పెరుగుపై పేరుకునే నీరు పారబోస్తున్నారా..? | Curd contains water and nutritional values | Sakshi
Sakshi News home page

పెరుగుపై పేరుకునే నీరు పారబోస్తున్నారా..?

Feb 21 2026 6:01 AM | Updated on Feb 21 2026 6:01 AM

Curd contains water and nutritional values

హెల్త్‌ టిప్‌

ప్రతిరోజూ మనం కిచెన్‌లో చేసే చిన్నచిన్న పొరపాట్లు మన ఆరోగ్యంపై ఎంతగానో ప్రభావం చూపిస్తాయి. సాధారణంగా మనం ఇంట్లో పెరుగు తోడుపెట్టినపుడు, దానిపై ఒక పలుచని నీరులాంటి పొర పేరుకుపోతుంది. చాలా మంది దీనిని పారబోస్తుంటారు. కానీ ఇందులోనే ఎంతో ముఖ్యమైన పోషక విలువలున్నాయని వైద్యులు చెబుతున్నారు. పాలు తోడు పెట్టినపుడు పెరుగుగా మారే ప్రక్రియలో పాలుగడ్డకట్టి, నీటి  రూపంలో ఉండే ప్రోటీన్లు విడిపోయి పైకి చేరుతాయి.

 దీనినే చల్ల అని, వే ప్రోటీన్‌ అని, మజ్జిగతేట అని పలు రకాలుగా పిలుస్తుంటారు. ఇందులో కండరాల నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇంకా కాల్షియం, పొటాషియం వంటి గుండెకు, ఎముకలకు మేలుచేసే పోషకాలు కూడా ఉంటాయి. అలాగే ఇది పేగు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. సాధారణంగా జిమ్‌కు వెళ్లేవారు, లేదంటే కండరాల పుష్టికోసం వేల రూపాయలు ఖర్చు చేసి కొనే ప్రోటీన్‌ పౌడర్లు ఈ ద్రవం నుంచే తయారవుతాయి. 

పరిశ్రమలలో ఈ ద్రవాన్ని సేకరించి, ఫిల్టర్‌ చేసి, ఎండబెట్టి పౌడర్‌గా మారుస్తారు. ఇంట్లో అది సహజ రూపంలోనే లభిస్తోంది. కాబట్టి ఇకపై పెరుగుపై నీరు కనిపిస్తే దాన్ని పారబోయకుండా, తిరిగి ఆ పెరుగులోనే కలిపేయండి. దీనివల్ల పెరుగులోని పూర్తి పోషకాలు మన శరీరానికి అందుతాయి. చిన్న మార్పుతో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement