విద్యార్థుల్లో ఆపుకుంటున్నవారే అధికం
దీంతో తప్పని యూరిన్ ఇన్ఫెక్షన్లు
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల
తాజా అధ్యయనంలో వెల్లడి
సాక్షి, సిద్దిపేట : తగినంత నీరు తాగక.. మూత్ర విసర్జన చేయక విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. విద్యార్థుల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టారు. దాహం వేసినప్పుడు నీళ్లు తాగాలి.. యూరిన్ వచ్చినప్పుడు ఆపుకోవద్దని, మూత్రశాలల్లోనూ జాగ్రత్తలు తీసుకోకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ల బారిన పడక తప్పదని ఆ అధ్యయనంలో తేలింది.
7 గంటలు.. 600 మిల్లీలీటర్లే..
పాఠశాలలో తరగతులు కొనసాగే 7 గంటల్లో విద్యార్థులు కేవలం 600 మిల్లీలీటర్ల నీటిని మాత్రమే తీసుకుంటున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూక్ష్మజీవ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మదన్‌మోహన్ నేతృత్వంలో మూడు సెక్షన్లలో 15 ప్రశ్నలను రూపొందించారు. సిద్దిపేట జిల్లాలోని పలు పాఠశాలల్లో 6 నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్న 450 మంది విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. పాఠశాలకు వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్లే వరకు 3 నుంచి 4 గ్లాసుల నీళ్లు 75 శాతం, 5 నుంచి 6 గ్లాసులు 8 శాతం, 7కంటే ఎక్కువ 7 శాతం, 0 నుంచి 2 గ్లాస్‌ల నీళ్లు 10 శాతం మంది విద్యార్థులు తాగుతున్నారు.
క్లాస్ జరుగుతుండగా వాటర్ తాగేవారు అప్పుడప్పుడు 66 శాతం, ఎప్పటికి తాగనివారు 8 శాతం, క్లాస్ టైమ్‌లో తాగనివారు 26 శాతం, ఇంటి నుంచి వాటర్ బాటిల్ తెచ్చుకుంటున్న వారు 79 శాతం, తీసుకురాని వారు 21 శాతం మంది ఉన్నారు. స్కూల్‌లో యూరిన్‌కు వెళ్లేవారు రెండు సార్ల వరకు 29 శాతం, 3 నుంచి 4 సార్లు 54 శాతం, ఏడు సార్ల వరకు 17 శాతం మాత్రమే ఉన్నారు. క్లాస్ జరుగుతుండగా యూరిన్ వస్తే ఆపుకుంటున్నవారు 87 శాతం, పరి్మషన్ తీసుకుని వెళతాం అని 13 శాతం మంది విద్యార్థులు చెప్పారు.
56 మందిలో ఇన్ఫెక్షన్ లక్షణాలు
యూరిన్ పోస్తున్నప్పుడు నొప్పిగా ఉంటుందని 25 శాతం, ఎప్పుటికీ యూరిన్ వస్తుందని అనిపిస్తున్నట్టు 25 శాతం, కడుపు నొప్పితో జ్వరం వస్తున్న వారు 20 శాతం, యూరిన్ వాసన వస్తుందని 12 శాతం, యూరిన్‌లో బ్లడ్ అప్పుడప్పుడు వస్తుందని 4 శాతం మంది విద్యార్థులు చెప్పారు. దీంతో దాదాపు 56 మందికి మూత్రం ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వారిలో ఇప్పటి వరకు 24 మంది నుంచి మూత్రం శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌లో టెస్ట్ చేయించగా, వారిలో 16 మందికి మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉందని తేలింది.
చేతులు శుభ్రం చేసుకోవాలి
యూరిన్‌కు వెళ్లి వచ్చిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి. 70 శాతం మాత్రమే శుభ్రం చేసుకుంటుండగా, మిగతా 30 శాతం మంది అలాగే తరగతి గదికి వెళుతున్నారని తేలింది. మూత్రశాలకు వెళ్లగానే ముందుగా వాటర్ పోయాలి.. మూత్రం పోసిన తర్వాత మళ్లీ వాటర్ పోయాలి. అప్పుడే మూత్రశాలలో ఉన్న బ్యాక్టీరియాలను నియంత్రించొచ్చు.
భయానికి నీళ్లు తాగడం లేదు
నీరు ఎక్కువగా తాగితే మాటిమాటికి ఉపాధ్యాయులు మూత్ర విసర్జనకు అనుమతించరని చాలామంది విద్యార్థులు నీరు తాగడమే లేదు. దీంతోపాటు పాఠశాలలో విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు లేకపోవడం, ఉన్నవి నిర్వహణ లేక దుర్గంధం వస్తుండటం కూడా విద్యార్థులు తాగునీటికి దూరంగా ఉంటున్నారు. దీంతో విద్యార్థులకు యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి.
యూరిన్ వస్తే ఆపుకోవద్దు
విద్యార్థులకు ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. దీంతో మా కళాశాల విద్యార్థులచే అధ్యయనం చేపట్టాం. విద్యార్థులకు అందుబాటులో తాగేందుకు నీటిని ఉంచాలి. యూరిన్‌ను ఆపుకోవద్దు. విద్యార్థులందరికీ ఒకసారే ఇంటర్వెల్ ఇవ్వడంతో అందరూ వెళ్లేందుకు సమయం సరిపోవడం లేదు. రెండు క్లాస్‌లకు ఒకసారి విడతల వారీగా ఇంటర్వెల్ ఇవ్వాలి. విద్యార్థులు ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు నీళ్లు తాగాలి. విద్యార్థులు రోజుకు 2 నుంచి మూడు లీటర్ల నీటిని తాగాలి. అప్పుడే యూరిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటుంది. – డాక్టర్ మదన్‌మోహన్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూక్ష్మజీవ శాస్త్ర విభాగాధిపతి, సిద్దిపేట
అవగాహన కల్పించేందుకే..
విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకే ఈ అధ్యయనం చేపట్టాం. కొన్ని పాఠశాలల వారు సర్వేకు అనుమతి ఇచ్చారు. మరికొందరు ఇవ్వలేదు. మూత్రంలో ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్న వాటిని ప్రత్యేక ల్యాబ్‌కు పంపించి టెస్ట్‌లు చేయిస్తున్నాం. –వినాయక్, హరిణిలత, సుషి్మత, గాయత్రి, వేదవాసిని, మమత మైక్రో బయోటెక్నాలజీ విద్యార్థులు


