తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు. హీరోల దగ్గర నుంచి నిర్మాతల వరకు పక్కాగా అనుసరిస్తుంటారు. హిట్ అయితే దాన్ని తెగ నమ్ముతారు. నెగిటివ్ అనే ముద్రపడితే ఆ వైపు చూసే సాహసం కూడా చేయరు. జనవరి 10న కూడా అలాంటి ఓ నమ్మకం ఏర్పడిందా అనే సందేహం కలుగుతోంది. నిజంగా ఈ తేదీని చూసి టాలీవుడ్ భయపడుతోందా?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమాలు)
టాలీవుడ్‌లో జనవరి 10కి గతంలో ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది. కానీ పదేళ్లలో చూసుకుంటే మాత్రం ఎందుకో ఫ్లాప్స్ తప్ప హిట్ అనేది కనిపించదు. 2014లో మహేశ్ బాబు 'వన్: నేనొక్కడినే' ఇదే తేదీన థియేటర్లలోకి వచ్చింది. ఘోరమైన ఫలితం అందుకుంది. 2015లో వెంకటేశ్-పవన్ కల్యాణ్ 'గోపాల గోపాల' వచ్చింది. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. 2018లో పవన్ 'అజ్ఞాతవాసి' వచ్చింది. దీని ఫలితం ఏంటనేది ప్రత్యేకంగా గుర్తుచేయాల్సిన పనిలేదు.
2018లో పవన్ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ లాంగ్ రన్‌లో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి జనవరి 10న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేసే సాహసం ఎవరూ చేయలేదు. 2018 తర్వాత సంక్రాంతి పండగకు ఇప్పటివరకు దాదాపు 27 మూవీస్ రిలీజయ్యాయి. కాకపోతే మరే చిత్రం కూడా ఇదే తేదీన రాలేదు. గతేడాది మాత్రం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'తో జనవరి 10వ తేదీనే థియేటర్లలోకి వచ్చాడు. ఇది కూడా ఫ్లాప్ అయింది.
(ఇదీ చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ)
చూస్తుంటే జనవరి 10 అనేది టాలీవుడ్ కి నెగిటివ్ సెంటిమెంట్‌లా మారినట్లు అనిపిస్తుంది. అందుకే కొత్త సినిమాల్ని ఆ తేదీన రిలీజ్ చేయట్లేదా అనిపిస్తుంది. ప్రతి ఏడాది సంక్రాంతి సెలవులు.. 9,10 తేదీ నాటికి మొదలైపోతాయి. ఈ టైంలో మూవీస్ రిలీజ్ చేస్తే పండగ టైంకి పీక్‌కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఈసారి అలా 'రాజాసాబ్' 9వ తేదీన వచ్చాడు. కాకపోతే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. వీకెండ్ అయ్యేసరికి అసలు టాక్ ఏంటనేది తెలుస్తోంది. ఈసారి 10వ తేదీన కొత్త చిత్రం ఏం రిలీజ్ కావట్లేదు.
ఈసారి 12వ తేదీన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు', 13న రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 14వ తేదీన నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', 15న శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి ఈసారి సంక్రాంతి విన్నర్ అయ్యేది ఎవరు? ప్రేక్షకుల మనసు గెలుచుకుని కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకునేది ఎవరనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.
(ఇదీ చదవండి: 'రాజాసాబ్'.. పాన్ ఇండియా పూర్ ప్లానింగ్!)


