'ఐ బొమ్మ' రవి అరెస్ట్.. గత కొన్నిరోజుల నుంచి ఈ టాపిక్కే తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది. రవి చేసింది అక్షరాలా తప్పే కానీ జనాలు అతడికే మద్ధతు తెలుపుతుండటం ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సినిమా వాళ్లకు సపోర్ట్‌గా ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. దీనికి కారణాలు ఏంటనేది పక్కనబెడితే నిర్మాత సి.కల్యాణ్ అయితే ఏకంగా రవిని ఎన్‌కౌంటర్ చేసేయాలని నాలుగైదు రోజుల క్రితం షాకింగ్ కామెంట్స్ చేశారు.
(ఇదీ చదవండి: ప్రకటించిన నాలుగేళ్లకు ప్రభాస్ 'స్పిరిట్' లాంచ్)
నిర్మాత కల్యాణ్ చేసిన 'ఎన్‌కౌంటర్' వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి గట్టిగానే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఐ బొమ్మ రవి తండ్రి అప్పారావు కూడా కల్యాణ్ చేసి కామెంట్స్‌ని తప్పుబట్టారు. 'సి.కళ్యాణ్‌ని గానీ, ఆయన కొడుకుని గానీ ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. సినిమాలో విషయం ఉంటే జనం కచ్చితంగా చూస్తారు. నేను 45 పైసలతో సినిమా చూశా. ఇప్పుడు దారుణంగా రేట్లు పెరిగాయి. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు ఎవరు తీయమంటున్నారు. రవి అరెస్ట్ అయిన తర్వాత నేను రెండుసార్లు మాట్లాడాను. నా కొడుకు తరపున వాదించే న్యాయవాదికి ఆర్థిక సాయం చేస్తా' అని అప్పారావు చెప్పుకొచ్చారు.
'ఎన్కౌంటర్ చేయాలని చెప్పే హక్కు సినిమా వాళ్లకు ఎవరు ఇచ్చారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. సినిమా వాళ్లు ఎందుకు జడ్జిమెంట్లు ఇస్తున్నారు' అని కూడా అప్పారావు.. నిర్మాత సి.కల్యాణ్‌పై రెచ్చిపోయారు. ఇదే అప్పారావు.. కొడుకు అరెస్ట్ అయిన వెంటనే మాట్లాడుతూ.. కొడుకు చేస్తున్న వాటి గురించి తనకు ఏ మాత్రం తెలియదని, అలానే పట్టుకోలేరని పోలీసులకు సవాలు చేయడం అస్సలు కరెక్ట్ కాదని తన అభిప్రాయం చెప్పారు. ఏదేమైనా రవితో పాటు తండ్రి అప్పారావు కూడా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు.
(ఇదీ చదవండి: తెలిసిన విషయాలే కానీ మనసుని మెలిపెట్టేలా.. ఓటీటీ రివ్యూ)


