ఫలకళా మహోత్సవం | celebrates the annual production of specialty lemons and other citrus fruit in Menton | Sakshi
Sakshi News home page

ఫలకళా మహోత్సవం

Feb 22 2026 3:33 AM | Updated on Feb 22 2026 3:33 AM

celebrates the annual production of specialty lemons and other citrus fruit in Menton

అక్కడి వీథులన్నీ ఫలకళతో పరవశం కలిగిస్తాయి. నిమ్మజాతికి చెందిన పండ్లతో రూపొందించిన భారీ కళాకృతులు కనువిందు చేస్తాయి. సంప్రదాయ నృత్యగానాలతో జనాలు వీథుల్లో జరిపే ఊరేగింపులు ఉర్రూతలూగిస్తాయి. పండ్లు ఎవరైనా తింటారు గాని, పండ్లతో భారీ కళాప్రదర్శనలు చేయడమే ఫ్రెంచి ప్రజల ప్రత్యేకత. ఫ్రాన్స్‌ ఆగ్నేయ ప్రాంతంలో ఇటలీ సరిహద్దులకు చేరువలో ఉన్న మెంటన్‌ నగరం ఏడాదికి ఒకసారి ఫలకళను సంతరించుకుంటుంది. పదిహేను రోజుల పాటు అట్టహాసంగా జరిగే ఈ ఫలకళా మహోత్సవాన్ని ‘ఫెట్‌ డి సిట్రాన్‌’ అని, ‘ఫెస్టివల్‌ డి లిమన్‌’ అని అంటారు. ఫలకళాకృతుల ప్రదర్శనతో పాటు ఊరంతా వీథి వీథినా ఊరేగింపులు, నృత్యగాన ప్రదర్శనలు కూడా నిర్వహిస్తూ ఉండటం వల్ల ఈ వేడుక ‘కార్నివాల్‌ ఆఫ్‌ మెంటన్‌’గా కూడా ప్రసిద్ధి పొందింది.

మెంటన్‌ నగరంలో ఈ ఫలకళా మహోత్సవం నిర్వహణ 1934 నుంచి ప్రారంభమైంది. నాటి నుంచి ఏటా జరిగే ఈ వేడుకలకు రెండో ప్రపంచయుద్ధం కారణంగా 1940–46 మధ్యకాలంలోను, గల్ఫ్‌ యుద్ధం కారణంగా 1991లోను, ‘కోవిడ్‌–19’ కారణంగా 2021లోను అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈ ఆటంకాలు మినహా మిగిలిన సంవత్సరాలలో ఈ వేడుకలు అట్టహాసంగా జరుగుతూనే వచ్చాయి. అదే రీతిలో ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 14 నుంచి మార్చి 1 వరకు మెంటన్‌ నగరంలో ఫలకళా మహోత్సవం సందడిగా జరుగుతోంది. 

ఈసారి మెంటన్‌ ఫలకళా మహోత్సవం ‘వండర్స్‌ ఆఫ్‌ లైఫ్‌’ను థీమ్‌గా ఎంచుకుంది. ఇందులో భాగంగా నిమ్మ జాతికి చెందిన నిమ్మ, నారింజ, బత్తాయి, దబ్బపండ్లతో వైవిధ్యభరితమైన జీవరాశుల కళాకృతులను వీథుల్లో అలంకరించారు. ఈ ఏడాది ఫలశిల్పాల కోసం 140 టన్నులకు పైగా పండ్లను వినియోగిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 15, 22 తేదీల్లోను; మార్చి 1న జరిగే ‘గోల్డెన్‌ ఫ్రూట్‌ పరేడ్‌’లో దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. మేళతాళాలు, నృత్య గానాలతో వీథి వీథినా జరిగే ఊరేగింపులతో మెంటన్‌ నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈసారి వాలెంటైన్స్‌ డే రోజు నుంచి ‘కార్నివాల్‌ ఆఫ్‌ మెంటన్‌’ కూడా ప్రారంభం కావడంతో మెంటన్‌ వీథులన్నీ యువజంటల కేరింతలతో కొత్త కళను సంతరించుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement