godess
-
సమస్యలు విని.. పరిష్కారాలు చెబుతోంది!
కష్ట సమయాల్లో, ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు మనశ్శాంతి కోసం గుడికి వెళుతుంటారు. తమ కోరికలను దేవుడికి చెప్పుకొని మనసులోని భారాన్ని దించుకుంటారు. అదే ఆ దేవుడు నిజంగా మీ కోరికలు వింటే ఎంత బావుంటుంది.. అంతటితో ఆగకుండా సావధానంగా వాటికి పరిష్కారాలు అందిస్తే.. అసలు మీతోనే దేవుడు నేరుగా మాట్లాడితే.. ఇదంతా కలలోనే సాధ్యమని అనుకుంటున్నారా? ఇలలోనూ సాధ్యమే! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో మలేషియాలోని ఓ గుడిలో ఏఐ దేవత ‘మాజు’ను ఐమజిన్ అనే కంపెనీ తయారు చేసింది.దక్షిణ మలేషియా రాష్ట్రం జొహోర్లోని తియాన్హౌ అనే టావోయిస్ట్(చైనీస్ సంప్రదాయాలకు అనుగుణంగా ఉన్న గుడి) దేవాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ దేవత ‘మాజు’. ఇది అత్యంత గౌరవనీయమైన చైనీస్ సముద్ర దేవతను పోలి ఉన్న డిజిటల్ దేవత. ఇది భక్తులతో నేరుగా సంభాషిస్తుంది. వారి సమస్యలను సావధానంగా వింటోంది. వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది.ఇదీ చదవండి: రంగులు మార్చే చాట్‌జీపీటీ‘మాజు’ను అభివృద్ధి చేసిన మలేషియా టెక్ సంస్థ ఏఐ క్లోనింగ్ సేవలను అందించే మలేషియా టెక్నాలజీ కంపెనీ ఐమజిన్ ఈ డిజిటల్ దేవతను రూపొందించింది. ఏప్రిల్ 20న సముద్ర దేవత 1,065వ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ ఏఐ మాజును లాంచ్ చేశారు. మాండరిన్తోపాటు ఇతర కొన్ని భాషల్లో ఈ దేవత సంబాషించగలదని కంపెనీ తెలిపింది. ఒక ప్రదర్శన వీడియోలో కంపెనీ వ్యవస్థాపకుడు షిన్ కాంగ్ ఏఐ మాజును కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. ‘మాండరిన్లో పెన్ కాయ్ ఉన్ అనే ఊహించని అదృష్టం నన్ను వరిస్తుందా?’ అని అడిగినప్పుడు, మాజు ‘మీరు ఇంట్లోనే ఉంటే ఊహించని సంపద రూపంలో మీరు అదృష్టవంతులు అవుతారు’ అని సావధానంగా సమాధానం ఇచ్చింది. నిద్రించడానికి ఇబ్బంది పడుతున్న ఒక యాత్రికుడికి ఏఐ మాజు దేవత సలహా ఇచ్చింది. ‘నిద్రపోయే ముందు గోరువెచ్చని నీరు త్రాగడంతో మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు’ అని తెలిపింది. -
యూపీలో దేవతకు నాలుక సమర్పణ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో భక్తి పారవశ్యంలో మునిగిన ఓ భక్తుడు ఏకంగా నాలుక తెగ్గోసుకున్నాడు! కౌషాంబికి చెందిన 38 ఏళ్ల సంపత్.. మెహందీగంజ్లోని మాతా శీతలాదేవి మందిరానికి భార్యతో కలిసి వెళ్లాడు. ఆలయదర్శనానికి ముందు గంగానదిలో పుణ్యస్నానం చేశాడు. తర్వాత బ్లేడుతో తన నాలికను కత్తిరించుకుని ఆలయ ద్వారం వద్ద సమర్పించాడు. నాలుక తెగడంతో కొద్దిసేపటికే సంపత్ పరిస్థితి దారుణంగా తయారైంది. వెంటనే అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కరా ధామ్ పోలీస్‌స్టేషన్ స్టేషన్ ఆఫీసర్ అభిలాష్ తివారీ చెప్పారు. ఇంత పని చేస్తాడనుకోలేదంటూ భార్య వాపోతోంది. చదవండి: అదర్ పూనావాలా పేరిట రూ.కోటి టోపీ -
వైరస్ల పేరిట వెలసిన దేవతలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ఇప్పట్లో మానవాళిని వదిలిపెట్టి పోయేలా కనిపించడం లేదు. ఇలాంటి అంటురోగాలు వందేళ్లకోసారి అన్నట్లు మానవాళిపై అనాదిగా దాడిచేస్తూ వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు శాస్త్ర విజ్ఞానం అంతగా పరిఢవిల్లలేదు కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు అంటు రోగాలను దేవతలుగా కొలిచేవారు. ‘మమ్ము విడిచి పో పొమ్ము’ అంటూ వేడుకునే వారు. 1897లో ‘ప్లేగ్’ మహమ్మారి ప్రబలినప్పుడు బెంగళూరులో ‘ప్లేగ్ అమ్మ’ పేరిట పలు ఆలయాలు వెలిశాయి. ప్లేగ్‌ను కన్నడ భాషలో ‘పిడుగు’, ‘కాడు’ అని పిలిచేవారు. కోయంబత్తూర్‌లో ‘ప్లేగ్ మరియమ్మాన్’ పేరిట ఆలయాలు వెలిశాయి. తమిళ భాషలో మరి అంటే వర్షం అని అర్థం. వర్షాల రాకతో అంటురోగాలు ప్రబలేవి కనుక వర్షం సూచనతో మరియమ్మార్ అని పేరు పెట్టి ఉంటారు. ప్లేగ్‌ను తమిళంలో ‘వాతాగళ్, కొల్లాయ్ నాయి’ అని కూడా వ్యవహరించేవారు. 150 సంవత్సరాల క్రితం ప్లేగ్ వల్ల అప్పటికీ ఎప్పుడు లేనంతగ ప్రాణ నష్టం సంభవించింది. అంతకుముందు ఎక్కువ మందికి కామన్‌గా వచ్చేది ‘స్మాల్‌పాక్స్’. దీన్ని తెలుగులో తట్టు పోసింది, తల్లి చేసిందీ అనే వాళ్లు. రుగ్వేద కాలం నుంచి ఈ స్మాల్‌పాక్స్ ఉందని వ్యవసాయ శాస్త్రవేత్త వైఎల్ నేని తెలిపారు. రుగ్వేదంలో దీన్ని ‘శిపద’, శిమిద’గా పేర్కొన్నారట. శిమదను తీసుకొని పొమ్మంటూ నాడు ప్రజలు నదులకు పూజలు చేసేవారట. ఆప్టే సంస్కృత డిక్షనరీ ప్రకారం శిప అనే చర్మం అని అర్థం. చర్మంపై బొబ్బలు వచ్చే జబ్బునే తట్టు పోసింది అని అంటాం. నాడు దక్షిణాదిలో తట్టు తగ్గేందుకు ‘సితాల దేవి’ని పూజించేవారని చారిత్రక, పౌరానికి, తాంత్రిక పుస్తకాలు తెలియజేస్తున్నాయి. భావ మిశ్ర సంకలనం చేసిన ‘భావ ప్రకాష’ పుస్తకంలో ‘సితాల దేవి’ ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. అప్పట్లో భారత్‌లో అన్ని జబ్బులను ఆడ దేవతల పేరిటే వర్ణించేవారు, కొలిచేవారు. నాడు పిల్లల బాగోగులను కన్న తల్లులే చూసుకునేవారు కనుక, ఆడవాళ్లదే బాధ్యతగా భావించి ఆడ దేవతల పేర్లే పెట్టేవారేమో! 16వ శతాబ్దంలోనే ‘ది పాథాలోజీ ఆఫ్ సితాల’ అందుబాటులోకి వచ్చింది. అప్పుడు ఈ అంటురోగాలు రావొద్దంటూ ‘సీతాలష్టమీ’ జరిపేవారని రఘునందన్ భట్టాచార్య అనే బెంగాలీ రచయిత అందులో పేర్కొన్నారు. 1690లో, 1750, 1770 మధ్య సీతాలమ్మపై పలు కవిత్వాలు కూడా వచ్చాయి. ‘సీతాలమ్మ మంగళ్’ పేరిట నిత్యానంద చక్రవర్తి ఏకంగా స్త్రోత్రమే రాశారు. ఇక మహమ్మారి పదం హిందీ మాట్లాడే ప్రాంతాల నుంచి వచ్చింది. నేటి కరోనాను కూడా మమమ్మారిగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. -
సిరుల తల్లి రావమ్మా..
నేడు సిరిమానోత్సవం ఆద్యంతం ఆసక్తిగొలిపే ఊరేగింపు మూడు లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా విజయనగరానికి పండగ శోభ ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం భారీగా పోలీసు బందోబస్తు సాక్షి ప్రతినిధి, విజయనగరం : సిరిమానోత్సవం.. ఈ పేరు వింటే భక్తకోటి పరవశించిపోతుంది. అ అద్భుత ఘడియలను కనులారా వీక్షించేందుకు పరితపిస్తుంది. ఆద్యంతం ఆసక్తిగొలిపే సిరిమానోత్సవానికి ఏటేటా ఆదరణ పెరిగిపోతోంది. రెండున్నర శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం జరగనుంది. లక్షలాది భక్తజనం ఇప్పటికే విజయనగరం చేరుకుంది. ప్రతి ఇల్లు పండగ శోభతో కళకళలాడిపోతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. విజయనగరం వెలిగిపోతోంది. ఒకప్పుడు గ్రామదేవత.. ఇప్పుడామె అందరి దేవత. పైడితల్లి కీర్తి ఎల్లలు దాటింది. పసిడితల్లి కరుణాల కటాక్షాల కోసం ఎక్కడెక్కడివారో సిరిమాను పండగ నాటికి విజయనగరం చేరుకుంటారు. సిరిమాను రథం ఊరేగింపు ప్రారంభమయ్యేసరికి మూడు లాంతర్లు, రాజాబజారు, కోట కూడలికి చేరుకుంటారు. పూజారి రూపంలోని అమ్మవారిని దర్శించుకుని తరిస్తారు. సిరిమానోత్సవం విజయవంతమయ్యేందుకు అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే సిరిమానోత్సవంలో ప్రధాన పూజారి తాళ్లపూడి భాస్కరరావు 11వ సారి సిరిమానును అధిరోహించనున్నారు. రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా. అన్నీ రసవత్తర ఘట్టాలే భక్తులను విశేషంగా ఆకట్టుకునే సిరిమానోత్సవంలో అన్నీ రసవత్తర ఘట్టాలే. 55 అడుగుల పొడవున్న సిరిమాను ఉపరితలంలో బిగించే ఇరుసుపై ప్రధాన పూజారి విసనకర్ర చేతబట్టి ఆశీనులవుతారు. రెండో చివర రథంపై అమర్చిన ఇరుసును మానుకు అమరుస్తారు. దాని ఆధారంగానే మాను పైకి లేస్తుంది. గజపతిరాజ వంశీయుల తరపున ఒకరు తాడు లాగడంతో ప్రారంభమయ్యే సిరిమాను ఊరేగింపు మూడులాంతర్ల వద్ద గల పైడితల్లి అమ్మవారి గుడి వద్ద నుంచి రాజాబజారు మీదగా కోట వరకు మూడుసార్లు తిరుగుతుంది. ఊరేగింపు ఆద్యంతం విసనకర్ర విసురుతూ కనిపించే సిరిమాను పూజారిని భక్తులు అరటిపండ్లతో కొలుస్తారు. అత్యంత నియమనిష్టలతో.. అత్యంత నియమనిష్టలు, ఉపవాసంతో ఉండే సిరిమాను పూజారి తాళ్లపూడి భాస్కరరావు హుకుంపేటలో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరుతారు. కాలినడకన