చంద్రబాబు సొంత సంస్థ... హెరిటేజ్‌ పెరుగు ‘నాసిరకం’ | FSSAI Issued notice to Chandrababu Heritage Products | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సొంత సంస్థ... హెరిటేజ్‌ పెరుగు ‘నాసిరకం’

Feb 8 2026 4:33 AM | Updated on Feb 8 2026 10:03 AM

FSSAI Issued notice to Chandrababu Heritage Products

అందులో మిల్క్‌ ఫ్యాట్‌ కనీస స్థాయిలోనూ లేదు

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్ధారణ 

జరిమానా విధింపు..

కేంద్ర సంస్థ నిర్ధారణతో హెరిటేజ్‌ ఉత్పత్తులపై సందేహాలు 

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమేంటంటూ నిపుణుల ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సొంత సంస్థ హెరిటేజ్‌ ఫుడ్స్‌ బండారం మరోసారి బయటపడింది. ఆ కంపెనీ తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో నాణ్యత డొల్లేనని అధికారికంగా ఇంకోసారి స్పష్టమయింది. ‘టోటల్‌ కర్డ్‌’అంటూ హెరిటేజ్‌ సంస్థ విక్రయిస్తున్న పెరుగు నాసిరకమని, అందులో ఉండాల్సిన ఫ్యాట్‌ కనీస స్థాయిలో కూడా లేదని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) స్పష్టం చేసింది. కనీస ఫ్యాట్‌ కూడా లేని హెరిటేజ్‌ పెరుగు నాసిరకమైనదని నిర్ధారిస్తూ ‘సబ్‌–స్టాండర్డ్‌’అనే ముద్ర వేసింది. ఇలాంటి ఉత్పత్తులు విక్రయిస్తున్నందుకు రూ.లక్ష జరిమానా చెల్లించాలని హర్యానాలోని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ డిప్యూటీ కమిషనర్‌ (అడ్జుడికేటింగ్‌ అథారిటీ) ఆదేశించటంతో విధిలేక హెరిటేజ్‌ సంస్థ ఆ జరిమానాను చెల్లించింది. ఈ విషయాన్ని సెబీ నిబంధనల ప్రకారం స్టాక్‌ మార్కెట్‌కు తెలియజేయాలి కనక... గత నెలలో హెరిటేజ్‌ సంస్థ స్వయంగా తెలియజేసింది.  

‘‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మా పెరుగు శాంపిళ్లను పరిశీలించింది. కాకపోతే నిబంధనల ప్రకారం వాటిలో ఉండాల్సిన కనీస పాల–ఫ్యాట్‌ కూడా లేదని ఆ సంస్థ తేల్చింది. ఈ మేరకు మా కంపెనీకి జజ్జర్‌లోని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి నోటీసు వచ్చింది. మాకు రూ.లక్ష జరిమానా విధించగా మేం దాన్ని చెల్లించాం’’అని హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ స్టాక్‌ మార్కెట్లకు తెలియజేసింది. ఈ జరిమానా చెల్లించటం వల్ల తమ కంపెనీపై ఆర్థికంగా పెద్దగా ప్రభావం పడదని కూడా కంపెనీ తెలియజేసింది. ఇదంతా ఒకెత్తయితే పెరుగులో పాలకు సంబంధించిన ఫ్యాట్‌ కనీస స్థాయిలో కూడా లేకపోవటంతో ఇది దేంతో తయారవుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘‘పాల–ప్యాట్‌లో ఏ చిన్న తేడాలున్నా అది సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయమే.

అలాంటిది పెరుగులో కనీస స్థాయిలో కూడా మిల్క్‌ ఫ్యాట్‌ లేదంటే ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే పాలతోనే కదా పెరుగు తయారవుతుంది? అందుకే మేం తరచూ శాంపిళ్లు తీసుకుంటుంటాం. హెరిటేజ్‌ పెరుగు నాసిరకమని తేలటంతో జరిమానా కూడా విధించాం’’అని ఫుడ్‌ సేఫ్టీ వర్గాలు తెలియజేశాయి. వాస్తవానికి జరిమానా మొత్తం చిన్నదే. దానివల్ల కంపెనీపై ఆర్థికంగా ప్రభావమేమీ ఉండకపోవచ్చు.

కానీ పాలు, పెరుగు వంటివి భారీ సంఖ్యలో జనం నిత్యం వాడే ఉత్పత్తులు. ‘‘వీటిలో నాణ్యత లేదంటే ... అది కంపెనీ ఉత్పత్తులపై నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుంది. దీర్ఘకాలంలో కంపెనీ మనుగడకు ఇలాంటి అంశాలు సవాళ్లు విసురుతాయి’’అని మార్కెట్‌ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కంపెనీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిదని, ఉత్పత్తుల్లో నాణ్యత లేకపోవటం ఏమాత్రం సమ్మతం కాదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement