చిన్నారి రూపంలో అమ్మవారి లీల! | Interesting unknown facts about Edulabad Goda Ranganayaka Swamy Temple | Sakshi
Sakshi News home page

చిన్నారి రూపంలో అమ్మవారి లీల!

Mar 19 2026 12:43 PM | Updated on Mar 19 2026 1:41 PM

Interesting unknown facts about Edulabad Goda Ranganayaka Swamy Temple
  • ఆడపిల్లలంటేనే గాజులు, చెవి రింగులు, ముక్కెర, కాళ్ల పట్టీలు ఇష్టం
  • ఈ ఆసక్తి సాధారణులకే కాదు, దేవతలకూ ఉందని మీకు తెలుసా?
  • చిన్నపాప రూపంలో గాజులు వేసుకున్న ఆండాళ్ అమ్మవారు గాజుల విక్రేత వద్దే కొలువుదీరారు.
  • ముడుపు కడితే పెళ్లిళ్లు జరగాలని, పిల్లలు పుడతారని భక్తుల విశ్వాసం. 
  • అంతటి విశిష్ట గోదా సమేత మన్నారు రంగనాథ స్వామి ఆలయం హైదరాబాద్ శివార్లలోనే ఉంది
  • దాదాపు ఆరువందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని అప్పల దేశీకుడు అనే భక్తుడు కట్టించాడు
  • అప్పటినుంచీ ఆ వంశస్థులే ఈ గుడి బాధ్యతను తీసుకున్నారు

ఆడపిల్లలంటేనే గాజులు.. చెవి రింగులు, ముక్కెర, కాళ్ల పట్టీలు.. ఇలా వివిధ అలంకరణ వస్తువులను ఇష్టంగా ధరిస్తారు. ఈ ఆసక్తి సామాన్యులకే కాదు.. లోకాలనేలే అమ్మలగన్న అమ్మకు కూడా ఉంటుందని మీకు తెలుసా? అంతేకాదు.. స్వయంగా ఆండాల్ అమ్మవారు ఓ చిన్నపాప రూపంలో గాజుల విక్రేత వద్ద ఎంతో ఇష్టంగా గాజులు వేయించుకున్నారు. అంతేకాదు.. అక్కడే కొలువుదీరిన అమ్మవారికి పెళ్లిళ్లు జరగాలని, పిల్లలు పుట్టాలని ముడుపుకడితే.. ఇట్టే ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు విశ్వసిస్తారు. హైదరాబాద్ శివార్లలో ఉన్న గోదా సమేత మన్నారు రంగనాథ స్వామి ఆలయం విశేషాలు తెలుసుకోవాలంటే.. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి.. 

రంగనాథస్వామి ఆలయాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ... గోదాదేవి సమేతంగా ఉన్న ఆలయాలు చాలా అరుదు. అలాంటిదే తెలంగాణలోని ఘట్‌కేసర్ సమీపంలో ఏదులాబాద్‌లో ఉన్న గోదాదేవి సహిత రంగనాథస్వామి ఆలయం. దాదాపు ఆరువందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని అప్పల దేశీకుడు అనే భక్తుడు కట్టించాడనీ, అప్పటినుంచీ ఆ వంశస్థులే ఈ గుడి బాధ్యతను తీసుకున్నారనీ అంటారు. ఇక్కడ కోరిన కోర్కెలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడి స్వామివార్లను దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తరలి వస్తుంటారు. దీంతో శ్రీ గోదా రంగనాయక స్వామి ఆలయం నిత్యకళ్యాణం పచ్చతోరణంలా విరాజిల్లుతోంది.

హైదరాబాద్-వరంగల్ హైవేలో ఘట్‌కేసర్‌కు 5 కిలోమీటర్ల దూరంలోని ఎదులాబాద్‌లో శ్రీ గోదా రంగనాయక స్వామి కొలువై ఉన్నారు. ఈ దేవస్థానం ప్రాచీనమైనది. ఈ ఆలయానికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని పూర్వం రాయపురం అని పిలిచేవారు. ఆలయ స్థల పురాణం ప్రకారం.. శ్రీ వత్సస గోత్రీకులైన తిరువనంతపురం వాసి శ్రీనివాస దేశీకుడు.. ఈయన భార్య పేరు అలివేలమ్మ. ఈమె గర్భం దాల్చిన కొద్ది రోజులకే శ్రీనివాస దేశీకుడు మరణించారు. దీంతో అలివేలమ్మ శ్రీ వల్లిపుత్తూరుకు చెందిన తన తండ్రి గారి ఇంటికి చేరుకుంది. అక్కడే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలుడి పేరు అప్పల దేశీకుడు. పిల్లాడు ఎదుగుతున్న సమయంలో సోదరుల సహకారం లేకపోవడంతో.. అలివేలమ్మ తన కొడుకును తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అలా అప్పటి నిజాం రాజ్యమైన ప్రస్తుత తెలంగాణాలోని రాయపురం గ్రామానికి చేరుకుంది. అక్కడ రాయుడు పంతులు అనే రాజు ఆమెను ఆదరించి కావలసిన వసతులు కల్పించారు. అలా అలివేలమ్మ గ్రామంలోని ఏకాంగుల ఇంటిలో ఆశ్రయం పొందుతుంది.

అలివేలమ్మ కుమారుడైన అప్పల దేశీకుడు మంచి దైవ భక్తి కలవాడు. గ్రామంలోని వేణుగోపాల స్వామి సన్నిధికి ఎదురుగా ఓ చిన్న గుడిని నిర్మించుకుని అందులో ఆండాలు అమ్మవారిని ప్రతిష్ఠించి ధూప, దీప నైవేద్యాలతో, తిరు నక్షత్రాలను జరిపించేవాడు. కొన్ని రోజులకు తమ స్వగ్రామం వెళ్ళి అక్కడి నుంచి శ్రీ రంగమన్నార్, గోదా ఆండాళ్ విగ్రహాలను తెచ్చి ప్రతిష్టించాడు. ఐతే.. వేణుగోపాలస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ గుడి చిన్నదిగా ఉందని.. స్వామివారు కాళ్లు చాచుకోడానికి కూడా సరిపోవడం లేదని భావించి.. ఆ పక్కనే మరో ఆలయాన్ని నిర్మించి, విగ్రహాలను ప్రతిష్టించారని చెబుతారు. ఐతే అమ్మవారే స్వయంగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారనే కథ కూడా ప్రచారంలో ఉంది.

అమ్మవారు తిరిగిన అన్ని ప్రాంతాల్లో ప్రసాదం నిండుకునేది. కానీ ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రాంతంలో మాత్రం ప్రసాదం మిగులుతూ ఉండేది. దీంతో దీన్ని శుభ పరిణామంగా భావించి, తన నివాసానికి ఇదే అనువైన ప్రదేశంగా అమ్మవారు అప్పల దేశీకుడితో చెప్పినట్లు భక్తులు విశ్వసిస్తారు. పశ్చిమ దిక్కున ఉన్న గరుడాద్రి అనే స్థలంలో వెలసి ఉండాలని అనుకుంటున్నట్లు చెబుతారు. ఐతే ఆ ప్రాంతమంతా అడవి జంతువులు, విషసర్పాలతో నిండిపోయి ఉండడాన్ని చూసి అప్పల దేశీయుడు సంశయిస్తాడు. కానీ.. అమ్మవారు మాత్రం.. ముందు నువ్వెళ్లి పుష్కరిణిలో స్నానమాచరించి, సంధ్యావందనం చేసి రా..! అప్పటికి ఈ ప్రాంతమంతా మారిపోతుంది అని చెప్పారు. అలా అమ్మవారు చెప్పినట్లు సంధ్యావందనం చేసుకుని, తిరిగి వచ్చిన దేశీకుడు పూర్తిగా మారిపోయిన గరుడాద్రి ప్రాంతాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి సన్నిధిని నిర్మించాడు.

