breaking news
Piracy case
-
ఐబొమ్మ కేసు.. ఇమ్మడి రవికి బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవికి బిగ్ షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి క్రిమినల్ కోర్టు గురువారం తిరస్కరించింది. పోలీస్ కస్టడీ కారణంగా రవి బెయిల్ పిటిషన్ విచారణ ఆలస్యమవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈలోపు.. మూడో దఫా కస్టడీ విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి అప్పీల్‌కు వెళ్లడంతో ఆ విచారణ మరింత ఆలస్యం కావొచ్చని రవి ఆందోళన చెందాడు. అయితే.. ఆ అప్పీల్‌ను విచారిస్తూనే ఇటు రవి బెయిల్ పిటిషన్‌నూ కోర్టు పరిశీలించింది. చివరకు కేసుల తీవ్రత దృష్ట్యా రవి బెయిల్‌కు అనర్హుడని తేల్చేసింది. అదే సమయంలో.. కస్టడీపై రివిజన్ విచారణ చేపట్టిన కోర్టు రేపు తీర్పు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ వైజాగ్‌వాసి అయిన ఇమ్మడి రవి.. ఐబొమ్మ, బప్పం అనే వెబ్సైట్లతో సినీ పైరసీకి పాల్పడ్డాడు. ఇటు పైరసీతో పాటు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి కోట్లకు పడగలెత్తాడు. ఇందుకు కరేబియన్ దీవులను ఎంచుకుని అక్కడి నుంచి సర్వర్లు, థర్డ్ పార్టీ ద్వారా వ్యవహారం నడిపించాడు. మూడు విడతలుగా 8 రోజులపాటు జరిపిన విచారణలో రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్నే రాబట్టారు. సినిమాను బొమ్మగా పిలుస్తారు కాబట్టే ఐబొమ్మ అని పేరు పెట్టానని.. బలపం కాస్త బప్పం అయ్యిందని.. ఇలా ఆసక్తికర సంగతులను వెల్లడించాడు. అలాగే.. స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఓటీటీ కంటెంట్‌ను సైతం పైరసీ చేయగలిగానని తెలిపాడు. కస్టడీ విచారణలో సైబర్ పోలీసులకే రవి అత్యాధునిక టెక్నాలజీ పాఠాలను నేర్పించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. అయితే కీలకమైన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో రవి నుంచి సమాచారం రాబట్టాల్సి ఉంది. అందుకే పోలీసులు కస్టడీని ఎక్కువ రోజుల కోరుతున్నారు. సీసీఎస్ పోలీసుల కస్టడీ అప్పీల్ గనుక రిజెక్ట్ అయితే మూడు కేసులకుగానూ(ఒక కేసులో కస్టడీని కోర్టు కొట్టేసింది) మూడు రోజులపాటే రవిని పోలీసుల విచారించాల్సి ఉంటుంది. -
iBomma Case: ఇమ్మడి రవికి ఊరట దక్కేనా?
