వికారాబాద్ జిల్లా: కోపోద్రిక్తుడైన భర్త.. భార్యను హత్య చేశాడు. ఈ సంఘటన పెద్దేముల్ తండాలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మూడవత్ రవి, అనిత(35) దంపతులు. వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. కొంత కాలంగా రవి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో సదరు వ్యక్తి ఆవేశంతో ఆమెపై దాడి చేశాడు. తల, ముఖంపై పారతో కొట్టి హతమార్చాడు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి, ఎస్‌ఐ శంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వికారాబాద్ క్లూస్‌టీం ద్వారా వివరాలు సేకరించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. మృతురాలి సోదరుడు కేతావత్ కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనితకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు.


