గత ఏడాది జూలై నుంచి పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ నిలిపివేత
సెప్టెంబర్ నుంచి పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పాస్‌బుక్కుల జారీ
మ్యుటేషన్లు పూర్తయిన తర్వాత కూడా ఇంకా లక్షకు పైగా పెండింగ్
మద్రాస్ ప్రింటింగ్ ప్రెస్‌కు రూ. 2.4 కోట్ల బకాయిలు
45 రోజుల క్రితమే బకాయి చెల్లించామంటున్న అధికారులు
పర్యవేక్షణ వ్యవస్థ లేని భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం
కొత్త కంపెనీకి ఆర్డర్ ఇచ్చే టెండర్లు పెండింగ్‌లోనే... ఇంకా ఖరారు కాని టీఎస్‌టీఎస్ టెండర్లు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగి మ్యుటేషన్లు పూర్తయిన తర్వాత కూడా కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు రైతులకు అందడం లేదు. రాష్ట్రంలో గత ఏడాది జూలై నుంచే పాస్ బుక్కుల ముద్రణ నిలిచిపోగా, సెప్టెంబర్ నెల నుంచి కొత్త పాస్‌పుస్తకాలు రావడం పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. అయితే, ఈ పాస్ పుస్తకాలను ఇప్పటివరకు ముద్రిస్తోన్న మద్రాస్ ప్రింటింగ్ ప్రెస్‌కు రెవెన్యూ శాఖ రూ.2.4 కోట్ల బకాయి పడిందని, అందుకే పాస్‌పుస్తకాల ముద్రణ నిలిచిపోయిందని తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1.06 లక్షల పాస్ పుస్తకాలు ముద్రించకుండా నిలిచిపోయాయని సమాచారం.
రిజిస్ట్రేషన్ సమయంలోనే...: వాస్తవానికి, భూమి రిజి్రస్టేషన్ సమయంలోనే పాస్ పుస్తకాల ముద్రణకు అవసరమైన ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో భూమి మ్యుటేషన్ కాగానే ఆ వివరాలు తహసీల్దార్ కార్యాలయం నుంచి సీసీఎల్‌ఏకు, అక్కడి నుంచి ముద్రణ సంస్థకు వెళతాయి. అలా ప్రింటింగ్ ప్రెస్‌కు వెళ్లిన వివరాల ఆధారంగా పాస్ పుస్తకం ప్రింట్ అయి నేరుగా రైతు అడ్రస్‌కు వెళుతుంది. ఒక్కో పాస్ పుస్తకం ముద్రించేందుకు రూ.45 ఖర్చు అవుతుందనే అంచనాలుండగా, రైతు నుంచి రూ.300 ఫీజును ప్రభుత్వం వసూలు చేస్తుంది.
కానీ, ఈ పాస్ పుస్తకాలు ముద్రించేందుకు అవసరమైన నిధులను ప్రింటింగ్ ప్రెస్‌కు చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేయడంతోనే ఈ సమస్య వచ్చిందని అధికారులు చెబుతున్నారు. మరో విషయమేమిటంటే... ప్రస్తుతం పాస్ పుస్తకాలు ప్రింట్ చేస్తున్న సంస్థ కాకుండా వేరే సంస్థకు ఈ ముద్రణ బాధ్యతలు అప్పగించేందుకు తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సరీ్వసెస్ (టీఎస్‌టీఎస్) నుంచి ఎప్పుడో టెండర్లు పిలిచారు కానీ ఇప్పటివరకు వాటిని ఖరారు చేయకపోవడంతో అసలు ఎవరు ముద్రిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. పైగా ఈ పాస్ పుస్తకాల అంశాన్ని పర్యవేక్షించేందుకుగాను భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయంలో ఓ వ్యవస్థ కూడా లేకపోవడం గమనార్హం.
వెనక్కి వచ్చాయంటే అంతే...!
పాస్ పుస్తకం ముద్రణ సంగతి అటుంచితే ముద్రించి పంపిన పుస్తకాలు పొరపాటును రైతును చేరకపోతే ఇక ఆ పాస్ పుస్తకం మళ్లీ చేతికి రావడం అసాధ్యమని గత అనుభవాలు చెబుతున్నాయి. ఈ పాస్ పుస్తకాలను నేరుగా రైతు అడ్రస్‌కు ముద్రణా సంస్థే రిజిస్టర్ పోస్టులో పంపుతుంది. ఒక వేళ ఆ పోస్టును తీసుకోలేని పక్షంలో పుస్తకం నేరుగా భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయానికి వెళుతుంది.