సినీ పైరసీ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన నిందితుడు, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరగనుంది.ఐబొమ్మ, బప్పం పేరుతో వెబ్సైట్లు నడిపిస్తూ సినీ పైరసీకి పాల్పడ్డాడంటూ ఇమ్మడి (ఐబొమ్మ) రవిపై ప్రధాన అభియోగం ఉంది. సైబర్ నేరాల నేపథ్యంలో మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అయితే రవికి బెయిల్ కోరుతూ సీనియర్ లాయర్ సీవీ శ్రీనాథ్ కోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటికే సీసీఎస్ పోలీసులు కస్టడీ కోరడంతో బెయిల్ విచారణ వాయిదా పడింది.ఈగ్యాప్‌లో.. రెండు విడతలుగా ఎనిమిది రోజులపాటు రవిని పోలీసులు ప్రశ్నించారు. విచారణలో అతని నుంచి కీలక సమాచారం రాబట్టడంతో పాటు ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలనూ సేకరించినట్లు తెలుస్తోంది. అయితే రవి లాయర్ మాత్రం బెయిల్ కచ్చితంగా వస్తుందని అంటున్నారు.రవి బెయిల్ అభ్యర్థనకు ఇప్పటికే పోలీసులు నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేయడంతో.. బెయిలా? జైలా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ బెయిల్ రిజెక్ట్ అయితే గనుక అదనపు విచారణ కోసం పోలీసులు మరోసారి కోర్టులో పిటిషన్ వేసే అవకాశమూ లేకపోలేదు. మరోవైపు.. అతనిపై నమోదు అయిన మరో మూడు కేసుల్లో రేపటిలోగా కోర్టు ముందు హాజరు పరచాల్సి ఉంది. దీంతో ఇవాళే రవిని హాజరు పర్చవచ్చని తెలుస్తోంది.ఇదీ చదవండి: విశాఖలో బొమ్మ.. అందుకే ఆ పేరు పెట్టా! -
ఐ బొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్ మెయిల్స్ లో కీలక ఆధారాలు
-
అందుకే ఐబొమ్మ అని పేరు పెట్టా: ఇమ్మడి రవి
సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో ఇమ్మడి రవి రెండవ విడత పోలీసు కస్టడీ ముగిసింది. మూడు రోజులపాటు జరిగిన నిందితుడి మెయిల్స్ నుంచి కీలక సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లలో మొత్తం 21 వేల సినిమాలు అప్లోడ్ అయినట్లు గుర్తించారు. అంతేకాదు.. ఫైరసీకి సంబంధించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి రవి సైబర్ పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో రవి తెలిపిన వివరాలు.. విశాఖలో సినిమాను బొమ్మ అనేవాళ్లం. ఐ బొమ్మ అంటే ఇంటర్నెట్ బొమ్మ. ఇంటర్నెట్లో బొమ్మ చూపిస్తున్నాం కదా.. అందుకే అలా పేరు పెట్టా. అలాగే మరో వెబ్సైట్ బప్పంగా మొదట అనుకున్న పేరు అది కాదు. బలపం అని పేరు పెడదామని అనుకున్నాం. కానీ, డొమైన్ నేమ్‌లో ఎల్(L) అనే అక్షరంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి. అందుకే బప్పం అని పెట్టాల్సి వచ్చింది. పైరసీ వెబ్‌సైట్స్ నుంచే సినిమాలు రికార్డు చేశాం. ఓటీటీల్లో వచ్చే కంటెంట్‌ను సైతం రికార్డింగ్ చేయగలిగాం. అలా రికార్డింగ్ చేసిన సినిమా ఆడియో.. వీడియో క్వాలిటీ పెంచేందుకు కరేబియన్ దీవుల్లో ఔట్ సోర్సింగ్ వాళ్లతో ఒప్పందం చేసుకున్నాం. అలాగే తాను అప్లోడ్ చేసిన సినిమాలను టెలిగ్రామ్ చానెల్స్ నుంచి సేకరించినవే అని రవి ఒప్పుకున్నాడు.ఇక.. రవి మెయిల్స్‌లో స్పామ్, హైడ్ ఫైల్స్‌లోనే డాటా మొత్తం దాటి ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. అలాగే ప్రహ్లద్ అనే వ్యక్తి గురించి వివరాలు సేకరించారు. తాము ఎన్జిల ఆన్లైన్ ద్వారానే కనెక్ట్ అయ్యామని రవి తెలిపాడు. అయితే ఆ లింకును సైబర్ క్రైమ్ పోలీసులకు చూపించగా అంతలోపే లింక్ రివోక్ అయ్యాయి. దీంతో వాటిని సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. రెండో విడత కస్టడీ మొదటిరోజు విచారణలో.. ఎన్జీల నెట్వర్క్, ఆర్థిక వ్యవహారాలపై కీలక లీడ్‌ను పోలీసులు