సినీ పైరసీ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన నిందితుడు, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరగనుంది.
ఐబొమ్మ, బప్పం పేరుతో వెబ్‌సైట్లు నడిపిస్తూ సినీ పైరసీకి పాల్పడ్డాడంటూ ఇమ్మడి (ఐబొమ్మ) రవిపై ప్రధాన అభియోగం ఉంది. సైబర్ నేరాల నేపథ్యంలో మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అయితే రవికి బెయిల్ కోరుతూ సీనియర్ లాయర్ సీవీ శ్రీనాథ్ కోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటికే సీసీఎస్ పోలీసులు కస్టడీ కోరడంతో బెయిల్ విచారణ వాయిదా పడింది.
ఈగ్యాప్‌లో.. రెండు విడతలుగా ఎనిమిది రోజులపాటు రవిని పోలీసులు ప్రశ్నించారు. విచారణలో అతని నుంచి కీలక సమాచారం రాబట్టడంతో పాటు ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలనూ సేకరించినట్లు తెలుస్తోంది. అయితే రవి లాయర్ మాత్రం బెయిల్ కచ్చితంగా వస్తుందని అంటున్నారు.
రవి బెయిల్ అభ్యర్థనకు ఇప్పటికే పోలీసులు నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేయడంతో.. బెయిలా? జైలా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ బెయిల్ రిజెక్ట్ అయితే గనుక అదనపు విచారణ కోసం పోలీసులు మరోసారి కోర్టులో పిటిషన్ వేసే అవకాశమూ లేకపోలేదు. మరోవైపు.. అతనిపై నమోదు అయిన మరో మూడు కేసుల్లో రేపటిలోగా కోర్టు ముందు హాజరు పరచాల్సి ఉంది. దీంతో ఇవాళే రవిని హాజరు పర్చవచ్చని తెలుస్తోంది.
ఇదీ చదవండి: విశాఖలో బొమ్మ.. అందుకే ఆ పేరు పెట్టా!


