హైదరాబాద్: సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లేవారికి దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. సుమారు 150 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి (సీపీఆర్‌ఓ) ఎ శ్రీధర్ మీడియాకు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యే కాకుండా దేశంలోని ఉత్తర, తూర్పు, దక్షిణ భారత ప్రాంతాలకు కూడా రైళ్లను నడపనున్నట్లు వివరించారు.
తిరుపతి, షిరిడీలకు..
పండుగ సమయంలో రద్దీగా ఉండే తిరుపతి, షిరిడీ తదితర పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైళ్లను కేటాయించినట్లు శ్రీధర్ తెలిపారు. పండుగ సీజన్‌లో 150 ప్రత్యేక రైళ్లతో మొత్తం 600 రైళ్లు నిరంతరాయంగా నడుస్తాయని, తద్వారా సికింద్రాబాద్ లాంటి ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అన్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ స్థాయిలో పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.
స్టేషన్లలో రద్దీ నివారణకు..
కాగా పండుగ రద్దీ సమయంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రైల్వే శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొన్ని ముఖ్య రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లకు మళ్లించారు. మరికొన్ని రైళ్లను తాత్కాలికంగా ఇతర స్టేషన్ల నుండి నడపాలని అధికారులు నిర్ణయించారు. స్టేషన్లలో రద్దీని తగ్గించి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.
రహదారి మార్గంలో..
ఇదిలావుండగా, సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రోజుకు సుమారు లక్ష వాహనాలు ప్రయాణించే అవకాశం ఉందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించేందుకు తాను స్వయంగా మోటారు సైకిల్‌పై పర్యటిస్తానని ప్రకటించారు.
నితిన్ గడ్కరీకి లేఖ
టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోకుండా 'ఫ్రీవే' విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. దీనిపై చర్చించేందుకు త్వరలోనే కేంద్ర మంత్రితో భేటీ కానున్నట్లు, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరపున నామమాత్రపు చెల్లింపులు చేసి, ప్రయాణికులకు ఊరట కలిగిస్తామని అన్నారు. వీటితో పాటు ప్రతిష్టాత్మక మేడారం జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి రవాణా ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పండుగలు, జాతరల వేళ ప్రజల ప్రయాణం సాఫీగా సాగేలా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నదని అన్నారు.
ఇది కూడా చదవండి: Republic Day 2026: ఉగ్ర ముప్పు.. భారీగా భద్రతా బలగాల మోహరింపు