సంపాదించారు. ఐపీ మాస్క్ చేసి అనధికారిక వెబ్ సైట్స్ నిర్వహిస్తున్నా ముఠాలపై ఆరా తీశారు. రెండో రోజు విచారణలో మాత్రం రవి సరిగ్గా నోరు విప్పలేదు. పైగా.. బయటకు రాగానే మంచి పనులు చేస్తానంటూ పోలీసులతో అన్నట్లు సమాచారం. మొత్తంగా.. మూడు రోజులపాటు సాగిన రెండో విడత కస్టడీ నేటితో పూర్తైంది. దీంతో రవిని నాంపల్లి కోర్టుకు హాజరుపరిచి.. అక్కడి నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోసారి కస్టడీ కోరతారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. సినీ పైరసీ కేసులో ఐపీ మాస్క్ లింక్స్ పై త్వరలోనే పోలీసులు కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. -
నాంపల్లి కోర్టుకు ఐబొమ్మ రవి
-
సి.కళ్యాణ్‌ని ఎన్కౌంటర్ చేస్తే బాధ తెలుస్తుంది: ఐబొమ్మ రవి తండ్రి
'ఐ బొమ్మ' రవి అరెస్ట్.. గత కొన్నిరోజుల నుంచి ఈ టాపిక్కే తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది. రవి చేసింది అక్షరాలా తప్పే కానీ జనాలు అతడికే మద్ధతు తెలుపుతుండటం ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సినిమా వాళ్లకు సపోర్ట్‌గా ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. దీనికి కారణాలు ఏంటనేది పక్కనబెడితే నిర్మాత సి.కల్యాణ్ అయితే ఏకంగా రవిని ఎన్కౌంటర్ చేసేయాలని నాలుగైదు రోజుల క్రితం షాకింగ్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: ప్రకటించిన నాలుగేళ్లకు ప్రభాస్ 'స్పిరిట్' లాంచ్)నిర్మాత కల్యాణ్ చేసిన 'ఎన్కౌంటర్' వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి గట్టిగానే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఐ బొమ్మ రవి తండ్రి అప్పారావు కూడా కల్యాణ్ చేసి కామెంట్స్‌ని తప్పుబట్టారు. 'సి.కళ్యాణ్‌ని గానీ, ఆయన కొడుకుని గానీ ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. సినిమాలో విషయం ఉంటే జనం కచ్చితంగా చూస్తారు. నేను 45 పైసలతో సినిమా చూశా. ఇప్పుడు దారుణంగా రేట్లు పెరిగాయి. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు ఎవరు తీయమంటున్నారు. రవి అరెస్ట్ అయిన తర్వాత నేను రెండుసార్లు మాట్లాడాను. నా కొడుకు తరపున వాదించే న్యాయవాదికి ఆర్థిక సాయం చేస్తా' అని అప్పారావు చెప్పుకొచ్చారు.'ఎన్కౌంటర్ చేయాలని చెప్పే హక్కు సినిమా వాళ్లకు ఎవరు ఇచ్చారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. సినిమా వాళ్లు ఎందుకు జడ్జిమెంట్లు ఇస్తున్నారు' అని కూడా అప్పారావు.. నిర్మాత సి.కల్యాణ్‌పై రెచ్చిపోయారు. ఇదే అప్పారావు.. కొడుకు అరెస్ట్ అయిన వెంటనే మాట్లాడుతూ.. కొడుకు చేస్తున్న వాటి గురించి తనకు ఏ మాత్రం తెలియదని, అలానే పట్టుకోలేరని పోలీసులకు సవాలు చేయడం అస్సలు కరెక్ట్ కాదని తన అభిప్రాయం చెప్పారు. ఏదేమైనా రవితో పాటు తండ్రి అప్పారావు కూడా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు.(ఇదీ చదవండి: తెలిసిన విషయాలే కానీ మనసుని మెలిపెట్టేలా.. ఓటీటీ రివ్యూ) -
ప్రత్యక్షంగా పైరసీ.. పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్
సాక్షి, హైదరాబాద్: ‘ఓ వెబ్సైట్లో పైరసీ సినిమా చూస్తే ఏమవుతుంది ? తక్కువ రేటుకే అది అందుబాటులో ఉంది కదా! అని అనేక మంది భావిస్తున్నారు. ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు తర్వాత ఇదే అంశాన్ని పలువురు లేవనె త్తారు. ఈ వ్యవహారంలో పైకి పైరసీ కని పిస్తున్నా, అంతర్గతంగా బెట్టింగ్ దందా, డేటా చోరీ ఉన్నాయి’అని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు. ‘ఐ బొమ్మ’ కేసులకు సంబంధించి ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు సజ్జనార్ మాటల్లోనే... 