ఇలా వెనక్కి వెళ్లిన పుస్తకాలను ఏళ్ల తరబడి సీసీఎల్‌ఏలో గోనె సంచుల్లో కట్టి భద్రపరుస్తారే కానీ, వాటిని మళ్లీ రైతులకు చేర్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఇలా భద్రపర్చిన పాస్ పుస్తకాలు కొన్ని వేలు ఉంటాయని అంచనా. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఒకవేళ రైతు పాస్ పుస్తకాన్ని పోస్టులో తీసుకోలేకపోతే సదరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లేలా ఫ్రం అడ్రస్ ముద్రించాలని, లేదంటే కనీసం ఆయా జిల్లాల కలెక్టరేట్‌లకైనా పంపాలని రెవెన్యూ వర్గాలే సూచిస్తున్నాయి.
ఎన్ని కావాలంటే... అన్ని
ఇదిలా ఉంటే... అసలు పాస్ పుస్తకాలు రావడంలో ఇబ్బంది ఉన్నా డూప్లికేట్ పుస్తకాలు మాత్రం ఎన్నయినా తెచ్చుకునేందుకు రెవెన్యూ శాఖ అనుమతిస్తుండడం గమనార్హం. పాస్ పుస్తకం కనిపించని సందర్భంలో రైతులు డూప్లికేట్ కోసం మీసేవలో దరఖాస్తు చేసుకోవచ్చు.
అలా ఎన్ని పుస్తకాలకోసమైనా దరఖాస్తు చేసుకోవచ్చని, డూప్లికేట్లు ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకోవచ్చని, డూప్లికేట్ ఎందుకు అడుగుతున్నారనే కారణం కూడా అడగరని, 100 పుస్తకాలు కావాలన్నా ప్రతి పుస్తకానికి రూ.300 చెల్లించి దరఖాస్తు చేసుకుంటే 100 పుస్తకాలు వస్తాయని మీ సేవ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నిబంధనను సవరించాలని, డూప్లికేట్ పాస్ పుస్తకం కోసం నిబంధనలు కఠినతరం చేయాలని, తద్వారా రైతు భూమి హక్కుకు రక్షణ కలగడమే కాకుండా, దురి్వనియోగం కాకుండా చూడవచ్చని రైతు సంఘాలంటున్నాయి.
ఇచ్చేశాం...వస్తున్నాయి కదా?
పాస్ పుస్తకాల ముద్రణపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రింటింగ్ ప్రెస్‌కు బకాయి పడిన మాట వాస్తవమేనని, అయితే, ఈ బకాయిని 45 రోజుల క్రితమే చెల్లించామని చెప్పారు. వెంటనే పాస్ పుస్తకాల ముద్రణ ప్రారంభమైందని, రైతులకు పాస్ పుస్తకాలు అందుతున్నాయని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదే విషయమై ఓ తహసీల్దార్ మాట్లాడుతూ పాస్ పుస్తకాలు రాక నెలలు గడిచిపోయిందని చెప్పారు. రైతులు అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదన్నారు. అసలు ఈ పుస్తకాలు ఎవరు ముద్రిస్తున్నారో కూడా అర్థం కావడం లేదని, పాస్ పుస్తకం రాకపోతే సీసీఎల్‌ఏ కార్యాలయంలో ఎవరిని అడగాలో కూడా తమకే స్పష్టత లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.
మూడు నెలలవుతోంది
‘భూమి కొనుగోలు చేసి రిజి్రస్టేషన్ చేసుకొని మూడు నెలలవుతోంది. ఇప్పటి వరకు పాస్ పుస్తకం రాలేదు. అధికారులను అడిగితే వస్తుందని చెప్తున్నారు కానీ ఎప్పుడు వస్తుందో చెప్పడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – సునీత, హుస్సేన్‌నగర్, న్యాలకల్ మండలం, సంగారెడ్డి జిల్లా
ఐదు నెలలవుతోంది
‘రిజి్రస్టేషన్ చేసుకొని ఐదు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు పాస్ పుస్తకం రాలేదు. అధికారులను అడిగితే పై నుంచి వస్తుందని చెప్తున్నారు. పట్టా పుస్తకం లేకపోవడంతో బ్యాంకు రుణం తీసుకోవాలంటే ఇబ్బంది అవుతోంది. నాకు వీలున్నంత త్వరగా పాస్ పుస్తకం ఇప్పించాలి.’ – మోహన్, మిర్జాపూర్ (ఎన్) గ్రామం, న్యాలకల్ మండలం, సంగారెడ్డి జిల్లా


