మీరు దిగాల్సిన స్టాప్‌ వచ్చింది..! | TSRTC To Introduce GPS Based Passenger Announcement System In Hyderabad City Buses Similar To Metro Trains | Sakshi
Sakshi News home page

మీరు దిగాల్సిన స్టాప్‌ వచ్చింది..!

Feb 21 2026 7:08 AM | Updated on Feb 21 2026 10:22 AM

TSRTC To Introduce GPS based passenger announcement system in hyderabad city buses

సాక్షి, హైదరాబాద్‌: ‘మీ తదుపరి స్టేజీ సికింద్రాబాద్, మీకు ఎడమవైపు డోర్‌ తెరుచుకుంటుంది’ అని మెట్రో రైళ్లలో అనౌన్స్‌మెంట్‌ వినిపిస్తుంది. ప్రతి స్టాప్‌ దగ్గర ఈ ప్రకటన ఉంటుంది. దిగాల్సిన స్టాప్‌ మీద అవగాహన లేని ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అందుకే మెట్రో రైలు ప్రయాణికులు ఇతరుల సాయాన్ని కోరాల్సిన అగత్యం ఉండదు. కానీ, బస్సుల్లోకొచ్చేసరికి ప్రయాణికులకు కొంత అయోమయం తప్పదు. 

ముఖ్యంగా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇది పెద్ద సమస్యే. దిగాల్సిన స్టాపు వచి్చనప్పుడు చెప్పా ల్సిందిగా తోటి ప్రయాణికులను కోరడమో, కండక్టర్‌ పిలుపు కోసం ఎదురుచూడడమో తప్పదు. ఇప్పుడు ఈ సమస్యను దూరం చేస్తూ ఆర్టీసీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. మెట్రో రైళ్ల తరహాలోనే బస్సుల్లో కూడా ‘ప్యాసింజర్‌ అనౌన్స్‌మెంట్‌ సిస్టం’ఏర్పాటుకు నిర్ణయించింది.

 తొలుత సిటీ బస్సుల్లో ఇది మొదలుకాబోతోంది. ఇందుకోసం ప్రయోగాత్మక పరిశీలన కోసం సికింద్రాబాద్‌–ఫిల్‌్మనగర్‌ మధ్య నడిచే 47ఎల్‌ నంబరు బస్సుల్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఓ ప్రైవేటు సంస్థ ఐదు బస్సుల్లో ఉచిత ప్రయోగాన్ని ప్రారంభించింది. దాని ఫలితాలను సమీక్షించిన తర్వాత సానుకూలంగా ఉందని భావిస్తే మిగతా అన్ని సిటీ బస్సుల్లో దాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత జిల్లా సర్వీసుల్లో ప్రారంభిస్తారు.  

జీపీఎస్‌ ఆధారిత పరిజ్ఞానంతో.. 
ప్రస్తుతం ఆర్టీసీ బస్సులను జీపీఎస్‌తో అనుసంధానించారు. బస్సులతోపాటు బస్టాపు ప్రాంతాలను జియో ఫెన్సింగ్‌తో అనుసంధానించారు. ప్రస్తుతం చాలా బస్సుల్లో ఎల్‌ఈడీ ఆధారిత డెస్టినేషన్‌ బోర్డులు పనిచేస్తున్నాయి. జీపీఎస్‌ ఆధారిత రూట్‌ మానిటరింగ్‌ సిస్టంతో ఇవి పనిచేస్తున్నాయి. ఇక్కడే స్వల్ప మార్పు చేయడం ద్వారా వెహికిల్‌ మానిటరింగ్‌ సిస్టం ఏర్పాటుకు వీలుంది. 

అప్పుడు బస్సు ఏ ప్రాంతంలో ఉందో ట్రాక్‌ చేయొచ్చు. ఈ వెహికిల్‌ మానిటరింగ్‌ సిస్టంను బస్సుల్లో ఏర్పాటు చేస్తారు. అది ఆ ప్రాంతంలోని జియో ఫెన్సింగ్‌తో అనుసంధానమై ఉంటుంది. అందులో ఉండే టెక్నాలజీ ... బస్సు ఏ ప్రాంతంలో ఉందో గుర్తించి వాయిస్‌ ద్వారా వెల్లడిస్తుంది. బస్సు ఒక స్టాప్‌ జియో ఫెన్సింగ్‌ పరిధిలోకి రాగానే ఆ స్టాప్‌ పేరును వాయిస్‌ ద్వారా ప్రకటిస్తుంది. 

మనిషి ప్రమేయంతో పనిలేకుండా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు ఆ విధానాన్నే బస్సుల్లో ఏర్పాటు చేస్తారు. ప్రతి బస్సులో ఒక్కో వైపు మూడు చొప్పున ఆరు స్పీకర్లు బిగిస్తారు. వాటిని వెహికల్‌ మానిటరింగ్‌ సిస్టంతో అనుసంధానిస్తారు. ప్రస్తుత ప్రయోగం బాగుందని భావిస్తే టెండర్లు పిలిచి తక్కువ మొత్తం కోట్‌ చేసిన సంస్థకు ఈ వ్యవస్థ ఏర్పాటు బాధ్యత అప్పగిస్తారు. ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం ఒక్కో బస్సుకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు అవుతుందని సమాచారం.    

Advertisement
 
Advertisement
Advertisement