2019లో తొలి వెబ్సైట్ ఏర్పాటు: విశాఖపట్నానికి చెందిన ఇమ్మడి రవి ఎంబీఏ పూర్తి చేశాడు. హైదరాబాద్‌కు వలసవచ్చిన అతగాడు తొలినాళ్లల్లో వెబ్ సర్వీస్‌లు అందించే ఈఆర్ ఇన్ఫోటెక్ సంస్థను ఏర్పాటు చేశాడు. ఆపై పైరసీ దందాలోకి దిగి.. 2019లో ఐ బొమ్మ, 2022లో బప్పం టీవీ పేర్లతో వెబ్సైట్లు ఏర్పాటు చేశాడు. ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే మరోటి తెరుస్తూ మొత్తం 65 మిర్రర్ సైట్లు రూపొందించాడు. వీటిని హోస్ట్ సర్వర్లను స్విట్జర్లాండ్‌లో పెట్టాడు. కరేబియన్ దీవులతోపాటు నెదర్లాండ్స్, ఫ్రాన్స్, దుబాయ్‌ల్లోనూ సంచరిస్తూ ఆయా దేశాల్లో ఖరీదు చేసిన 110 డొమైన్స్ ద్వారా ఈ వెబ్సైట్లు హోస్ట్ చేశాడు. ఇతడి నుంచి స్వా«దీనం చేసుకున్న హార్డ్డిస్్కల్లో 21 వేల చిత్రాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీటిలో 1972 నాటి గాడ్‌ఫాదర్ నుంచి తాజా సినిమా ఓజీ వరకు ఉన్నాయి. రవి రెండేళ్ల క్రితం భారత పౌరసత్వం వదిలేసి కరేబియన్ దీవుల్లో ఒకటైన సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ దేశ పౌరసత్వం పొందాడు. ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా, ఇతగాడు మహారాష్ట్రకు చెందిన ప్రహ్లాద్ కుమార్ వెల్లెల పేరుతో ఓ డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. బాధితుల్లో చిత్ర పరిశ్రమతో పాటు సామాన్యులూ... ఇమ్మడి రవి నిర్వహిస్తున్న పైరసీ వెబ్సైట్ల ద్వారా సినీ పరిశ్రమతోపాటు సామాన్యులూ నష్టపోయారు. ఈ వెబ్సైట్ల ద్వారా యాడ్స్ ప్రమోట్ చేయడానికి అనేక బెట్టింగ్, గేమింగ్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాడు. ప్రధానంగా వన్ విన్, వన్ ఎక్స్ బెట్ సంస్థలు ఉన్నాయి. పైరసీ వెబ్సైట్లో సినిమా చూడటానికి క్లిక్ చేస్తే అది బెట్టింగ్ సైట్/యాప్‌కు రీడైరెక్ట్ చేస్తుంది. ఇలా అనేకమంది వాటికి బానిసలుగా మారి సర్వం కోల్పోయారు. ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోవడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇతడికి సంబంధించిన ఒక బ్యాంకు ఖాతా విశ్లేషణ ద్వారా రూ.20 కోట్లు ఆర్జించినట్టు తెలుస్తోంది. ఇలాంటి 32 బ్యాంకు ఖాతాలను విశ్లేíÙంచాల్సి ఉంది. ఇమ్మడి రవిపై సిటీ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఐదు కేసులు నమోదై ఉన్నాయి. ఇతడి ఇద్దరు అనుచరులు శివాజీ, ప్రశాంత్‌లను గతంలో అరెస్టు చేశారు. ఇతడు తన వెబ్సైట్ వీక్షకుల ఫోన్లు, కంప్యూటర్లలోని ఏపీకే ఫైల్స్ పంపి డేటాను తస్కరించాడు. ఇలా దాదాపు 50 లక్షల మంది డేటా హార్డ్డిస్్కల్లో భద్రపరిచాడు. రవి వ్యవహారాలపై సీబీఐ, ఈడీలకు సమాచారం స్కీన్ రికార్డింగ్‌తోపాటు సీక్రెట్ కెమెరాలతో రికార్డింగ్ ద్వారా రవి పైరసీ చేస్తున్నాడు. కొన్ని టెలిగ్రాం గ్రూపుల నుంచి కొన్ని చిత్రాలను ఖరీదు చేశాడు. ఇతగాడికి లండన్ సహా విదేశాల్లో కొందరు అనుచరులు ఉన్నట్టు తెలుస్తోంది. పైరసీ దందాతోపాటు బెట్టింగ్ యాడ్స్ ద్వారా వచ్చిన మొత్తంతో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇతడి అంశాన్ని సీబీఐ, ఈడీల దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు సమాచారం అందించనున్నారు. రెండు నెలల క్రితం కొందరు అరెస్టు అయినప్పుడు నన్ను పట్టుకోండి అంటూ తోపులా సవాల్ చేశాడు. ఇప్పుడు జైలులో ఉన్నాడు. రవి అరెస్టు తర్వాత పోలీసులకు వ్యతిరేకంగా అనేకమంది మీమ్స్ చేశారు. వీరి పైనా చర్యలకు రంగం సిద్ధం చేశాం. సైబర్ నేరాలతోపాటు సినీ పైరసీపై సమాచారం ఉంటే తక్షణం 1930కు కాల్ చేసి తెలియజేయాలి. -
పైరసీ వెబ్సైట్లు ఎక్కువ చూసేది వాళ్లే!
