మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఈవారం చాలానే తెలుగు సినిమాలు ఓటీటీల్లోకి వచ్చాయి. వాటిలో అఖండ 2, జిగ్రీస్, అందెల రవమిది లాంటి స్ట్రెయిట్ మూవీస్ ఉండగా.. అలానే అయలాన్, వెపన్స్ లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. పరభాషా సినిమాలు అయినప్పటికీ అంగమ్మళ్, మాస్క్.. ఉన్నంతలో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు వీటితో తోడు మరో రెండు తెలుగు థ్రిల్లర్ మూవీస్ కూడా సైలెంట్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? ఎందులో ఉన్నాయి?
(ఇదీ చదవండి: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చిన 28 సినిమాలు)
గతేడాది నవంబరు చివరలో వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ 'నాట్ ఆల్ ద మూవీస్ ఆర్ సేమ్: డ్యూయల్'. సురేశ్ సాగిరాజు దర్శకత్వం వహించారు. అదృష్టం తెచ్చే దురాశ, దాని వెనుక దాగి ఉన్న భయంకరమైన పరిణామాల నేపథ్య కథతో ఈ సినిమా తీశారు. రెగ్యులర్‌గా భయపెట్టే శబ్దాలు కాకుండా, మైండ్ గేమ్స్‌తో భయపెట్టే సైకలాజికల్ థ్రిల్లర్‌గా దీన్ని తీయడం విశేషం. ప్రస్తుతం ఇది లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది.
2024 వేసవిలో విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'తో పాటు రిలీజైన ఓ చిన్న సినిమా 'బహుముఖం'. మొత్తం అమెరికాలోనే తీసిన సస్పెన్స్ సైకో థ్రిల్లర్ ఇది. హర్షివ్ కార్తీక్ హీరోగా నటించి దర్శకత్వం కూడా చేశాడు. తన తల్లి కలని తన కలగా మార్చుకుని నటన అంటే విపరీతమైన ఇష్టం పెంచుకున్న ఓ అబ్బాయి.. అనుకోకుండా సైకోలా మారితే ఏంటి పరిస్థితి అనే పాయింట్‍తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం బుక్ మై షో స్ట్రీమింగ్‌లో అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లోకి గతంలోనే వచ్చినప్పటికీ మన దేశంలో అయితే చూసే వెసులుబాటు లేదు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మమ్ముట్టి బ్లాక్‌బస్టర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)


