ముంబై: ఒక చిన్న తగాదా ప్రాణం తీసింది. మలాడ్ రైల్వే స్టేషన్‌లో ఓ కళాశాల ప్రొఫెసర్‌ను ప్రయాణికుడు.. దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. లోకల్ ట్రైన్‌లో ప్రయాణించిన ప్రొఫెసర్, ఒక ప్రయాణికుడి మధ్య చిన్న వివాదం విషాదాన్ని మిగిల్చింది. ఆ రైలు స్టేషన్ చేరుకోగా దిగేటప్పుడు కూడా వారిద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడు ప్రొఫెసర్‌ను కత్తితో పొడిచి.. పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో ఆ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రొఫెసర్‌గా అలోక్ సింగ్.. విలే పార్లేలోని ప్రముఖ కాలేజీలో పని చేస్తున్నారు. శనివారం ఆయన లోకల్ ట్రైన్‌లో ప్రయాణించారు. రైలులో సీటు విషయంలో ఓ ప్రయాణికుడు, ప్రొఫెసర్ అలోక్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది. ట్రైన్ మలాడ్ స్టేషన్ చేరగానే దిగే సమయంలో గేటు వద్ద రద్దీ కారణంగా తోపులాట జరిగింది. దీంతో వారి మధ్య గొడవ మరింత ముదిరింది. ఆ వ్యక్తి.. ప్రొఫెసర్ అలోక్ సింగ్ కడుపులో పలుమార్లు పొడిచి చంపేశాడు. అనంతరం స్టేషన్‌లోని జనం రద్దీలో కలిసిపోయి పరారయ్యాడు. దీంతో కత్తి పోట్లుతో అలోక్ సింగ్ కుప్పకూలి మరణించాడు.
ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు.. హత్య చేసిన వ్యక్తిని ఓంకార్ షిండే(27)గా పోలీసులు గుర్తించారు. దాడి చేసిన కొద్దిసేపటికే వైట్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించిన ఓ వ్యక్తి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా పారిపోతుండటం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది.
గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. షిండేను అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైలులో సీటు కోసం జరిగిన చిన్న గొడవకే ప్రొఫెసర్‌ను షిండే దారుణంగా కత్తితో పొడిచి చంపడం వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? వారి మధ్య గతంలో శత్రుత్వం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