ఇటీవల హైదరాబాద్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సినీ పైరసీ గుట్టు రట్టు చేశారు. ఐదేళ్లలో 1,050 సినిమాలను పైరసీ చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పైరసీపై చర్చ మొదలైంది. భారత వినోద పరిశ్రమకు పైరసీ ‘బొమ్మ’ చూపిస్తోంది. విడుదలైన రోజే పైరసీ వెబ్సైట్లలో సినిమా దర్శనమిస్తోంది. అంతేకాదు పైరసీ భూతం చట్టానికే సవాల్ విసురుతోంది. పైరసీ సమస్య (Piracy Problem) ఒక్క సినిమా పరిశ్రమకే కాదు.. టీవీ, మ్యూజిక్, సాఫ్ట్వేర్, పబ్లిషింగ్ రంగాలకూ విస్తరించింది.ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది పైరసీ వెబ్సైట్ల విజిట్స్ 21,630 కోట్లు నమోదయ్యాయి. 2024లో మొత్తం పైరసీ ట్రాఫిక్‌లో మనదేశ వాటా 8.12%. అంటే మన దేశం నుంచి 1,756 కోట్ల విజిట్స్ నమోదయ్యాయన్నమాట. పబ్లిక్, ప్రైవేట్ టొరెంట్స్, వెబ్ ఆధారంగా ఫిల్మ్, టీవీ, మ్యూజిక్ స్ట్రీమింగ్; సాఫ్ట్వేర్, పబ్లిషింగ్ రంగాలలో ప్రపంచ పైరసీ ట్రెండ్స్‌ను పర్యవేక్షిస్తున్న డేటా కంపెనీ ‘మ్యూసో’.. ‘పైరసీ ట్రెండ్స్ అండ్ ఇన్ సైట్ రిపోర్ట్ 2024’ అనే నివేదిక రూపొందించింది. దీని ప్రకారం పైరసీ వెబ్సైట్ల వీక్షకుల సంఖ్యలో 12% వాటాతో అమెరికా (America) తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో భారత్ ఉంది. మొదటి స్థానం మనదేమొదటి స్థానం మనదే మ్యూసో 2023 నివేదిక ప్రకారం ప్రపంచ చలనచిత్ర పైరసీలో మనదే పైచేయి. మొత్తం పైరసీలో 30.58% వాటా మన దేశానిదే. యూఎస్ 6.26%, టర్కీ 5.75% వాటాతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. పైరసీ కంటెంట్‌ను డౌన్లోడ్ చేసుకుని చూసేవారితో (49.6 శాతం) పోలిస్తే.. అప్పటికప్పుడే చూసే (స్ట్రీమింగ్) వాళ్లు కాస్త ఎక్కువ ఉండటం (50.4 శాతం) గమనార్హం. వినోదం ఇప్పటికీ ఖరీదుగా ఉండడం, అందుబాటు విషయంలో కస్టమర్ల అంచనాలను అందుకోలేకపోవడం వల్లే పైరసీ కొనసాగుతోందని నివేదిక వెల్లడించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా 2023తో పోలిస్తే గత ఏడాది ఈ–బుక్స్, ఆడియో బుక్స్, పేపర్స్, మ్యాగజైన్స్ వంటి పబ్లిషింగ్ రంగంలో పైరసీ 4.3% పెరిగింది.జీఎస్టీ నష్టం రూ.4,313 కోట్లుఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ‘ద రాబ్ రిపోర్ట్ 2024’ ప్రకారం.. 2023లో భారత వినోద పరిశ్రమ పైరసీ కారణంగా రూ.22,400 కోట్ల నష్టాన్ని చవి చూసింది. ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లకు రూ.8,700 కోట్లు, థియేటర్లకు రూ.13,700 కోట్ల నష్టం వాటిల్లింది. మొత్తంగా ప్రభుత్వానికి జరిగిన జీఎస్టీ నష్టం రూ.4,313 కోట్లు.- సాక్షి, స్పెషల్ డెస్క్ -