వేలాది మంది భక్తుల సందడితో ఊరేగింపుగా వస్తారు. దారి పొడవునా ప్రజలు పూజారి పాదాలపై పసుపు నీళ్లు పోసి దీవెనలు అందుకుంటారు. చంటి పిల్లలపైనుంచి పూజారి దాటితే వారికి మేలు జరుగుతుందన్న నమ్మకంతో చాలామంది ఆయనొచ్చే దారిలో వారిని నేలపై ఉంచుతారు. పూజారి చేరుకున్నాకే సిరిమానోత్సవం ప్రారంభమవుతోంది. 258 సంవత్సరాల చరిత్ర గల సిరిమాను చదురు గుడి నుంచి మహారాజ కోట వరకు మూడు పర్యాయాలు తిరిగి భక్తులను ఆశీర్వదించనుంది. సిరిమాను ముందుండే బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథాలు ఆకర్షణగా నిలుస్తాయి. బెస్తవారి వల రెండున్నర శతాబ్ధాలకు మునుపు అమ్మ తల్లి పెద్ద చెరువు గర్భంలో నిక్షిప్తమైనప్పుడు కలలో అమ్మవారు చెప్పిన సమాచారం ప్రకారం పైడితల్లి మూల విరాట్‌ను చెరువు నుంచి వెలికితీయడంలో విజయనగరం యాతవీధికి చెందిన జాలర్లు సహకరించారు. అమ్మ సాక్షాత్కారానికి ఆదిలోనే పాత్రులైన ఆ బెస్తలే కీలకంగా వ్యవహరించారు. నాటి నుంచి ఏటా ఈ వలను యాతవీధి జాలర్లు తయారు చేస్తుంటారు. చేపల వేటకెళ్లేటప్పుడు వాడే ప్రతి వస్తువును వల కింద భాగంలో ధరించి ఉత్సవంలో పాల్గొంటారు. వీరంతా ఒంటికి పసుపు రాసుకుని, వేప కొమ్మలు, జాలరి వస్తువులను చేతబట్టి సంబరంలో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. పాలధార సిరిమాను సంబరం ప్రారంభానికి ముందు పాలధార ఆలయానికి రావడం అనాదిగా వస్తున్న ఆచారం. జాలరి వలను వెన్నంటి ఈటెలు చేతపట్టి వచ్చే ఈ జనం మహా శక్తి స్వరూపాలుగా భావిస్తారు. పాలధారగా పిలిచే ఈ జనధార అమ్మవారి సైనిక శక్తికి వారసులంటారు. తొలుత కొందరు ఈటెలను ధరించి అమ్మవారి ఆలయానికి వస్తారు. అక్కడ పైడిమాంబను దర్శించుకున్న అనంతరం డప్పు వాయిద్యాలతో కోట వద్దకు చేరుకుంటారు. అక్కడ పూజలు చేసిన అనంతరం కోట పశ్చిమ భాగం వైపు వెళ్లి, కోట శక్తికి నమస్కరిస్తారు. సైనికులుగా పనిచేసే వీరంతా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్న భావనతో గ్రామ కట్టడిని చేస్తారు. ఈ ఘట్టంలో సాకేటి వీధికి చెందిన డోకుల ఎరుకయ్య, మండల కామేష్, అలుగోలు బంగారయ్య, రామవరపు సూర్యనారాయణ కుటుంబసభ్యులు పాల్గొంటారు. అంజలి రథం సిరిమాను జాతరలో అంజలి రథానిది విలక్షణమైన స్థానం. సిరిమానుకు అంజలి ఘటిస్తూ ముందుకు సాగుతుంది కాబట్టి దీనిని అంజలి రథమని పిలుస్తారు. అంజలి అంటే నమస్కారం. పైడిమాంబను నమస్కరిస్తూ అంజలి రథంపై ఉన్న నడిపేన, కోరాడ కుటుంబాల వారు ముందుకు సాగుతారు. నాటు బండిపై రోలును బిగించి, దానికి అటు ఇటు రాటలను కడతారు. దానిపై ఐదుగురు పురుషులు మహిళల వేషధారణలో కూర్చుంటారు. వీరంతా ఆరుమూరల నార చీరను, చేతికి వెండి సందెలను ధరిస్తారు. సంబరం ప్రారంభానికి ముందు ఊరేగింపుగా చదురుగుడి వద్దకు వస్తారు. వీరంతా అమ్మవారి పరిచారికలుగా వ్యవహరిస్తారు. సంబరం జరుగుతున్నంతసేపూ భక్తులపై అక్షింతలు విసురుతుంటారు. ప్రతిగా భక్తులు భక్తిభావంతో అరటి పండ్లను వారిపై విసురుతుంటారు. తెల్ల ఏనుగు పైడితల్లమ్మ సిరిమాను సంబరంలో తెల్ల ఏనుగుకు విశిష్ట స్థానం ఉంది. పూసపాటి గజపతులు ముస్తాబు చేసిన అంబారీ ఏనుగుపై కూర్చుని సంబరంలో పాల్గొనేవారు. సిరిమానుకు ముందు పట్టపుటేనుగు నడిచేది. రాచరికం అంతరించి, ప్రజాస్వామ్యం వచ్చాక పట్టపుటేనుగునకు గుర్తుగా 1956 నుంచి ఏనుగు ఆకారంలో ఒక బండిని ప్రదర్శిస్తున్నారు. ఈ ఏనుగుపై ఒక పురుషుడు, ఏడుగురు పురుషులు స్త్రీ వేషాలను ధరించి కూర్చొంటారు. స్త్రీలంతా పైడితల్లమ్మకు అక్కాచెల్లైల్లైన గ్రామ దేవతలుగా, మగవేషంలో ఉన్న వ్యక్తి అమ్మవారి సోదరుడు పోతురాజుగా భావిస్తారు. వెదురుతో తయారైన ఈ ఏనుగుపై భోగాపురం, పెద్దింటి తదితర కుటుంబాల సభ్యులు కూర్చుంటారు. -
తీరానికి కొట్టుకొచ్చిన పంచలోహ విగ్రహం
సీతాదేవి విగ్రహంగా అనుమానం స్వాధీనం చేసుకున్న పోలీస్‌లు గాదెలదిన్నె (విడవలూరు) : మండలంలోని రామతీర్థం సముద్ర తీరానికి అమ్మవారి పంచలోహ విగ్రహం కొట్టుకొచ్చిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. మండలంలోని గాదెలదిన్నెకు చెందిన వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు మరో ఇద్దరు స్నేహితులు ఆదివారం సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ ఈత కొడుతున్న సమయంలో వారికి గట్టున తెల్లని వస్తువు కనిపించింది. దాన్ని చూసి విగ్రహంగా భావించి గ్రామానికి తీసుకువచ్చి పెద్దలకు తెలియజేశారు. అది పంచలోహ విగ్రహంగా భావిస్తున్నారు. విగ్రహంపై ప్రతిమ సరిగా కనిపించడం లేదు. సీతాదేవిగా విగ్రహంగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని విడవలూరు పోలీసుల దష్టికి తీసుకెళ్లడంతో ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.