
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాసాయి విరార్‌లో మంగళవారం-బుధవారం మధ్య రాత్రి నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరింది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్న అధికారులు.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఐఏఎన్‌ఎస్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 12.05 గంటల సమయంలో విజయ్ నగర్‌లోని రమాబాయి అపార్ట్‌మెంట్‌లో వెనక భాగం కూలిపోయింది. దానిలో కొంత భాగం పక్కనే ఉన్న ఖాళీ భవనంపై పడింది. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, మున్సిపల్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంతా గాఢనిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మొత్తం 50 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిలో కూలిపోయిన భాగంలో 12 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అయితే కూలిన భవనం అక్రమ కట్టడమని విచారణలో తేలింది. దీంతో.. వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ (వీవీఎంసీ) ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు భవన నిర్మాణదారుడు నిటల్ గోపినాథ్‌ను అరెస్టు చేశారు. ల్యాండ్ ఓనర్ మీద కూడా కేసు నమోదైనట్లు సమాచారం.

ఏడాది పుట్టినరోజు వేడుక చేసుకున్న నాడే..
ఘటనలో ఆరోహి జోయెల్(24), ఆమె ఏడాది చిన్నారి కన్నుమూశారు. భర్త ఓంకార్ జోయల్ జాడ ఇంకా తెలియరాలేదు. చిన్నారి ఏడాది పుట్టినరోజు కేక్ కట్టింగ్ వేడుక జరిపిన కొన్నిగంటలకే.. అదీ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసిన ఐదు నిమిషాలకే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శిథిలాల కింద ఆ తల్లీకూతుళ్లు విగతజీవులయ్యారు.