కుబేర పైరసీ వీడియో వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారని కంప్లైంట్
-
పైరసీ సినిమాలకు అడ్డాగా తమిళ్‌రాకర్స్.. అడ్మిన్ అరెస్ట్
సినిమా కలెక్షన్స్‌కు గొడ్డలిపెట్టుగా మారిన పైరసీని అరికట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏదో ఒక రూపంలో పైరసీ జరుగుతూనే ఉంది. సినిమా థియేటర్లలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే వివిధ వెబ్సైట్లలో మూవీ ప్రత్యక్షమవుతోంది. తాజాగా ధనుష్ రాయన్ సినిమాను కూడా ఇలాగే పైరసీ చేసేందుకు ప్రయత్నించాడో వ్యక్తి.వెబ్సైట్లో ఫ్రీగా..మధురైకి చెందిన స్టీఫెన్ రాజ్ కేరళలోని తిరువంతపురం థియేటర్లో తన సెల్ఫోన్లో రాయన్ సినిమాను రికార్డు చేసి తమిళ్‌రాకర్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. ఇటీవలే వచ్చిన గురువాయురప్పన్ అంబలనడై సినిమాను సైతం థియేటర్లో రిలీజైన తర్వాతి రోజే వెబ్సైట్లో ఫ్రీగా అందుబాటులోకి తెచ్చాడు. దీంతో ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్మాతలు కేరళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అడ్మిన్ అరెస్ట్దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు స్టీఫెన్‌ను అరెస్ట్ చేశారు. మహారాజ, కల్కి 2898 ఏడీ చిత్రాల కాపీలు సైతం అతడి దగ్గర ఉన్నట్లు గుర్తించారు. తమిళ్‌రాకర్స్ అడ్మిన్‌గా పని చేస్తున్న ఇతడు.. థియేటర్లో కూర్చున్నప్పుడు కాఫీ కప్ పెట్టుకునే హోల్డర్‌లో మొబైల్ ఫోన్ పెట్టి సినిమాను రికార్డు చేస్తున్నట్లు తెలిపారు.చదవండి: హీరోయిన్‌తో పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మెగాహీరో -
అత్తారింటికి.. దారి కనుక్కున్న పోలీసులు
-
అత్తారింటికి.. దారి కనుక్కున్న పోలీసులు
విజయవాడ: 'అత్తారింటికి దారేది’ సినిమా పైరసీ కేసుకు సంబంధించి కృష్ణా జిల్లా పోలీసులు అయిదుగురిని అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా ఎస్పి ప్రభాకర రావు వారిని విలేకరుల ముందు హాజరుపరిచారు. పది సంవత్సరాల నుంచి సినిమా ప్రొడక్షన్ విభాగంలో ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న చీకటి అరుణ్ కుమార్ సూత్రదారిగా తేలింది. డివిడిలు ఇతరులకు చేరడానికి ప్రధాన కారకులు ఎపిఎస్పి కానిస్టేబుళ్లుగా గుర్తించారు. ఈ సినిమా విడుదల కాకముందే సిడిలు విడుదలయిన విషయం తెలిసిందే. ఎస్పి చెప్పిన కథనం ప్రకారం అరుణ్ కుమార్ 'అత్తారింటికి దారేది’ చిత్రంకు ఎడిటింగ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఆ సినిమా ఫైల్ ఉంచిన కంప్యూటర్ పాస్వర్డ్ కూడా ఇతని దగ్గర ఉంటుంది. దాంతో అతను రెండు డివిడిలలో ఆ చిత్రాన్ని కాపీ చేశాడు. ఆ రెండు డివిడిలను చూడటానికి మిత్రులకు ఇచ్చాడు. సినిమా చూసిన తరువాత సివిడిని విరగగొట్టమని వారికి చెప్పాడు. మిత్రులు ఆ డివిడిలను విరగొట్టకుండా ఇతరులకు ఇచ్చారు. ఈ డివిడిలు ప్రసన్న కుమార్ అనే కానిస్టేబుల్ నుంచి అనూక్ అనే కానిస్టేబుల్ వద్దకు చేరాయి. అతని వద్ద నుంచి ఎపిఎస్పి పోలీస్ కానిస్టేబుల్ కట్టా రవి కుమార్ ఎలియాస్ రవి వద్దకు చేరాయి. అతను వాటిని ఈ నెల 14న కొరియర్లో ద్వారా పెడనుకు పంపాడు. అవి పెడనులోని ఊటుకూరు సుధీర్ కుమార్ తీసుకున్నారు. అతని దగ్గర నుంచి వీరంకి సురేష్ కుమార్ వద్దకు, ఆ తరువాత దేవి మోబైల్ సెల్ రిపేర్ షాపు యజమాని కొల్లిపర అనీల్ కుమార్ వద్దకు చేరాయి. అక్కడ నుంచి మార్కెట్లో వచ్చేశాయి. నిర్మాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పెడన, మచిలీపట్నంలలో దాడులు చేసి సిడిలను స్వాధీనం చేసుకున్నారు. ఐటి, కాపీరైట్ చట్టం, చీటింగ్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. బందరు సిఐ పల్లంరాజు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పి తెలిపారు. కోట్ల రూపాయలు వెచ్చించి తీసిన ఈ సినిమా పైరసీ సీడీని 50 రూపాయలకే అమ్మకాలు సాగించిన తీరుపై సోమవారం పెడన, బందరులో దాడులు చేసి పలు ఇంటర్నెట్, సెల్‌పాయింట్లు నుంచి కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. మంగళవారం సుమారు 30 మందిని విచారించారు. వారిలో 12 మందిని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు అయిదుగురిని అరెస్ట్ చేశారు. ఈ సినిమా పైరసీ సీడీలు పెడనలో దొరుకుతున్నాయని, ఒక టీవీ చానల్‌కు అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్‌కాల్‌తో కలకలం రేగింది. చిత్ర నిర్మాత రెండు హైదరాబాద్‌లో డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ జె.ప్రభాకరరావు ఆదేశాలతో డీఎస్పీ కేవీ శ్రీనివాస్ నేతృత్వంలో పోలీస్ ప్రత్యేక బృందాలు పెడన, మచిలీపట్నంలోని పలు మొబైల్, కంప్యూటర్, ఇంటర్నెట్ సెంటర్లు, సీడీ షాపులపై దాడులు చేశారు. ఈ సంగతి తెలుసుకున్న పవన్ కల్యాణ్, చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున మొబైల్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్ల వద్ద గుమిగూడారు. ఓ చానల్ ప్రతినిధులు ఎస్పీ ప్రభాకరరావుకు సీడీని అందజేశారు. ఆయన ఆదేశంతో బందరు డీఎస్సీ డాక్టర్ కేవీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐ పల్లంరాజు పలువురు ఎస్సైలు మొబైల్ షాపులను తనిఖీ చేశారు. తొలుత దేవీ మొబైల్స్ షాపును పరిశీలించగా అక్కడేమి దొరకలేదు. దీంతో సీఐ పల్లంరాజు పెడన, మచిలీపట్నంలోని పలు మొబైల్, ఇంటర్నెట్ కంప్యూటర్ షాపులను తనిఖీ చేసి షాపుల్లో ఉన్న వాటిని స్వాధీనం చేసుకున్నారు.