ఇక్కడ కొలువుదీరిన ఆండాల్ అమ్మవారికి గాజులంటే ఎంతో ఇష్టం. దీని వెనక ఓ కథ ఉంది. ఓ రోజు సాయంత్రం అమ్మవారు స్థానికంగా ఉన్న గాజుల వ్యాపారి వద్దకు ఓ చిన్నపిల్ల రూపంలో వెళ్లింది. తాను అప్పల దేశీకుడి కుమార్తెనని చెప్పుకొని, గాజులు వేయించుకుంది. తన తండ్రి వద్ద డబ్బులు తీసుకోవాలని చెప్పి.. అక్కడి నుంచి వచ్చేసింది. దాంతో మర్నాడు ఆ వ్యాపారి డబ్బుల కోసం అప్పల దేశీకుడి వద్దకు వెళ్లి, విషయం చెప్పారు. దానికి ఆశ్చర్యపోయిన అప్పల దేశీకుడు.. తనకు ఇంకా సంతాన భాగ్యం కలగలేదని చెప్పాడు. దాంతో ఆ వ్యాపారి ఆ చిన్నారి ఆనవాళ్లు చెప్పడంతో.. ఆలయంలోకి వెళ్లి.. అమ్మవారి వద్ద ఉన్న గాజులతో బయటకు వచ్చాడు. అవే గాజులా? అని అడగ్గా.. సదరు వ్యాపారి ఔనని సమాధానం చెప్పాడు. స్వయంగా అమ్మవారు చిన్నారి రూపంలో వచ్చి, గాజులు వేయించుకోవడంతో ఆ గాజుల వ్యాపారి జన్మ ధన్యమైందని దేశీకుడు ఉబ్బితబ్బిబైపోయాడు. అప్పటి నుంచి ఆండాల్ అమ్మవారికి గాజులమ్మ అని పేరు వచ్చింది. 
 

ఈ ఆలయంలో ఏటా నాగుల పంచమి రోజున అమ్మవారికి మట్టి గాజులను సమర్పించడం ఇక్కడ ఓ సంప్రదాయంగా కొనసాగుతోంది. ఆలయంలో రోజువారీ జరిగే పూజలు ఒకెత్తయితే.. నెలలో మొదటి ఆదివారం నిర్వహించే సుదర్శన హోమం మరో ఎత్తు. ఏటా ఇక్కడ శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి సప్తమి వరకు రంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను జరుపుతారు. ఈ ఉత్సవాలను చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటూ కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు చెందిన భక్తులు తరలివస్తారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి రోజు అధ్యయనోత్సవాలూ, నమ్మాల్వార్‌ పరమపద ఉత్సవాలు నిర్వహిస్తారు. మకర సంక్రాంతి రోజు గోదాదేవి కల్యాణం, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలూ నిర్వహిస్తారు. నేటికీ అప్పలా చార్యులవారి ఏడో తరం వారు ఈ ఆలయంలో అర్చకులుగా ఉన్నారు.

ఈ ఆలయంలో ఉత్సవాలకు ఎప్పుడూ ఏ లోటూ రాదట. ఉత్సవాలకి కావలసిన ధనం ఏదో ఒక రూపంలో సర్దుబాటవ్వడం వల్ల నిర్వఘ్నంగా సాగుతాయని భక్తులు చెబుతుంటారు. ఇదంతా అమ్మవారి సంకల్పంగా భావిస్తుంటారు. ధనుర్మాసంలో తప్పక సందర్శించవలసిన గొప్ప మహిమ గల ఆలయం ఇది. ఇక్కడ భక్తులు తాము కోరిన కోర్కెలు తప్పక నెరవేరతాయని భావిస్తారు. ముఖ్యంగా సంతానం కావాల్సిన వారు.. గ్రహదోషాలతో వివాహాలు జరగని వారు ఇక్కడ ముడుపు చెల్లిస్తే.. ఏడాది తిరిగేలోగా శుభవార్త వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మొక్కులు తీరినవారు విధిగా ఇక్కడకు వచ్చి, తమ ముడుపులను విప్పి.. అమ్మవారికి వడిబియ్యం పెడతారు.

ఇంకెందుకు ఆలస్యం.. ఉప్పల్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలనుకుంటున్నారా? ఉప్పల్ నుంచి ఇక్కడకు బస్సులు, ఆటోరిక్షాలు అందుబాటులో ఉన్నాయి. క్యాబ్‌లలో వెళ్లేవారు ఘట్‌కేసర్ వైపు నుంచి వెళ్లవచ్చు. ఒకవేళ.. హయాత్‌నగర్ పరిసరాల్లో ఉండేవారు.. దేశ్‌ముఖీ మీదుగా ఏదులాబాద్ చేరుకోవచ్చ.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement