తెలిసిన విషయాలే కానీ మనసుని మెలిపెట్టేలా.. ఓటీటీ రివ్యూ | Homebound Movie Telugu Review | Sakshi
Sakshi News home page

Homebound Review: కుల, మత వివక్షని వేలెత్తి చూపే సినిమా.. ఏ ఓటీటీలో?

Nov 23 2025 7:30 AM | Updated on Nov 23 2025 7:36 AM

Homebound Movie Telugu Review

కమర్షియల్ సినిమాలు ఎప్పుడూ వచ్చేవే. కానీ రియలస్టిక్ చిత్రాలు మాత్రం అరుదుగా వస్తుంటాయి. అలా అని అవేదో గొప్ప మూవీస్ అని కాదు. మనకు తెలిసిన విషయాల్నే కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. అలాంటి ఓ మూవీనే 'హౌమ్ బౌండ్'. మన దేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఆస్కార్ బరిలో ఉంది. థియేటర్లలో రిలీజైనప్పుడు కొందరికే రీచ్ అయింది. ఇప్పుడు ఓటీటీలోకి రావడంతో దీని గురించి మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు. ఇషాన్ కట్టర్,  విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమా సంగతేంటి? ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9: అనుకున్నట్లే ఈ వారం ఆమెనే ఎలిమినేట్!)

కథేంటి?
ఇది షోయబ్ అలీ (ఇషాన్ కట్టర్), చందన్ కుమార్ (విశాల్ జెత్వా) అనే ఇద్దరు స్నేహితుల కథ. ఓ పల్లెటూరిలో వీళ్లిద్దరూ బతుకుంటారు. తక్కువ కులాలకు చెందిన వాళ్లు కావడంతో ఎవరూ వీళ్లకు కనీస గౌరవం ఇవ్వరు. పోలీస్ కానిస్టేబుల్ అయితే ఊరిలో తమకు గౌరవం దక్కుతుందని అనుకుంటారు. కానీ పరిస్థితులు వీళ్లపై పగబడతాయి. ఇంతకీ ఏమైంది? అలీ, చందన్.. పోలీస్ ఉద్యోగాలు సాధించారా లేదా? కరోనా వల్ల వీళ్ల జీవితంలో ఏం జరిగిందనేది అసలు స్టోరీ.

ఎలా ఉందంటే?
'ఏ ఫ్రెండ్‌షిప్, ఏ పాండమిక్ అండ్ ఏ డెత్ బిసైడ్ ద హైవే' అనే ఆర్టికల్ ఆధారంగా తీసిన సినిమా ఇది. ఇందులో కొత్త విషయాలు అంటూ ఏం ఉండవు. మన చుట్టూ జరిగేవే ఇందులోనూ కనిపిస్తాయి. మరి ఏంటి ప్రత్యేకత అంటే.. వాటిని చూపించిన విధానం. చాలా సహజంగా ఉంటుంది. 2025 వచ్చినా సరే ఇప్పటికీ సమాజంలో కుల, మత వివక్ష అనేది ఎంత దారుణంగా ఉందనేది కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రమిది. మనం ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా అని మనల్ని మనమే ప్రశ్నించుకునేలా చేసే మూవీ ఇది.

ప్రభుత్వం లేదా సమాజం చర్యల వల్ల ఎప్పుడూ ప్రభావితమయ్యేది దిగువ మధ్యతరగతి కుటుంబాలే. అది నోట్ల రద్దు కావొచ్చు, లాక్ డౌన్ కావొచ్చు. అసలు సామాన్య ప్రజలు ఈ పరిస్థితుల్ని ఎలా తట్టుకోగలరు అనేది ప్రభుత్వం ఎప్పడైనా ఆలోచిస్తుందా అనే ప్రశ్న రేకెత్తించేలా చేసే సినిమా ఇది. కరోనా అనేది ఇప్పుడు బతుకుతున్న చాలామంది జీవితాల్ని తలకిందులు చేసింది. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, ఉద్యోగాలు పోయాయి. చాలామంది కార్మికులు వందల కిలోమీటర్లు నడిచి సొంతూళ్లకు వెళ్లారు. చాలామంది మధ్యలోనే ప్రాణాలు కూడా విడిచారు. అలాంటి ఓ కథే ఈ సినిమా.

కరోనా ఒక్కటే కాదు ఇప్పటికీ కులం కారణంగా కొందరూ ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాల్లోనూ ఎలాంటి అణిచివేతకు గురవుతున్నారనే విషయాన్ని మనసుని మెలిపెట్టేలా చూపించిన మూవీ ఇది. ప్రతి సీన్ చాలా సహజంగా ఉంటుంది. యాక్టర్స్ ఎవరూ కూడా నటిస్తున్నట్లు అసలు అనిపించదు. అంత సహజంగా చేశారు. లీడ్ యాక్టర్స్ అయిన ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా ఫెర్ఫార్మెన్స్ కూడా అదే రేంజులో ఉంటుంది. ఇంటర్వెల్ ముందొచ్చే సీన్ కావొచ్చు క్లైమాక్స్‌లో తన స్నేహితుడు చనిపోయాడని తెలిసి బాధపడే సన్నివేశం గానీ మనల్ని కూడా ఏడిపించేస్తాయి.

అలా అని ఈ సినిమా అందరికీ నచ్చుతుందా అంటే లేదు. రెండు గంటల మూవీలో చాలా డ్రామా ఉంటుంది. ఇందులో లీనమైతే తప్ప ఇది మీకు నచ్చదు. లేదు కమర్షియల్ అంశాలు కావాలనుకుంటే మాత్రం దీన్ని చూడొద్దు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: 21న థియేటర్లలో 21 సినిమాలు రిలీజ్.. ఏది హిట్? ఏది ఫట్?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement