యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆధ్యాత్మిక వాడలో అధునాత హంగులతో వేగేశ్న ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన శ్రీ శాంతా రుష్య శృంగ అన్నప్రసాద కేంద్రాన్ని ఈఓ వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తితో కలిసి ఆదివారం వేగేశ్న ఫౌండేషన్ నిర్వాహకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేగేశ్న ఫౌండేషన్ అధినేత అనంతకోటి రాజు మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాలుగా ఆయా ఆలయాలకు వచ్చే భక్తులకు తమ ఫౌండేషన్ ద్వారా అన్నప్రసాదం అందజేస్తున్నామని తెలిపారు.
గతంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం, ద్వారకా తిరుమలలో అన్నప్రసాద కేంద్రాలను ప్రారంభించామని, ఇప్పుడు యాదగిరిగుట్ట ఆలయంలో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన గత, ప్రస్తుత ప్రభుత్వంతో పాటు ఆలయ అధికారులు పూర్తిగా సహకరించారన్నారు. అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి మాట్లాడుతూ.. 5 ఏళ్ల క్రితం వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన అన్నప్రసాద కేంద్రాన్ని రూ.21కోట్లతో అద్భుతంగా నిర్మించినట్లు పేర్కొన్నారు. మొదటి రోజు అన్నప్రసాద కేంద్రంలో పులిహోర, సిర, చిన్న లడ్డూ, మిర్చి, పన్నీరు కూర్మ, ఆలు కర్రీ, పెరుగు, పప్పుచారు, టమాట పచ్చడి, పాపడం భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేగేశ్న ఫౌండేషన్ నిర్వాహకులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



