మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక మహిళా వైద్యురాలి ఆత్మహత్య కలకలం రేపింది. గురువారం రాత్రి ఒక హోటల్ గదిలో మృతి చెంది కనిపించడం రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ ఆత్మహత్య వెలుగులోకి రావడంతో శుక్రవారం నిందితుడైన పోలీసును సస్పెండ్ చేశారు.
అరచేతిలో సూసైడ్ నోట్
అయితే ఆత్మహత్యకు ముందు బాధితురాలు తన అరచేతిలో రాసిన ఒక సూసైడ్ నోట్ సంచలనంగా మారింది. దీని ప్రకారం ఇద్దరు పోలీసు అధికారులు ఐదు నెలల పాటు ఆమెపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. SI గోపాల్ బద్నే తనను మానసికంగా ,శారీరకంగా హింసించాడని వైద్యురాలు ఆరోపించింది. వారి వేధింపులే తన ఆత్మహత్యకు దారి తీసిందని కూడా పేర్కొంది. గోపాల్ దన్నే తనపై ఐదు నెలల్లో తనపై నాలుగు సార్లు అత్యాచారం చేశాడని, తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పేర్కొంది. పోలీసు అధికారి ప్రశాంత్ బంకర్ కూడా తనను మానసికంగా వేధించాడని ఆరోపించింది.
అలాగే బాధితురాలు జూన్ 19న ఫల్తాన్ సబ్-డివిజనల్ ఆఫీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)కి రాసిన లేఖలో ఇలాంటి ఆరోపణలే లేవనెత్తినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే వైద్యురాలి ఆత్మహత్య అంటూ రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు విజయ నామ్‌దేవ్‌రావ్ వాడేట్టివార్ వైద్యురాలి ఆత్మహత్య లేఖపై పాలక మహాయుతి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రక్షకులే మహిళల పాలిట భక్షకులుగా మారుతోంటే , ఇక వారికి రక్షణ ఏది అని ప్రశ్నించారు. నిందితులను ఉద్యోగాల నుండి తొలగించాలి, లేకుంటే, వారు దర్యాప్తుపై ఒత్తిడి తీసుకురావచ్చన్నారు. అసలు ఆమె మునుపటి ఫిర్యాదును ఎందుకు తీవ్రంగా పరిగణించలేదని మండిపడ్డారు. నిందితులను ప్రభుత్వం కాపాడుతోందంటూ ట్వీట్ చేశారు. శివసేనతో పాటు పాలక కూటమిలో భాగమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కూడా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. మహాయుతి ప్రభుత్వం పదే పదే పోలీసులను కాపాడుతోందనీ, ఇది పోలీసు దురాగతాలు పెరగడానికి దారితీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలక మహాయుతిలో భాగమైన భారతీయ జనతా పార్టీ (బిజెపి), వైద్యుడి ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తుకు హామీ ఇచ్చింది. మహిళలపై జరిగే దురాగతాలపై కఠిన చర్యలు తీసుకోవాలని NCP నాయకుడు ఆనంద్ పరంజపే అన్నారు.ఈ సంఘటన దురదృష్టకరమని, నిందుతులను అరెస్ట్ చేస్తామని బీజేపీ శాసన మండలి సభ్యురాలు , రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చిత్రా వాఘ్ హామీ ఇచ్చారు. ఇలాంటి ఫిర్యాదులను 112 హెల్ప్‌లైన్ ద్వారా నమోదు చేయాలని, తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆమె సూచించారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర రాష్ట్ర మహిళా కమిషన్ కూడా స్పందించింది మృతురాలు గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై ఎందుకు చర్యలు చేపట్టలేదనే అంశాన్ని దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశాల మేరకు బద్నేను సస్పెండ్ చేసినట్లు వర్గాలు తెలిపాయి. మరోవైపు మృతురాలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించిన పోలీసులు ఆమె అరచేతిలో రాసిన సూసైడ్ నోట్‌పై ఫోరెన్సిక్ విశ్లేషణకోసం పంపించారు.


