కథ: భోజనప్రియుడు | kids story on family | Sakshi
Sakshi News home page

కథ: భోజనప్రియుడు

Feb 21 2026 9:01 AM | Updated on Feb 21 2026 9:06 AM

kids story on family

అనగనగా ఓ ఊళ్లో రాంభొట్లు అనే వ్యక్తి ఉండేవాడు. అతను భోజన ప్రియుడు. భోజనానికి కూర్చుంటే గంటదాకా లేచేవాడు కాదు. భారీ గిన్నె అన్నం, పప్పు, పులుసు, పచ్చడి, పాయసం, పెరుగును ఒక్కడే తినేవాడు.  అతని తిండి సంగతి తెలిసిన ఊరిలోని వారు అతణ్ని బంతి చివర్లో కూర్చోబెట్టేవారు. అందరి భోజనాలు అయ్యాక మిగిలినదంతా అతనికే పెట్టేవారు. తిన్న కొద్దీ వడ్డిస్తూ ఉండేవారు. 

ఒకనాడు ఆ ఊరిలో కామయ్య శెట్టి అనే ధనవంతుడి ఇంట్లో అన్న సంత్పరణ ఏర్పాటు చేశారు. అందరితోపాటు రాంభొట్లునూ భోజనానికి పిలిచారు. కామయ్య శెట్టి దానగుణం కలిగినవాడు. అయితే అతని భార్య రుక్మిణి పిసినారి. భర్త ఇలా దానధర్మాలు చేసి ఇల్లు ఊడ్చేస్తున్నాడని విసుక్కునేది. సంతర్పణ రోజున అంతమందికి భోజనాలంటే ఇల్లు గుల్లవుతుందని భావించి ఓ ఉపాయం ఆలోచించింది. చిన్న పరిమాణంలో లడ్లు, బూరెలు, గారెలు తయారు చేయించింది.  పాయసం కూడా చిన్న చిన్న లోటాల్లోపోయమని పనివాళ్లకి చెప్పింది. చిన్నపరిమాణంలో ఉన్న ఆహార పదార్థాలు ఒక్కటి వేస్తే సరిపోతుందని ఆమె ఆలోచన. 

ఆ అన్నసంతర్పణకు రాంభొట్లు ముందుగానే హాజరయ్యాడు. వచ్చినవాణ్ని తర్వాత రమ్మనడం ఇష్టం లేక కామయ్య శెట్టి అతణ్ని కూడా బంతిలో కూర్చోబెట్టాడు. పనివారు వచ్చి లడ్లు, గారెలు, బూరెలు వడ్డించారు. చిన్నలోటాలో పాయసం ఇచ్చారు. అక్కడ జరిగిందేమిటో అందరూ గ్రహించినా ఏమీ అనలేక వాటినే తినడానికి తయారయ్యారు. ఈ సంగతి గమనించిన రాంభొట్లు అందరివంకా చూసి ‘హబ్బా! ఇవాళ నాకో కొత్త ఆలోచన వస్తోంది’ అన్నాడు. అందరూ తినకుండా అతని వైపు చూశారు. 

‘ఏమీ లేదు. కళ్లు మూసుకొని నేను ఎన్ని పదార్థాలు తినగలనా అని సరదాగా ఓ పందెం వేసుకోవాలని అనుకుంటున్నాను. ఆకు ఖాళీ అయ్యేదాకా నేను కళ్లు తెరవను. నేను కళ్లు తెరిచేదాకా ఆకు ఖాళీ అవ్వకూడదు. ఎలా ఉంది పందెం? నాతోపాటు మీరూ ప్రయత్నిస్తారా?’ అన్నాడు. 

అతను వేసిన పథకం అర్థమై అందరూ తలూపారు. కళ్లు మూసుకొని చిన్న పరిమాణంలో ఉన్న లడ్లు, గారెలు, బూరెలు తినడం మొదలుపెట్టారు. అవి పూర్తయినా వారు కళ్లు తెరవకపోవడంతో పనివారు మరిన్ని లడ్లు, గారెలు, బూరెలు వడ్డించారు. రాంభొట్లుతోపాటు అందరూ కళ్లు మూసుకొని తింటూనే ఉన్నారు. మరో పక్క పనివారు చకాచకా వడ్డిస్తూనే ఉన్నారు. చివరకు తయారు చేసిన పదార్థాలన్నీ అయిపోయాయి. అందరి కడుపులూ నిండాయి. దీంతో కళ్లు తెరిచారు. రాంభొట్లు మాత్రం కళ్లు తెరవకుండా ఇంకా పదార్థాలు కావాలన్నట్లు ఉండిపోయాడు. 

జరిగిన పోరపాటు గ్రహించిన రుక్మిణి ఆయన ముందుకు వచ్చి ‘అయ్యా! ఏదో తెలియనితనంతో ఈ పని చేశాను. నా పిసినారితనానికి తగిన బుద్ధి చెప్పారు. ఇకపై ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయను’ అని వేడుకుంది. రాంభొట్లు కళ్లు తెరిచి సంతృప్తిగా పోట్ట నిమురుకున్నాడు.  

Advertisement
 
Advertisement
Advertisement