నగరంలోని ఓ కార్పొరేట్ పాఠశాల నుంచి 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షకు సుమారు 130 మంది విద్యార్థులు హాజరయ్యారు. స్కూల్ స్థాయిలో వీరందరికీ ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్ మార్కులు 20/20 పడిపోయాయి. ఇది ఎలాగంటే.. ఏకంగా ఓ డిప్యూటీ విద్యాధికారి చేతివాటం ప్రదర్శించి ఇంటర్నల్ వెరిఫికేషన్ కమిటీ ధ్రువీకరించిన మార్కుల జాబితానే మార్చేశారనే ఆరోపణలున్నాయి. ఇంటర్నల్ మార్కుల వ్యవహారంలో ఇలాంటి అక్రమాలు ఈ ఒక్క పాఠశాలకే పరిమితం కాదు. మెజారిటీ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాల తీరు ఇలాగే ఉందనే విమర్శలున్నాయి. వెరిఫికేషŒన్ కమిటీ సభ్యులతో ‘మిలాఖత్’ కుదరని పక్షంలో నేరుగా పై స్థాయి విద్యాధికారులతో ‘సెటిల్‌మెంట్’ చేసుకోవడం షరామామూలుగా మారింది. ఇంత జరుగుతున్నా విద్యా శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవరిస్తోందనే ఆరోపణలూ లేకపోలేదు.
సాక్షి,హైదరాబాద్: పదో తరగతి ఇంటర్నల్ మార్కుల వెరిఫికేషన్ ప్రక్రియ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఎప్పటి మాదిరిగానే కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఇంటర్నల్ మార్కుల కోసం విద్యార్థుల నుంచి వసూళ్లకు తెరలేపాయి. విద్యాధికారులతో ‘డీల్’ కుదుర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్ర రాజధాని నగరంలోనే ఎస్సెస్సీ ‘ఇంటర్నల్ అసెస్‌మెంట్’ మార్కుల అక్రమ తంతు గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా పడాల్సిన వాస్తవిక మార్కులకు బదులు ‘నజరానా’ అనుగుణంగా 95 నుంచి 100 శాతం వరకు ఇంటర్నల్ మార్కులు ఇవ్వడం సాధారణంగా మారింది. కొన్ని ప్రైవేట్, కార్పొర్పేట్ విద్యాసంస్ధలు ఉత్తీర్ణతలో గ్రేడింగ్’ కోసం చేసే ప్రయత్నం చేయూత అందించే విద్యాధికారులకు కాసులు కురిపిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి కనీసం రూ.1000, రూ.2 వేల వరకు వస్తూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఒక్కో పాఠశాల నుంచి టెన్త్ విద్యార్థుల సంఖ్యను బట్టి కనీసం రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ‘డీల్ సెటిల్‌మెంట్’’ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
20 ఇంటర్నల్ మార్కులు ఎలా అంటే..
బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం పదో తరగతి పరీక్షల్లో 80 శాతం ఎక్స్‌టర్నల్ (రాత పరీక్ష), 20 శాతం ఇంటర్నల్ (స్కూల్ స్థాయి అంతర్గత మూల్యాంకనం) మార్కులు ఉంటాయి. విద్యార్థులు ఎఫ్‌ఏలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా ప్రతి సబ్జెక్టులో 20 మార్కులు ఇంటర్నల్ (4 ఎఫ్‌ఏలకు 5 మార్కుల చొప్పున) ఉంటే.. విద్యార్థి సామర్థ్యం కనీసం 7 నుంచి 20 మార్కుల వరకు వేయొచ్చు. స్కూల్ స్థాయిలో వేసిన మార్కులపై గెజిటెడ్ హెడ్‌మాస్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో బృందం తనిఖీలు నిర్వహించి నిర్ధారిస్తుంది. ఒక్కో బృందంలో ఓ గెజిటెడ్ హెడ్‌మాస్టర్, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజీ పండిట్ ఉంటారు ఆయా పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ అసెస్‌మెంట్ పరీక్షలు పక్కాగా నిర్వహించారా? మార్కుల నమోదు ప్రతిభ ఆధారంగా జరిగిందా? లేదా? ఫార్మాట్ టెస్టులతోపాటు ప్రాజెక్టులు, రికార్డులను పరిశీలిస్తుంది. తుది మార్కుల నిర్ధారణ ఆమోదంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మార్కుల జాబితాను ఎస్సెస్సీ బోర్డుకు పంపిస్తారు.
20కి 20
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల నాణ్యత ప్రమాణాల మేరకే కచ్చితంగా నిబంధనల మేరకు మార్కులు వేస్తున్నా.. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో మాత్రం 20/20 మార్కులు వేయడం సర్వసాధారణమైంది. విద్యార్థుల పర్ఫార్మెన్స్ సరిగా లేకపోయినా.. ఎక్కువ మార్కులు వేస్తున్నా.. తనిఖీ బృందాలు తమకు కుదిరిన ఆమ్యామ్యాల ఒప్పందాలతో చూసీ చూడనట్లుగా వ్యవహారిస్తున్నాయన ఆరోపణలు లేకపోలేదు. వాస్తవంగా పదో తరగతి విద్యార్థుల నైపుణ్యాల మేరకు అసెస్‌మెంట్, ప్రాజెక్టుల్లో మార్కుల నమోదు ఉంటేనే కమిటీలు ఫార్వర్డ్ చేయాలి. లేనిపక్షంలో వారికి ఏ స్థాయిలో మార్కులు ఉండాలో సూచించి నివేదికలను జిల్లా విద్యాశాఖకు అందజేస్తాయి.
ఆ తర్వాత కమిటీ నిర్ధారించిన మార్కులనే పాఠశాలలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా ఈ ప్రక్రియ ఆమ్యామాల పర్వంగా మారిందనే ఆరోపణలు వినపస్తున్నాయి. ప్రతి విద్యా సంవత్సరం ఈ చేతివాటంపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా, ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం లేకుండా పోయాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం స్పందించి పాత తప్పిదాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటే .. ఈ సారైనా టెన్త్ ఇంటర్నల్ మార్కుల కేటాయింపులో చేతివాటం పునరావృతం కాకుండా.. ప్రతిభకు పెద్దపీట వేస్తే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.


