డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన 431 మంది మందుబాబులు
సాక్షి, హైదరాబాద్: మందుబాబులు మారడంలేదు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. వీరికి చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మార్పు రావడం లేదు. నవంబర్ 24 నుంచి 29 వరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కమిషనరేట్ పరిధిలో పలు ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనం నడుపుతూ 431 మంది పట్టుబడ్డారు.
వీరందరిపై కేసులు నమోదు చేశారు. 325 మంది ద్విచక్ర వాహనదారులు, 16 మంది ఆటోలు, 86 మంది కార్లు, నలుగురు భారీ వాహనాలు నడుపుతూ దొరికిపోయారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీ గ్రాముల ఆల్కహాల్ ఉంటే అది ఉల్లంఘన. దీన్ని సాంకేతికంగా బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) అంటారు. 378 మందికి 35–200 మధ్య, 42 మందికి 200–300 మధ్య, 11 మందికి 300–500 మధ్య బీఏసీ కౌంట్ వచి్చందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.


