. విందు భోజనం కాక΄ోయినా నా శక్తి కొలది మంచి భోజనమే చేయిస్తాను. అయితే నేను అన్నదానం చేసినట్లుగా ఎక్కడా ప్రచారం చేయకండి. నాకు అలాంటి ప్రచారాలు ఇష్టం లేదు’’ అని చెప్పాడు. అలాగేనని తండ్రి అంగీకరించాడు.

పౌర్ణమి రోజు రానే వచ్చింది. భక్తులకు తండ్రీకొడుకు అన్నదానం చేస్తూ ఉన్నారు. కొడుకు తండ్రితో ‘‘ఇప్పుడు మనం చేసే అన్నదానం... పులిహోర, పెరుగన్నం, అరటిపండే కదా. దీనికన్నా చక్కటి భోజనం ఏర్పాటు చేస్తానన్న అతడి విందు ఎందుకు వద్దన్నావు? అని ప్రశ్నించాడు.

తండ్రి నవ్వి ‘‘ప్రతిఫలం ఆశించకుండా చేస్తేనే అది దానమవుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదంటారు. పేరు ప్రతిష్టల కోసం చేసేది దానమనిపించుకోదు. అందుకే దాన్ని వద్దన్నాను’’ అని వివరించాడు. తృప్తి్తగా తిన్న భక్తులు ‘అన్నదాతా సుఖీభవ!’ అంటూ అక్కడినుంచి కదిలారు.

– ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement