తినటానికి ఒక్కరే
తిరగటానికీ ఒక్కరే
ప్రయాణాలూ ఒక్కరే
మారుతున్న ట్రెండ్
కన్నేసిన మార్కెట్!
సాక్షి, స్పెషల్ డెస్క్: ఇటీవలి వరకు కూడా ఈ లోకం అంతా ‘జంట’లమయమే! హోటల్ కువెళ్తే ఎదురెదురుగా రెండు కుర్చీలు, ట్రావెల్ ప్యాకేజీలంటే తప్పనిసరిగా కపుల్ ఆఫర్లు, వీకెండ్స్ అంటే ఫ్యామిలీ హడావిడి. కానీ ఈ ‘నిండైన’ దృశ్యం మెల్లిగా మార్పు చెందుతోంది. ఎక్కడ చూసినా సోలో ‘రాజా సాబ్’లు, ఏకాంతవాస రాణీ రత్నమాలలు దర్శనం ఇవ్వటం మామూలైపోయింది.
సింగిల్ రిజర్వేషన్
రెస్టారెంట్‌లలో సింగిల్ టేబుల్ రిజర్వేషన్‌తో మొదలైన ఈ ధోరణి, ఎవరో తోడు లేని వారు చేస్తున్న పని కాదు. ఎవరి తోడూ అవసరం లేదని అనుకుంటున్న వారు ఎంచుకుంటున్న మార్గం. మునుపటిలా, ‘‘ఎవరైనా కలిసి వస్తే వెళ్దాంలే..’’ అని వేచి ఉండే
రోజులు పోయాయి! ఇప్పుడు తినటానికైనా ఒక్కరే,విహరించటానికైనా ఒక్కరే.
ఎవరూ లేక కాదు
ఇదేమీ ఒంటరితనం కాదు. ఒక స్వీయ చికిత్స. తనకి నచ్చినట్టు తాను ఉండటం మాత్రమే. ఎవరితోనూ సంబంధం ఉండదు. ఎవరితోనూ సర్దుబాటు ఉండదు. తనకు నచ్చిన దారి, తనకు నచ్చిన వేగం, తనకు నచ్చిన స్థలం! సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక స్వేచ్ఛ.

వింత అసలే కాదు
భోజనం, ప్రయాణం, వినోదం.. ఇప్పుడు సోలో జీవన శైలికి సంకేతంగా మారింది. లైవ్ ఈవెంట్‌లకు ఒక్కరే వెళ్లేవారు ఎక్కువయ్యారు. ఉదయ్‌పూర్, కూర్గ్, సిక్కిం వంటి సురక్షిత మైన ప్రాంతాలకు మహిళలు ఒంటరి ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. డిమ్ లైట్‌ల డైనింగ్ హాళ్లలో టేబుల్‌కు ఒకరే కూర్చొని భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది ఖర్చు తగ్గించుకోవటం కాదు, ఎంతైనా ఖర్చుపెట్టి ఏకాంతాన్ని కొనుక్కోవటం.
మార్కెట్ పసిగట్టేసింది!
ఇదేదో చిన్న మార్పు కాదని బిజినెస్ లోకానికి అర్థమైపోయింది. రాబోయే కాలంలో సమాజాన్ని ముంచెత్తనున్న ఒక పెద్ద ‘వేవ్’ అని కనిపెట్టేసింది. ఇకనేం, కంపెనీల ఆలోచనా విధానమే మారిపోయింది. నిన్న మొన్నటి వరకు ‘ఫ్యామిలీ’ చుట్టూ తిరిగిన మార్కెట్ ఇప్పుడు లైట్ హౌస్‌లా తన ఫోకస్‌ను ఒంటరి కెరటాల మీదకు మళ్లించింది.
ఇండియాలో ‘ఒంటరి’ డేటా
⇒ 2020నాటికి ఉన్న ఒంటరి వ్యక్తుల గృహాల సంఖ్య 1 కోటి 74 లక్షలు
⇒ 2030కి ఒంటరి గృహాల సంఖ్యలో అంచనా పెరుగుదల 5.5 శాతం
⇒ సోలో దేశీయ ప్రయాణాల బుకింగ్‌లలో పెరుగుదల : ఏటా 20–35 శాతం
⇒ గత ఏడాది ఒంటరిగా ఈవెంట్‌లకు, సినిమాలకు వెళ్లినవారు : 18 లక్షలకు పైగా
⇒ 2025–2030 మధ్య పెరగనున్న సోలో ట్రావెల్ మార్కెట్ విలువ సుమారు : రూ. 359 కోట్ల 36 లక్షల 50 వేలు


